కాంగ్రెస్ హయాంలో భారత్ పాక్షికంగా ముస్లిం దేశం : బీజేపీ

ABN , First Publish Date - 2021-11-14T02:29:32+05:30 IST

హిందుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌పై బీజేపీ మరో

కాంగ్రెస్ హయాంలో భారత్ పాక్షికంగా ముస్లిం దేశం : బీజేపీ

న్యూఢిల్లీ : హిందుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌పై బీజేపీ మరో ఆరోపణ చేసింది. కాంగ్రెస్ హయాంలో భారత దేశం పాక్షికంగా ఓ ముస్లిం దేశంగా ఉండేదని పేర్కొంది. ఆ కాలంలో షరియా నిబంధనలు న్యాయ వ్యవస్థలో భాగంగా ఉండేవని, సుప్రీంకోర్టు తీర్పు కన్నా షరియా నిబంధనలకే పెద్ద పీట వేయడానికి చర్యలు తీసుకున్నారని పేర్కొంది. 


బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు ప్రతీక అని, హిందుత్వంపై వ్యతిరేకతను, విద్వేషాన్ని వ్యాపింపజేస్తోందని, అల్లర్లకు కారణమవుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో భారత దేశం పాక్షికంగా ఓ ముస్లిం దేశంగా ఉండేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఓ భాగంగా షరియా నిబంధనలు ఉండేవని, అందుకే తాను ఈ విధంగా చెప్తున్నానని అన్నారు. వెంట వెంటనే మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇచ్చే విధానం అమలు, హజ్ సబ్సిడీల మంజూరు వంటి అంశాలను గుర్తు చేశారు. షరియా నిబంధనలకు పెద్ద పీట వేయడం కోసం సుప్రీంకోర్టు తీర్పునే తోసిపుచ్చారని గుర్తు చేశారు. షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును తోసిపుచ్చేందుకు రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 


త్రిపురలో మసీదులపై దాడులు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మహారాష్ట్రలో హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. హిందుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించడం ఆ మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెద్ద కుట్రలో భాగమని వ్యాఖ్యానించారు. హిందుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని రాహుల్ గాంధీ తన పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారేమోనన్నారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు, హింసను ప్రేరేపించేందుకు వ్యవస్థీకృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుందన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినపుడు హిందూయిజం, హిందుత్వం మధ్య తేడాను చెప్పే ప్రయత్నం చేశారని, ఆ తర్వాత హిందుత్వంపై దాడి చేశారని అన్నారు. 


Updated Date - 2021-11-14T02:29:32+05:30 IST