కారులోనే పెళ్లి.. ఫేస్‌మాస్క్‌తోనే ముద్దులు.. బ్రెజిల్‌లో..

ABN , First Publish Date - 2020-05-31T06:29:24+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది.

కారులోనే పెళ్లి.. ఫేస్‌మాస్క్‌తోనే ముద్దులు.. బ్రెజిల్‌లో..

రియో డి జనైరో: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్‌లో శుక్రవారం ఒక్కరోజే 26,928 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కరోనా బారిన పడి ఒకేరోజు 1,124 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసులు దేశంలో విజృంభిస్తుండటంతో దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇదే సమయంలో పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న వారికి అధికారులు స్పెషల్ డ్రైవ్‌ను ఏర్పాటుచేశారు. ఈ డ్రైవ్ ద్వారా వెరైటీగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఎలా అంటే.. కారులో కూర్చునే పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఉంగరాలు మార్చుకుంటారు. ఫేస్‌మాస్క్‌తోనే ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. రియో డి జనైరోలోని రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెళ్లి చేసుకోవాలనుకున్న జంట కారులో రావాల్సి ఉంటుంది. కారు దిగకుండానే వాళ్ల పెళ్లిని అధికారులు జరిపించేస్తారు. కారులోనే ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని.. పెళ్లి ప్రతిజ్ఞ చేస్తారు. అంతే.. వాళ్ల పెళ్లి పూర్తయినట్టలు అధికారులు ప్రకటిస్తారు. 


ఆ వెంటనే వాళ్లకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ఇస్తారు. ఇలా ఒక కారులో వచ్చిన జంట పెళ్లి పూర్తికాగానే ముందుకు వెళ్లిపోతారు. వెంటనే వెనుక కారులో ఉన్న వారి పెళ్లి మొదలవుతుంది. కేవలం ఐదే నిమిషాల్లో ఈ పెళ్లి తతంగమంతా పూర్తయిపోతుంది. బ్రెజిల్ యువత ఇప్పుడు ఈ తరహా వివాహాలకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అధికారులు కూడా నిత్యం డజన్ల కొద్దీ ఈ తరహా వివాహాలను జరిపిస్తున్నారు. అయితే పెళ్లి చేసుకునే జంటకు మాస్క్‌లు తప్పనిసరి అని అధికారులు తెలిపారు. ముద్దులు పెట్టుకున్నా మాస్క్‌లు వేసుకునే పెట్టుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కొత్త జంటలు కూడా చేసేదేం లేక అధికారులు చెప్పిన విధంగానే పెళ్లి చేసుకుంటున్నారు. కరోనా వేళ ఈ సరికొత్త పెళ్లి తంతు చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2020-05-31T06:29:24+05:30 IST