Abn logo
Mar 26 2020 @ 00:43AM

అత్యవసర వేళలో...

కరోనా వైరస్‌ వ్యాధి నేపథ్యంలో... దేశమంతటా లాక్‌డౌన్‌ అయింది. కొన్ని ప్రాంతాల్లో, నిర్ణీత సమయాల్లో కర్ఫ్యూ కూడా అమలులో ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా, అందరం ఇళ్ళకే పరిమితమైపోయిన పరిస్థితి. ఈ సందర్భంలో మనం రోజువారీ జీవితంలో చేయదగినవి, చేయదగనివి మరోసారి గుర్తు చేసుకుందాం.


ఊరి చివరి నుంచి నేను నగరంలో ఉద్యోగానికి వెళ్ళాల్సి ఉంది. ఎలా?

పోలీసులు, అగ్నిమాపకదళం, ఆసుపత్రులు, మీడియా లాంటి అత్యవసర సర్వీసుల వాళ్ళకు అనుమతి ఉంది. అలాగే, నిత్యావసరాలు, వాటికి సరఫరా, రవాణాకు సంబంధించినవారినీ, మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్నవారినీ అనుమతిస్తారు. 


ఇంట్లో పనిచేయడానికి పనిమనుషులు రావచ్చా?

లాక్‌ డౌన్‌ సమయంలో అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రమ్మని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగని కాలనీలో పనివారి రాకపోకలను నిషేధిస్తూ ఆదేశాలేమీ లేవు. అయితే, పలుచోట్ల రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు పనివారిని రావద్దని స్వచ్ఛందంగా చెబుతున్నారు. పైపెచ్చు, ప్రజా రవాణా వ్యవస్థ లేని పరిస్థితుల్లో పనివారు రావడం, పోవడం కష్టమే. నేను షుగర్‌ పేషెంట్‌ని. ఇన్సులిన్‌ కోసం బయటకు వెళ్ళవచ్చా?

వెళ్ళవచ్చు. మందుల దుకాణాలను తెరిచే ఉంచుతారు.

 

నా దగ్గర డబ్బులు అయిపోయాయి. ఎలా?

బ్యాంకులు అత్యవసర సేవలను నిర్వహిస్తున్నాయి. సంబంధిత బ్యాంకుకు వెళ్ళి కానీ, లేదంటే ఎ.టి.ఎం.కు వెళ్ళి కానీ తీసుకోవచ్చు. 


ఇంట్లో నా పెంపుడు కుక్క కాలకృత్యాల నిమిత్తం దాన్ని తీసుకొని, వాకింగ్‌కు వెళ్ళవచ్చా?

వెళ్ళవచ్చు. అయితే, అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావడం, కలవడం సరి కాదని ఇప్పటికే ప్రభుత్వాలు చెబుతున్నాయనేది గుర్తుంచుకోవాలి. కర్ఫ్యూ తరహా ఈ పరిస్థితుల్లో గుంపుల్లో కలవకుండా ఒకరికొకరు దూరంగా ఉండాలి. 


నాకు ఫిజియోథెరపీ అవసరం. వెళ్ళవచ్చా?

వైద్య సేవలు సైతం నిత్యావసర సర్వీసులో భాగమే. కాబట్టి వెళ్ళవచ్చు. 


ఇంట్లో కరెంటు పోయింది. ఎలా?

కరెంటు, నీళ్ళు, వగైరా అత్యవసర సర్వీసుల కిందకు వస్తాయి. కాబట్టి, సంబంధిత అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. ఆ శాఖ వారు లోపాన్ని సరిచేస్తారు. 


స్థానిక దేవాలయం, మసీదు, చర్చికి వెళ్ళవచ్చా?

వెళ్ళడానికి వీలు లేదు. నిత్య పూజాదికాలు యథావిధిగా జరుగుతాయి కానీ, ప్రజలను అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. 


నాకు సొంత కారు లేదు. అత్యవసరమైతే ఏం చేయాలి?

మెడికల్‌ ఎమర్జెన్సీ తలెత్తిన సందర్భంలో అంబులెన్సును పిలవచ్చు. 


నేను అత్యవసర సేవలు అందించే వ్యక్తిని. కానీ, అడుగడుగునా పోలీసులు ఆపుతున్న నేపథ్యంలో వాళ్ళకు ఆ సంగతి ఎలా చెప్పేది?

మీ కంపెనీ కానీ, సంస్థ కానీ ఇచ్చిన గుర్తింపు కార్డు, లేదంటే ప్రభుత్వం అందించిన మీడియా ఎక్రిడిటేషన్‌ కార్డు, కర్ఫ్యూ పాస్‌ లాంటివి ఏదో ఒకటి నిరంతరం మీతోనే ఉంచుకోవాలి. పోలీసులకు ఆ కార్డు చూపించి, విధులకు వెళ్ళిరావచ్చు.


మా ఇంట్లో కిరాణా సరుకులు, కూరగాయలు అయిపోతున్నాయి. ఎలా?

అవి కూడా నిత్యావసర సేవల కిందకే వస్తాయి. కర్ఫ్యూ సడలింపు వేళల్లో కిరాణా దుకాణాలు, కూరగాయల షాపులు తెరిచే ఉంటాయి. 


లాక్‌ డౌన్‌ నియమాలను ఎవరైనా ఉల్లంఘిస్తుంటే, ఫిర్యాదు చేయవచ్చా?

కచ్చితంగా. పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. 


ఉబర్‌, ఓలా క్యాబ్‌ సర్వీసులు వాడవచ్చా?

ప్రస్తుతానికి ఉబర్‌ తన సర్వీసులను మార్చి ఆఖరువరకు నిలిపివేస్తున్నట్టు ముందే ప్రకటించింది. కాగా, ఇప్పటి దాకా పరిమితంగా నడుస్తున్న ఓలా సహా మోటో ర్యాపిడ్‌ బైక్‌ లాంటి సర్వీసులు కూడా దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ నేపథ్యంలో అత్యధిక భాగం నిలిచిపోయాయి. 


బయట నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేయవచ్చా?

చేయవచ్చు. అయితే, ఆ సర్వీసులు కూడా ఇప్పుడు బాగా పరిమితమే. 

Advertisement
Advertisement
Advertisement