పంట రుణాల రెన్యూవల్‌లో... బ్యాంకుల మెలిక

ABN , First Publish Date - 2022-04-22T07:44:07+05:30 IST

రైతే రాజంటారు ఈ పదాలు చెప్పుకోడానికే పరిమితమవుతాయి. అటు పాలకులు కానీ, ఇటు అధికారులు కానీ రైతన్నల కష్ట నష్టాలను సాదక బాధలను గుర్తించడం లేదు. రైతన్నలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పంట రుణాల రెన్యూవల్‌లో కూడా బ్యాంకర్లు

పంట రుణాల రెన్యూవల్‌లో...  బ్యాంకుల మెలిక

అసలూ వడ్డీ చెల్లిస్తేనే క్రమబద్ధీకరణ

ఆందోళన చెందుతున్న అన్నదాతలు 

అప్పు చెల్లించేందుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

కడప, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : రైతే రాజంటారు ఈ పదాలు చెప్పుకోడానికే పరిమితమవుతాయి. అటు పాలకులు కానీ, ఇటు అధికారులు కానీ రైతన్నల కష్ట నష్టాలను సాదక బాధలను గుర్తించడం లేదు. రైతన్నలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పంట రుణాల రెన్యూవల్‌లో కూడా బ్యాంకర్లు కనికరం చూపడం లేదు. పంట సాగు కోసం తీసుకున్న రుణాలను అసలుతో పాటు వడ్డీ కలిపి చల్లిస్తేనే రెన్యూవల్‌ చేస్తామని చెప్పడం రైతాంగంపై పిడుగుపాటయ్యింది. ఏటా అతివృష్టి, అనావృష్టి, చీడపీడలతో పంటలు చేతికందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం సాగు పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతుల పై కనికకరం చూపాల్సిన బ్యాంకులు పాత విధానానికి స్వస్తి పలికి పంట రుణాల అసలు, వడ్డీలు చెల్లించాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తుండడం ఆగ్రహం తెప్పిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇలాఖాలోనే బ్యాంకుల వైఖరి నిరసిస్తూ రైతులు బ్యాంకుల ఎదుట ఽఆందోళనకు దిగారు. ప్రతి ఏటా జూన్‌ 1న  ఖరీఫ్‌ మొదలవుతుంది. అక్టోబర్‌ నుంచి రబీ మొదలవుతుంది. ఆయా సీజన్లను బట్టి రైతులు శనగ, పత్తి, వరి, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, సజ్జ, పసుపు, తదితర పంటలు సాగు చేస్తుంటారు. రైతులు తమకు ఉన్న భూములు తనఖా పెట్టి బ్యాంకుల్లో ఆయా పంటల కోసం రుణాలు తీసుకుంటుంటారు. ప్రతి ఏటా సాగు పెట్టుబడులు లెక్కిస్తూ ఏఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలో ఒక కమిటీ సిఫారసు చేస్తుంది. సేల్‌ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం ఆయా పంటలకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. అయితే చాలా చోట్ల సేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం ఆయా పంటలకు రుణాలు ఇవ్వడం లేదు. వెరసి పంటల సాగుకు బ్యాంకులు ఇచ్చే రుణం సరిపోక రైతులు ప్రైవేటు వ్యాపారస్తుల వద్ద అప్పు తెచ్చుకుంటున్నారు.


పంట రుణాల రెన్యూవల్‌పై మెలిక 

గత ఏడాది ఖరీ్‌ఫలో (ఉమ్మడి జిల్లాలో) రూ.3894 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా.. లక్ష్యానికి మించి రూ.4123 కోట్లు రుణం ఇచ్చారు. ఖరీ్‌ఫలో 291293 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. రబీలో రూ.2706 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా.. ఫిబ్రవరి చివరి నాటికి 19254 మంది రైతులకు రూ.2462 కోట్లు ఇచ్చారు. కాగా జిల్లాలో అన్ని బ్యాంకులకు సంబంధించి 376 బ్రాంచులు ఉన్నాయి. వీటిలో చాలా మంది రైతులకు పంట రుణాలు ఇస్తున్నప్పటికీ ప్రధానంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ రుణాలు ఇస్తుంటుంది. జిల్లాలో ఏపీజీబీ 112 బ్రాంచులు కలిగి ఉంది. గత ఖరీఫ్‌లో 131855 మందికి రూ.1053 కోట్ల పైచిలుకు రుణాలు ఇచ్చింది. ఈ రుణాలను చెల్లించేందుకు రైతులు బ్యాంకులకు వెళుతున్నారు. ఇప్పటిదాకా తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లిస్తే రెన్యూవల్‌ చేసే వారు. అయితే ఇప్పుడు అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లిస్తేనే రెన్యూవల్‌ చేస్తామని ఏపీజీబీ అధికారులు చెప్పడంతో రైతులు ఒక్కసారి కంగుతిన్నారు. గత ఏడాది వర్షాల వ ల్ల చేతికొచ్చిన పంట నేల పాలైంది. ప్రభుత్వ ఇచ్చిన ఆర్థిక సాయం పెట్టుబడి కూడా అందని పరిస్థితి. అసలే పంటలు రాక అప్పుల్లో ఉన్న రైతులకు ఇప్పుడు అసలు వడ్డీ చెల్లిస్తేనే రె న్యూవల్‌ చేస్తామని చెప్పడం. గోరు చుట్టుపై రోకలి పోటులా తయారైంది. అసలు వడ్డీ చెల్లించాలంటే రైతుల వద్ద చిల్లి గవ్వ లేదు. మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాలి. వడ్డీకి తీసుకుంటే వ్యాపారస్తులు 4 రోజులకు, వారం రోజులకు కొన్ని ప్రాంతాలను బట్టి లక్షకు రూ.3 వేల నుంచి 5 వేలు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. బ్యాంకుల నిర్ణయాన్ని తట్టుకోలేక రైతులు ఆందోళనకు దిగుతున్నారు.

 

పాత విధానం ప్రకారమే రెన్యూవల్‌ 

- ఎస్‌.దుర్గాప్రసాద్‌, ఎల్‌డీఎం 

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో పాత విధానం ప్రకారమే పంట రుణాలు రెన్యూవల్‌ చేస్తాం. ఈ మేరకు జేసీ సాయికాంత్‌వర్మ ఏపీజీబీ ఆర్‌ంఎంతో మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా పాత విధానం ప్రకారమే రెన్యూవల్‌ జరుగుతాయి. రైతులు  ఆందోళన చెందవద్దు. 


సేల్‌ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలి 

- గాలి చంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి (సీపీఐ అనుబంధం)

సేల్‌ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రైతులకు పంట రుణాలు ఇవ్వాలి. సాగు పెట్టుబడి వ్యయాన్ని అంచనా వేస్తూ ఏటా సేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌లో మార్పులు ఉంటాయి. అందుకు తగ్గట్లుగా రుణాలు ఇస్తే రైతులు పంట సాగుకోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించరు. అసలు వడ్డీ చెల్లిస్తేనే రెన్యూవల్‌ చేస్తామని చెప్పడం సమంజసం కాదు. కొన్ని చోట్ల కొందరు బ్యాంకు ఉద్యోగులు, వడ్డీ వ్యాపారులు కుమ్మకై అసలు వడ్డీ కలిపి కట్టేలా రైతు లపై ఒత్తిడి తెస్తున్నారు. సేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు ఇవ్వకపోతే ఆందోళన చేపడతాం. 


పాత విధానాన్నే కొనసాగించాలి

- వెంకటశివారెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

గత ఏడాది కురిసిన వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం అరకొర సాయం ఇచ్చి చేతులు దులుపుకుంది. పెట్టుబడి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో రైతులకు ఉదారంగా రుణాలు ఇవ్వాల్సిన బ్యాంకులు అసలూ వడ్డీ కడితేనే రెన్యూవల్‌ చేస్తామని చెప్పడం దారుణం. పాత విధానం ప్రకారమే రెన్యూవల్‌ చేయాలి.  


పంట రుణాలు బేషరుతుగా రెన్యూవల్‌ చేయాలి

-దస్తగిరిరెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి (సీపీఎం అనుబంధం) 

వరదలు, వర్షాలతో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. సాగు పెట్టుబడి కూడా దక్కలేదు. కనుక పంట రుణాన్ని బ్యాంకులు బేషరుతుగా రెన్యూవల్‌ చేయాలి. అసలుతోపాటు వడ్డీ చెల్లిస్తేనే రెన్యూవల్‌ చేస్తామని చెప్పడం సమంజసం కాదు. పంట రుణాల చెల్లింపు కోసం బ్యాంకుల వేధింపులు ఆపాలి. 


Updated Date - 2022-04-22T07:44:07+05:30 IST