మళ్లీ ఇనచార్జ్‌ పాలనే!

ABN , First Publish Date - 2022-09-29T06:03:18+05:30 IST

జిల్లా సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుధాకర్‌ బదిలీ అయ్యారు. కర్నూలు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆయన్ను నియమించారు.

మళ్లీ ఇనచార్జ్‌ పాలనే!

పెద్దాసుస్పత్రి సూపరింటెండెంట్‌ బదిలీ

 అనంతపురం టౌన, సెప్టెంబరు 28: జిల్లా సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుధాకర్‌ బదిలీ అయ్యారు. కర్నూలు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆయన్ను నియమించారు. ఐదు రోజుల క్రితం ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఈ విషయం బయట పడకుండా గుట్టుగా వ్యవహరించారు. ఇక్కడికి ఎవరినీ నియమించలేదు. సీనియర్‌ వైద్యులకు ఇనచార్జ్‌ బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. ప్రస్తుతం సర్వజన ఆస్పత్రిలో సీనియర్‌ వైద్యులుగా రఘునందన, మాణిక్యాలరావు, కిషోర్‌, రామకృష్ణనాయక్‌ ఉన్నారు. అందరికన్నా సీనియర్‌ ఆర్థో హెచఓడీ డాక్టర్‌ రఘునందన. నిబంధనల మేరకు ఆయనకు ఇనచార్జ్‌ బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ఆయన విముఖత వ్యక్తం చేశారని తెలిసింది. ఆ తర్వాత సీనియర్‌ వైద్యులు ముగ్గురు కూడా ఇనచార్జ్‌ బాధ్యతలు తీసుకోవడానికి ససేమిరా అంటున్నట్లు చర్చ సాగుతోంది. దీంతో బదిలీ ఉత్తర్వులు వచ్చినా, ఎవరికి ఇనచార్జ్‌ బాధ్యతలు ఇవ్వాలో తెలీక డాక్టర్‌ సుధాకర్‌ అయోమయంలో ఉన్నారని ఆస్పత్రిలో చర్చించుకుంటున్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ నీరజ సైతం సెలవులో వెళ్లారు. ఆమె కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ సమస్య కొలిక్కి రాలేదని మాట్లాడుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆస్పత్రికి ఇనచార్జ్‌లే దిక్కుగా మారారు. ఈ ఏడాది మేలో రెగ్యులర్‌ సూపరింటెండెంట్‌గా సుధాకర్‌ను నియమించారు. ఆయన మే 11న ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు. ఐదు నెలలు కూడా గడవకనే ఆయన కూడా పైరవీలు చేసుకొని తిరిగి కర్నూలుకు బదిలీ చేయించుకున్నారు.  

Updated Date - 2022-09-29T06:03:18+05:30 IST