విద్యార్థులకు గోండ్ భాష బోధన.. సంస్కృతి పరిరక్షణ కోసం ఓ పాఠశాల ప్రయత్నం!

ABN , First Publish Date - 2022-03-17T02:29:15+05:30 IST

గోండ్ తెగ సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షించేందుకు గడ్చిరోలీ జిల్లాలోని ధనోరా గ్రామంలోని పాఠశాల నడుం కట్టింది. అక్కడి ఉపాధ్యాయులు.. విద్యార్థులకు గోండ్ భాషను బోధించడం ప్రారంభించారు.

విద్యార్థులకు గోండ్ భాష బోధన..  సంస్కృతి పరిరక్షణ కోసం ఓ పాఠశాల ప్రయత్నం!

గడ్చిరోలి(మహారాష్ట్ర): ఆధునికత కారణంగా మన సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పటి సంస్కృతి, సంప్రదాయాలు క్రమంగా మరుగున పడిపోతున్నాయి. ఇంగ్లీష్ భాషకు ఉన్న ప్రధాన్యత రీత్యా ప్రాంతీయ భాషలు కూడా క్రమంగా తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ఇక ఆదిమ తెగల భాష, సంప్రదాయాల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో గోండ్ తెగ సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షించేందుకు  గడ్చిరోలీ జిల్లాలోని(మహారాష్ట్ర) ధనోరా గ్రామంలోని పాఠశాల నడుం కట్టింది. అక్కడి ఉపాధ్యాయులు.. విద్యార్థులకు గోండ్ భాషను బోధించడం ప్రారంభించారు. స్థానిక భాష, సంస్కృతి వైవిధ్యాన్ని పరిరక్షించేలా అన్ని జిల్లాల యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ధనోరా గ్రామ సభ అధ్యక్షురాలు దేవ్‌సాయి ఆట్ల ఈ సందర్భంగా పేర్కొన్నారు. 


సహజంగానే విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రయత్నాన్ని స్వాగతించారు. ఈ స్కూల్లో విద్యార్థులకు గోండ్ భాషతో పాటూ ఇంగ్లీష్, హిందీ, మరాఠీ భాషలు, సైన్స్ కూడా బోధిస్తున్నారు. ‘‘నా కూతురు గతంలో జిల్లా పరిషత్ పాఠశాలలో చదివేది. కానీ.. ఈ స్కూల్లో చేరిన తరువాత చదువు పట్ల నా బిడ్డలో శ్రద్ధ పెరిగింది. నా అభిప్రాయం ప్రకారం.. విద్యార్థులకు మాతృభాష కూడా కచ్చితంగా నేర్పించాలి’’ అని ఓ మహిళ వ్యాఖ్యానించింది. ఇక్కడి విద్యార్థులకు ఇంగ్లీష్, గోండ్ భాషల బోధించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని రాజేంద్ర బోసామ్ అనే ఉపాధ్యాయుడు తెలిపారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు లభిస్తున్న విద్య.. కార్పొరేట్ పాఠశాలల్లో దొరకదన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం విధిశాలో చదువుకున్న తను.. ఈ పాఠశాల గురించి తెలిసి ఇక్కడికి వచ్చానని తెలిపారు.

Updated Date - 2022-03-17T02:29:15+05:30 IST