సంస్కృతంలో ప్రారంభ దశనుండి కళాశాల స్థాయి వరకు విద్యాబోధన ఉన్నా స్థానికంగా పాఠశాల అనడమే అలవాటు. పాఠశాల స్వరూప, స్వభావాలు, విధి విధానాలు ప్రత్యేక పద్ధతిలో ఉంటాయి. ప్రారంభ దశనుండి పాఠశాల విద్యార్థులంతా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవారే. అక్కడ చదువుకున్న కొందరు అక్కడే అధ్యాపకులైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉన్నంతలో వసతి, భోజనం అక్కడే. రామానుజకూటం, శంకరమఠం అని రెండు భోజనశాలలు. ఒకటి శ్రీవైష్ణవులకు, రెండవది స్మార్తబ్రాహ్మణులకు. 1950ల చివరి సంవత్సరాలలో గాని పాఠశాలలో బ్రాహ్మణేతరులు చేరడం ప్రారంభం కాలేదు. మా ఇల్లు సీతారాంబాగ్ ప్రాంగణంలోనే గనుక మా యింట్లోనే భోజనం చేసేవాణ్ణి. అదీగాక మా వాళ్లు తెలుగు వైష్ణవులతో కలిసి భోజనం చేయడం ఉండదు.
ఉదయం పదకొండు గంటల సమయానికి భోజనాలు పూర్తి. పదకొండు గంటలకు విద్యార్థులందరూ పొడుగాటి హాల్లో ఒక వైపు చేరేవారు. మరోవైపు అధ్యాపకులు. ప్రిన్సిపాల్ స్వామిగారు ఇంట్లో ఆరాధనాదికాలు ముగించుకొని సమయానికి వచ్చేవారు. విద్యార్థులకు ఎదురుగా అధ్యాపకుల వైపు హయగ్రీవస్వామి రేఖాచిత్రం. కాస్త ఎడంగా పెద్ద బంగారు రంగు ఫ్రేంలో నిటారుగా నిల్చున్న నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ చిత్రం. ఆధికారికంగా అంగీకరించిన చిత్రం. తరువాత 1952 లోనో 53లోనో చనిపోయిన పాఠశాల పోషకుడు ఎన్.కె. రావు స్వచ్ఛమైన ఫొటో, ‘ప్రాతర్నమామి’ అని ప్రార్థన మొదలయ్యేది. ప్రార్థన కాగానే సాష్టాంగ ప్రణామాలు. అవి హయగ్రీవుడు, గురువులతో నిజాం నవాబుకి కూడా చేరేవి. తరువాత ఉపస్థితి. ఒక సీనియర్ విద్యార్థి విద్యార్థుల పేర్లను తరగతుల వారీగా చదివేవాడు. విద్యార్థులు ‘అహమస్మి’ అనో ‘ఉపస్థితోఽస్మి’ అనో స్పందించేవారు. ప్రార్థన కూటమి తరువాత ఒక్కొక్కసారి స్వామిగారికి ఏదైనా విషయం జ్ఞాపకం వస్తేనో, ఎవరైనా ఒక విద్యార్థిని మందలించాలంటేనో గట్టిగా తుంపరులు పడేటట్టుగా చీవాట్లు పెట్టేవారు. ఆ కేకలు చాలా దూరం వినవచ్చేవి. ప్రార్థన కూటమి ముగిసిన తరువాత విద్యార్థులు తమతమ తరగతులకు వెళ్లేవారు. స్వామిగారు ఇంటికి వెళ్లి భోజనం చేసి ఒక గంట తరువాత వచ్చేవారు.
నేను 1960లలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కాలంలో వృత్తి నిర్వహణతో పాటు ప్రవృత్తి రెండు రకాలుగా సాగింది. మొదటిది తెరిచిన ప్రపంచంలోకి, మానసికమైన అడ్డంకులు లేని స్వేచ్ఛాలోకంలోకి ప్రవేశం. వ్యక్తిగత స్వేచ్ఛతోపాటు విషయ పరిజ్ఞానం, విస్తృతి ఏర్పడినకాలం. రెండవది వృత్తిపరమైన అవకాశాల దృష్ట్యా విద్యాయోగ్యతలను పెంచుకోవడం. ఈ విషయంలో ఏ సంవత్సరమూ వృథా పోనివ్వలేదు. దశాబ్దం చివర పరిషత్తు ప్రాచ్యకళాశాలలో చేరాను. ఈ అంశం పూర్తిగా వ్యక్తిగతమైనది. ప్రస్తుతం మొదటి అంశం పైననే దృష్టి కేంద్రీకరిస్తాను. సంస్కృత పాఠశాల లేదా కళాశాలలో చదువుతున్న కాలంలో సీనియర్ విద్యార్థులతో, సహాధ్యాయిలతో సభలకు, సమావేశాలకు వెళ్తుండేవాణ్ణి. తదనంతరం సహచర స్వభావం మారింది. కొత్తమిత్రులు ఏర్పడ్డారు. ఆహార్యం మారింది. లుంగీ, నామాలు, జుట్టు పోయి పాంటు, షర్టు, క్రాపు వచ్చాయి. సీతారాంబాగ్లోనే ఉండే రాఘవతో మైత్రి ఏర్పడింది. అప్పుడాయన బషీర్‌బాగ్‌లో ఉండే ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తుండేవాడు. తరువాత ఏవో ఉద్యోగాలు మారాడు. నేను సంస్కృత పాఠశాలలో చదువుతున్న తొలి రోజులలోనే అప్పుడప్పుడు కలుసుకొనేవాళ్లం. అప్పుడాయన స్కూల్లో చదువుతున్నాడు. ఎక్కువగా సినిమా విషయాలు ముచ్చటించుకొనేవాళ్లం. అప్పుడు ఆయన ఫిల్మ్ ఫేర్ పత్రిక తెప్పించేవాడు. ప్రత్యేకంగా అందుకోసం కూడా ఆయన దగ్గరకు వెళ్లేవాణ్ణి. రాజ్‌కపూర్ కుటుంబం అంటే ఆయనకు చాలా అభిమానం. ఆవారా చిత్రాన్ని ఎన్నోసార్లు చూశాడు. రాఘవే ఆ తరువాత జ్వాలాముఖి.
ఆ రోజులలో నేను, రాఘవ ఎక్కడ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నా ఆహ్వానం ఉన్నా లేకపోయినా చొచ్చుకొనిపోయే వాళ్లం. విఐపిల కోసం ఏర్పాటుచేసిన కార్యక్రమాలకు కూడా అలాగే వెళ్లేవాళ్లం. 1964లో కావాలె రాష్ట్రపతి రాధాకృష్ణ దక్షిణాది నివాసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిదిచేసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రధాని జవహర్ లాల్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉండింది. హైదరాబాద్ వచ్చి రాష్ట్రపతి నిలయంలో విశ్రాంతి తీసుకోవలసిందిగా రాధాకృష్ణ నెహ్రూని ఆహ్వానించాడు. ఆ సందర్భంగా రవీంద్రభారతిలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశాడు. ఆహ్వానాలున్న కొంతమంది ప్రముఖులు వెళ్తూ ఉండగా వాళ్లతోపాటు మేమూ ప్రవేశించాం. ఆ రోజు సంపత్కుమార బృందం కాళిదాసు అభిజ్ఞాన శకుంతల నాటకాన్ని సంస్కృతంలో ప్రదర్శించింది. రాధాకృష్ణ, నెహ్రూలను దగ్గరగా చూడడమే కాకుండా అరుదైన నాటక ప్రదర్శనను కూడా తిలకించాం.
మేము ఆ రోజులలో ఆసక్తితో చర్చించుకునే విషయాలు పత్రికలు, రాజకీయాలు. బొంబాయి నుంచి వచ్చే ఇంగ్లీషు వారపత్రిక ‘బ్లిట్జ్’ యువతరాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది. పత్రిక సంపాదకుడు కరాంజియా ఒక హీరో, ప్రముఖ దర్శకుడు, రచయిత కె.ఎ. అబ్బాస్ చివరిపేజీ రాసేవాడు. ఉద్యోగ బాధ్యతల తరువాత మిత్రులం అబిడ్స్ హెడ్ పోస్టాఫీసు ముందు పత్రికల దుకాణాల దగ్గర చేరే వాళ్లం. ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి వచ్చే ఇంగ్లీషు దినపత్రికలు హిందుస్తాన్ టైమ్స్, టైమ్స్ అఫ్ ఇండియా, స్టేట్స్‌మన్ పత్రికలను తిరగేసే వాళ్లం. రాజకీయాలు మాట్లాడుకొనేవాళ్లం. మేము ఎక్కువగా చదివేది స్టేట్స్‌మన్ పత్రిక. ఆ రోజులలోనే ఢిల్లీనుంచి వామపక్ష భావాలను సమర్థించే ‘పేట్రియాట్’ దినపత్రిక ప్రారంభం అయింది. చాలాకాలం ఆ పత్రికకు నేను నిత్యపాఠకుణ్ణి.
ఆబిడ్స్‌లో జమర్రుద్ మహల్ థియేటర్ ఎదురుగా ఓరియంట్ హోటల్ ఆలోచనాపరుల చర్చలకు కేంద్రంగా ఉండేది. ఇప్పుడది పెద్ద వాణిజ్య సముదాయంగా మారింది. జమర్రుద్ మహల్ టాకీసు కూడా లేదనుకుంటాను. కవులు, ఎక్కువగా ఉర్దూ హిందీ కవులు, కళాకారులు రాజకీయ చింతకులు అక్కడ చేరేవాళ్లు. ప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు, ఉర్దూ కవి మక్దుం మొహియుద్దీన్ అక్కడికి వస్తుండేవాడని విన్నాను. ప్రసిద్ధ చిత్రకారుడు ఎమ్.ఎఫ్. హుస్సేన్ని అక్కడ చూచిన జ్ఞాపకం. ఓరియంట్ హోటల్ ఒక విశాలప్రాంగణంగా ఉండేది. ముందు అంతా ఖాళీ స్థలం... దిగంబరకవులు అవతరించక ముందు దానికి పూర్వరంగంగా చర్చలు, ప్రణాళికారచన అక్కడే జరిగాయి. అమెరికా వెళ్లకముందు హైదరాబాదులో ఉన్నప్పుడు వెల్చేరు నారాయణరావు దిగంబరకవులను కలవడానికి వస్తుండేవాడు. వరవరరావుని కూడా ఒకటి రెండు సార్లు అక్కడికి రావడం చూచాను.
...కేవల కుటుంబ పరిధి నుంచి స్వేచ్ఛాలోకంలోకి ప్రవేశించిన తరువాత చాలా కాలానికి పెళ్లిని గురించిన ఆలోచన వచ్చింది. అయితే మా వర్గానికి సంబంధించిన పరిధిలో మాత్రం కాదని స్పష్టత ఉంది. నాకు పరిమితమైన మిత్రవర్గం ఉంది కాని వారి కుటుంబాలతో సంబంధం లేదు. అమ్మాయిలతో పరిచయం చేసుకోగలిగిన నేపథ్యం కాదు నాది. బ్రాహ్మణేతర తెలుగు అమ్మాయి, అందునా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి సహచరి కావాలనే ఆలోచన ఉండేది.
నాకున్న పరిధిలో నా ఆలోచనలు సాకారం కావడం సాధ్యమయ్యేపని కాదని తెలుసు. ఒకరిద్దరు మిత్రులు తమ కుటుంబ పరిధిలోనే కొన్ని సూచనలు చేశారు. అనుకోకుండా చెరబండరాజు, ఆయన సహాధ్యాపకుల ద్వారా సహచారికానున్న అమ్మాయి పరిచయమైంది. ఆమె కుటుంబ సభ్యులలో, మిత్రులలో అభ్యుదయ భావాలు కలవాళ్లు, సాహిత్యసంబంధం ఉన్నవాళ్లు కొందరున్నారు, మాట్లాడుకున్నాం. తెలంగాణ ప్రజాసమితి ప్రారంభంలో జరిగిన నాలుగైదు రోజులలో మిత్రుల మధ్య మా సాహచర్య స్థిరీకరణ జరిగింది. తాపీ ధర్మారావు, దేవులపల్లి రామానుజరావు పెద్దలుగా వచ్చారు. కట్టుబట్టలతో వచ్చాం. మా కుటుంబాలతో సంబంధం లేకుండా కలిశాం. సహచరి తెడ్లపల్లి ఊర్మిళాదేవి. ఉమ్మడి మహబూబునగర్ జిల్లాలోని వంగూరు ఆమె గ్రామం. మొదటి రెండు రోజులు నిఖిలేశ్వర్ ఇంట్లో కాపురం. తరువాత వరుసగా అద్దె ఇళ్లల్లో, పెళ్లి అయిన వారం పదిరోజులకు ఊళ్లో ఒక సభ ఏర్పాటు చేశారు.
కెకెఆర్
(ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు (కెకెఆర్) అముద్రిత ‘జ్ఞాపకాలు’ నుంచి కొన్ని భాగాలివి. నేడు ఆయన ప్రథమ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆంధ్రమహిళాసభ ప్రాంగణంలో ఉదయం 11గం.లకు సంస్మరణ సభ)