ఇదో ‘చెత్త’ వార్డు !

ABN , First Publish Date - 2020-06-03T11:28:27+05:30 IST

కరోనా బారిన పడకుండా ఉండాలంటే శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డాక్టర్లే చెబుతున్నారు. అందులో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే

ఇదో ‘చెత్త’ వార్డు !

శుభ్రం చేయలేక.. తరలింపు..!

కరోనా చిన్నపిల్లల వార్డులో దుస్థితి

‘గాంధీ’లో అడుగడుగునా నిర్లక్ష్యం

ఏడాది చిన్నారికి వైద్యం  అందక ఇబ్బందులు

పాలు కూడా ఇవ్వలేని దైన్యం 


అడ్డగుట్ట, జూన్‌2 (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడకుండా ఉండాలంటే శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డాక్టర్లే చెబుతున్నారు. అందులో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్తగా  ఉండాలని కరోనా కలకలం ప్రారంభమైన నాటి నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు. కొవిడ్‌ నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ బారిన పడిన చిన్నారులకు చికిత్స అందింస్తుండగా, వారి విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వైరస్‌ సోకి ఆస్పత్రిలో చేరిన చిన్నారులను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికార యంత్రాం గం పరోక్షంగా వారికి మరిన్ని ఆరోగ్య సమస్యలు సృష్టించేందుకు కారణమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. 


గాంధీ ఆస్పత్రి ఆరో అంతస్తులో సుమారు 35 మంది చిన్నారులు కరోనా చికిత్సలు పొందుతున్నట్లు సమాచారం. అయితే, అదే అంతస్తులో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. చిన్నారులకు వైద్యసేవలు అందించే వైద్యుల నుంచి మొదలుకొని పారిశుధ్య సిబ్బంది వరకూ ఆ అంతస్తుకు వచ్చి వెళ్తున్నా.. అక్కడి చెత్తకుప్పలు మాత్రం వారికి కనిపించడం లేదు. గుట్టలుగా పేరుకుపోతున్న చెత్త, ఇతర వ్యర్థాలతో వార్డు మొత్తం దోమలు, దుర్వాసనను చిన్నారులు తట్టుకోలేక పోతున్నారు. ఆ చెత్తలో రక్తపు మరకలతో నిండిన వ్యర్థాలు, కరోనా చికిత్సకు ఉపయోగించిన వ్యర్థాలు అధికంగా ఉన్నాయి. 


వార్డు తరలింపు..!

ఆరో అంతస్తులో చిన్నారులకు కరోనా చికిత్సలు అందిస్తున్న ప్రాంతంలోని చెత్తకుప్పలను చూసి వైద్య సిబ్బంది కూడా భయాందోళనలకు గురవుతున్నారు. చెత్తకుప్పల నుంచి దుర్గంధం భరించలేక.. చెత్త తొలగించే వారు లేక చిన్నారుల వార్డును రాత్రికి రాత్రే మొదటి అంతస్తుకు తరలించినట్లు సమాచారం.  


ఏడాది చిన్నారికి కష్టాలు.. 

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఏడాది చిన్నారికి వైద్యం అందించే విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇబ్రహీంపట్నంకు చెందిన 13 నెలల చిన్నారి తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా, తల్లిదండ్రులు కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరోనా లక్షణాలు ఉన్నాయని చిన్నారిని కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మే 30న గాంధీకి తీసుకొచ్చారు. అయితే, మరుసటి రోజు వరకు ఆ చిన్నారికి వైద్యం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని తల్లిదండ్రులు అంటున్నారు. పలుమార్లు అడిగితే ఓ నర్సు వచ్చి సెలైన్‌ పెట్టింది. మే 31న రాత్రి నిద్ర పోతున్న ఆ చిన్నారి ఐవీ క్యానులా పైప్‌ నుంచి రక్తం కారుతున్నా నర్సులు పట్టించుకోలేదని వారంటున్నారు. ఆస్పత్రికి వచ్చి మూడు రోజులు గడుస్తున్నా చిన్నారికి వైద్యం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఆ చిన్నారి బెడ్‌ పక్కనే వారం క్రితం చేరిన మరో చిన్నారికి సకాలంలో వైద్యం అందక సోమవారం చనిపోవడంతో ఆ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు.


పాలూ ఇవ్వడం లేదు.. 

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన చిన్నారులకు రోజూ రెండు లేదా మూడుసార్లు పాలు ఇవ్వాల్సిన బాధ్యత డైట్‌ క్యాంటిన్‌కు ఉంటుంది. అయితే, ఇక్కడ చికిత్స పొందుతున్న చిన్నారికి మొదటి రోజు ఒక పూట మాత్రమే పాలు ఇచ్చారు. ఆ తర్వాత మరచిపోయారు. ఇదేమని అడిగితే పాలు కొరతగా ఉన్నాయని డైట్‌ క్యాంటిన్‌ సిబ్బంది బెదిరిస్తున్నారు. మూడు పూటలా పాలు పోయాల్సిన వారు ఒక్క పూట కూడా సరిగ్గా ఇవ్వలేదని అంటున్నారు. దీంతో ఈ వార్డులో చంటిబిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


కరోనా వార్డులో ఊడి పడిన ఫ్యాన్‌

గాంధీ ఆస్పత్రి కరోనా వార్డులో మంగళవారం ఓ ఫ్యాన్‌ ఊడి కిందపడింది. దీంతో ఓ రోగికి స్వల్పగాయాలయ్యాయి. ఆస్పత్రిలోని ఏడో అంతస్తులో కరోనా వార్డు ఉంది. ఇందులో పలువురు రోగులు ఉండగా, భౌతిక దూరం పాటించేలా దూరం.. దూరంగా మంచాలు ఏర్పాటు చేశారు. అయితే, మంగళవారం ఒక్కసారిగా పైకప్పు నుంచి ఫ్యాన్‌ ఊడి, మంచాల మధ్య పడింది. ఫ్యాన్‌ రెక్కలు ఓ రోగికి తగిలాయి. ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా చాలా సేపటి వరకు ఎవరూ స్పందించలేదు.  


Updated Date - 2020-06-03T11:28:27+05:30 IST