12రోజుల్లో 26వేల కేసులు

ABN , First Publish Date - 2021-05-13T06:22:17+05:30 IST

మే నెల జిల్లా ప్రజానీకాన్ని భయపెడుతోంది. ఈ నెలలో కరోనా వైరస్‌ విజృంభణ తారస్థాయికి చేరుతుందన్న హెచ్చరికలు అటు ప్రభుత్వం నుంచీ ఇటు వైద్య రంగ ప్రముఖుల నుంచీ పదేపదే వినిపిస్తున్న నేపధ్యంలో తొలి పన్నెండు రోజుల్లో నమోదైన పాజిటివ్‌ కేసులు, మరణాలు పరిస్థితి తీవ్రతను చాటిచెబుతున్నాయి.

12రోజుల్లో 26వేల కేసులు

 భయపెడుతున్న మే నెల


తిరుపతి, మే 12 (ఆంధ్రజ్యోతి): మే నెల జిల్లా ప్రజానీకాన్ని భయపెడుతోంది. ఈ నెలలో కరోనా వైరస్‌ విజృంభణ తారస్థాయికి చేరుతుందన్న హెచ్చరికలు అటు ప్రభుత్వం నుంచీ ఇటు వైద్య రంగ ప్రముఖుల నుంచీ పదేపదే వినిపిస్తున్న నేపధ్యంలో తొలి పన్నెండు రోజుల్లో నమోదైన పాజిటివ్‌ కేసులు, మరణాలు పరిస్థితి తీవ్రతను చాటిచెబుతున్నాయి. గత నెల మొత్తం కలిపి 26 వేల పాజిటివ్‌ కేసులు, 103 అధికారిక మరణాలు నమోదు కాగా ప్రస్తుత నెలలో మొదటి పన్నెండు రోజుల్లోనే పాజిటివ్‌ కేసులు 26 వేలు దాటేయగా 83మరణాలు సంభవించాయి. 

జిల్లాలో కరోనా వైరస్‌ తొలి కేసు నమోదైన గతేడాది మార్చి మొదలుకుని ఇప్పటి వరకూ నెలల వారీ నమోదైన పాజిటివ్‌ కేసులను, మరణాలను పరిశీలిస్తే కరోనా వైరస్‌ గతంలో ఎన్నడూ లేనంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. జిల్లాలో రోజువారీ నమోదవుతున్న పాజటివ్‌ కేసుల సంఖ్య, సంభవిస్తున్న అధికారిక మరణాలూ దానికి నిదర్శనంగా మారుతున్నాయి. నెలల వారీ రికార్డయిన కేసుల సంఖ్య చూస్తే గతేడాది మార్చి నుంచీ ఇప్పటి వరకూ అత్యధికంగా కేసులు నమోదైంది గతేడాది ఆగస్టులో.ఆ నెలలో 27994 కేసులు రికార్డయ్యాయి. పరిస్థితి చూస్తుంటే ఈ నెలలో ఆ రికార్డు చెరిగిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.గత నెలంతా కలిపి 26434 కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో 12వ తేదీకే 26430మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. గత నెలలో అధికారిక లెక్కల ప్రకారం 103 మంది చనిపోగా ఈ నెలలో మొదటి పన్నెండు రోజుల్లోనే 83 మంది చనిపోయారు. నిజానికి మరణాల సంఖ్య దీనికి కొన్ని రెట్లు అధికంగా వుంటోంది. దీంతో మిగిలిన 19 రోజుల్లో నమోదు కాబోయే కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ఊహించుకుంటేనే ఆందోళన కలగకమానదు. పాజివిటిటీ శాతం పెరుగుదల కూడా అదే స్థాయిలోనే వుంది. గతేడాది మార్చి మొదలుకుని ఇప్పటివరకూ అత్యధికంగా పాజిటివిటీ శాతం నమోదైంది కూడా గతేడాది ఆగస్టులోనే. ఆ నెలలో 18.5 శాతం పాజిటివిటీ వుండగా దాని తర్వాత అత్యధికంగా పాజిటివిటీ రేటు కనిపించింది గత నెలలోనే. గత నెలలో 16.95 శాతం పాజిటివిటీ నమోదైంది. ఈ నెలలో ఆ రేటు ఎక్కడికి చేరుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. మొత్తానికీ పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు మొదలుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య రంగప్రముఖులు, ఆఖరుకు జిల్లా యంత్రాంగం వరకూ మే నెలలో కరోనా వైరస్‌ విజృంభణ తారస్థాయికి చేరుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ నెల గడిస్తే చాలన్న భావన జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. అందుకే నెలాఖరు వరకూ ఇంటి గడప దాటకుండా గడపడం ద్వారా కరోనా గండం నుంచీ గట్టెక్కేందుకు అత్యధిక శాతం మంది జనం ప్రయత్నిస్తున్నారు.


Updated Date - 2021-05-13T06:22:17+05:30 IST