Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 04 Apr 2022 03:43:54 IST

ప్రతిపక్షాలపై ఇమ్రాన్‌ యార్కర్‌!

twitter-iconwatsapp-iconfb-icon
ప్రతిపక్షాలపై ఇమ్రాన్‌ యార్కర్‌!

పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దు

ప్రధాని సిఫారసును ఆమోదించిన అధ్యక్షుడు

అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్‌

ప్రతిపక్షాల ఆందోళన.. సభను వీడబోమని వెల్లడి

సుప్రీంకోర్టులో పిటిషన్‌.. నేడు విచారణ

అవిశ్వాస తీర్మానం విదేశీ ఎజెండా

పాక్‌ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారు: ఇమ్రాన్‌

పాక్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రతిపక్షాలపై ‘యార్కర్‌’ సంధించారు! తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విపక్షాలకు మాజీ క్రికెటర్‌ షాకిచ్చారు! విశ్వాస పరీక్షలో ఇమ్రాన్‌ కచ్చితంగా ఓడిపోతారని భావించిన వేళ.. విపక్ష నేతలందరూ విస్తుపోయేలా చేశారు! జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడికి సిఫారసు చేశారు! ఇమ్రాన్‌ కోరడమే ఆలస్యం.. అధ్యక్షుడు అల్వీ వెంటనే అసెంబ్లీ రద్దుకు ఆమోదముద్ర వేసేశారు! 


ఇస్లామాబాద్‌, ఏప్రిల్‌ 3: జాతీయ అసెంబ్లీలో విపక్షాలన్నీ ఏకమై ఇమ్రాన్‌ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రధాని సొంత పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) నుంచి కూడా డజను మందికి పైగా సభ్యులు ప్రతిపక్షాలతో చేతులు కలిపారు. ఇమ్రాన్‌ వారందరికీ షాక్‌ ఇచ్చారు. జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసీం సురీ ఆదివారం అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు.ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం రాజ్యాంగానికి, పాకిస్థాన్‌ నిబంధనలకు విరుద్ధమని ప్రకటించారు.


స్పీకర్‌ అసద్‌ ఖైజర్‌పైనా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో సురీ అధ్యక్షత వహించారు. 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఇప్పటికే మెజారిటీని కోల్పోయారు. అయితే అవిశ్వాస తీర్మానాన్ని సురీ తిరస్కరించిన వెంటనే సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభాపతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో సభ వాయిదా పడింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఇమ్రాన్‌ ఖాన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. పాక్‌ ప్రభుత్వాన్ని కూల్చాలన్న విదేశీ కుట్రలను డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించారన్నారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని విదేశీ ఎజెండాగా అభివర్ణించారు. తనకు వ్యతిరేకంగా చట్టసభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ప్రతిపక్షాలు ఖర్చు చేశాయని ఆరోపించారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీకి సిఫారసు చేసినట్లు ప్రకటించారు. తాజాగా ఎన్నికల నిర్వహణకు ఆదేశించాలని కోరినట్లు తెలిపారు.

అవినీతి శక్తులకు దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇవ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్‌ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని ఇమ్రాన్‌ చెప్పారు.  ప్రధాని ఇమ్రాన్‌ సిఫారసు మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేసినట్లు అధ్యక్షుడు అల్వీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, మరో 15 రోజుల పాటు ఇమ్రాన్‌ ఖానే ప్రధానిగా ఉంటారని మాజీ మంత్రి షేక్‌ రషీద్‌ వెల్లడించారు. ప్రధానిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన ప్రక్రియతో పాటు జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పార్లమెం టు హౌస్‌ను వీడేందుకు నిరాకరించాయి.

‘‘డిప్యూటీ స్పీకర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తాం. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలన్న ప్రధాని సిఫారసునూ సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం’’ అని పార్లమెంటులో ప్రతిపక్ష నేత షెబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. ఇ మ్రాన్‌ చర్యలు చట్టవిరుద్ధమన్నారు. ఈ చర్య ద్వారా తన నిజస్వరూపాన్ని బయటపెట్టారని ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్‌ కూడా అప్రాజాస్వామికంగా వ్యవహరించారని, ఈ నిర్ణయా న్ని ఉపసంహరించుకునేవరకు తాము జాతీయ అసెంబ్లీలోపలే ఉంటామని చెప్పారు. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతానన్న భయంతోనే ఇమ్రాన్‌ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ చైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ ఆరోపించారు.

ఇమ్రాన్‌ ద్రోహి అని, ఆయన రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ నేత మురియం ఔరంగజేబ్‌ ఆరోపించారు.కాగా, దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో తమకు సంబంధం లేద ని ఆర్మీ అధికార ప్రతినిధి బాబర్‌ ఇఫ్తికార్‌ వెల్లడించారు. పాక్‌లో ఆర్మీ చాలా శక్తిమంతమైంది. పాక్‌కు స్వాతం త్య్రం వచ్చి 73 ఏళ్లు దాటగా.. సగం కాలం ఆర్మీనే పాలించింది.  

కోర్టు తీర్పునకు లోబడే...: చీఫ్‌ జస్టిస్‌

నేషనల్‌ అసెంబ్లీ రద్దుపై ప్రధాని, అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు కోర్టు తీర్పునకు లోబడి ఉంటాయని పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ అటా బందియాల్‌ అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో... ప్రభుత్వ వ్యవస్థలు ఎలాంటి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోరాదని కోర్టు పేర్కొంది. పాక్‌లో పరిణామాలపై చీఫ్‌ జస్టిస్‌ దృష్టి సారించినట్లు కోర్టు అధికారి ఒకరు తెలిపారు. జాతీయ అసెంబ్లీలో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆయన ఆదివారం అయినప్పటికీ కోర్టుకు చేరుకున్నట్లు చెప్పారు.

దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని సుమోటోగా తీసుకున్నట్లు వెల్లడించారు. జాతీయ అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినట్లు సీనియర్‌ న్యాయవాది సల్మాన్‌ అక్రమ్‌ రజా తెలిపారు. మొత్తం వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. ఈ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేశారు. కాగా, నేషనల్‌ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఇక నుంచి పాకిస్థాన్‌ ప్రధానిగా వ్యవహరించరని ఆ దేశ క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ పేర్కొంది. ఆపద్ధర్మ ప్రధాని వచ్చేవరకు మాత్రమే ఆయన పదవిలో ఉంటారని పేర్కొంది. 

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ చౌధరి సర్వార్‌ను పదవి నుంచి తొలగించారు. అదేసమయంలో పంజాబ్‌ ప్రావిన్స్‌కు కొత్త సీఎం ఎన్నికను వాయిదా వేశారు.  


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.