న్యూఢిల్లీ: రెండేళ్లుగా పార్టీలోని నేతలు చేస్తున్న వరుస రాజీనామాలు, తిరుగుబాటులు కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. తరుచూ ఏదో ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామానో, తిరుబాటో చేయడం వార్తల్లో సాధారణ వార్త అయిపోయింది. వాస్తవానికి ఈ రాజీనామా పర్వం కాంగ్రెస్ కీతక నేత రాహుల్ గాంధీ నుంచే ప్రారంభమైందని చెప్పాలి. 17వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోర పరాజయం చవిచూసిన అనంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లో వరుస రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కుదుపులతో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కూడా కోల్పోయింది.
కర్ణాటకలో జూలై మొదటి వారంలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ స్వంతంగా అధికారంలో ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కీలక నేతగా ఉన్న జ్యోతిరాధిత్య సింథియా తనకు మద్దతుగా ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అనంతరం సింథియాతో కలిసి బీజేపీలో చేరిపోయారు. 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి తలిగిన అతిపెద్ద ఎదురుదెబ్బ ఇదేనని అంటుంటారు.
మధ్యప్రదేశ్ కొనసాగింపులోనే ముందు నుంచి వస్తున్న అంచనాల ప్రకారమే రాజస్తాన్ కాంగ్రెస్ అధినేత, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. తనకు మద్దతుగా ఉన్న 20కి పైగా ఎమ్మెల్యేలతో గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. అయితే కాంగ్రెస్‌కు ఇక్కడ కొంచెం ఊరట కలిగింది. గెహ్లాట్ చాతుర్యం వల్ల బల పరీక్షలో గెహ్లాట్ ప్రభుత్వం గెలిచింది. దీంతో సచిన్ పైలట్ వెనక్కి రాక తప్పలేదు. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న తీవ్రమైన సంక్షోభాలు ఇవి. కాగా ఇతర రాష్ట్రాల్లో అనేక మంది కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేసి వేరే పార్టీల్లో చేరారు. ప్రస్తత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వ్యక్తే.
కాగా, ఇంతకు ముందు జరిగినవి ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం పంజాబ్‌లో పరిణామాలైతే మరింత తీవ్రంగా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వరుస ఓటముల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ కాస్త ఆశాజనంగా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా పంజాబ్‌లో ఉన్న మొత్తం 13 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు గెలిచింది. అంతే కాకుండా 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ 77 స్థానాలో ఉండడంతో కాంగ్రెస్‌లో కొంత విశ్వాసం ఉండేది. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం, ఆ వెంటనే పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేయడం పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఘోరంగా దెబ్బకొట్టింది.
పార్టీలో నేతల రాజీనామాలపై పార్టీ అధినేతలకు ముందస్తుగా సమాచారం ఉన్నప్పటికీ నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాధాన్యాల విషయంలో సీనియర్ నేతల్ని పట్టించుకోవడం లేదని, పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడంలో కూడా అధిష్టానం విఫలమవుతోందని, పార్టీ ప్రస్తుతం నాయకత్వ సమస్యను ఎదుర్కోంటోందని అనేకానేక గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే రాహుల్‌తో ప్రారంభమైన రాజీనామాల పర్వం నేటికీ కొనసాగుతోందని అంటున్నారు.