మేం సరైన దారిలోనే వెళ్తున్నాం: ఇమ్రాన్

ABN , First Publish Date - 2020-08-15T02:49:03+05:30 IST

పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం గురించి గత కొన్నాళ్లుగా వెల్లువెత్తున్న ఊహాగానాలపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ..

మేం సరైన దారిలోనే వెళ్తున్నాం: ఇమ్రాన్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం గురించి గత కొన్నాళ్లుగా వెల్లువెత్తున్న ఊహాగానాలపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ స్పందించారు. రెండేళ్ల తీవ్ర ‘‘కష్టకాలం’’ తర్వాత తాము ఆర్థికంగా సరైన మార్గంలోనే వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించడం ద్వారా దేశంలోని పరిశ్రమలు భారత్, బంగ్లాదేశ్‌లతో పోటీపడేలా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీవీ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్... దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల వ్యాపార వర్గాల్లో మళ్లీ విశ్వాసం తీసుకురాగలిగామని చెప్పుకొచ్చారు. ‘‘మేము రెండేళ్లపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాకు విదేశీ మారక నిల్వలు లేవు. కనీసం అప్పులు కూడా తీర్చలేకపోయాం. అయితే మేము ఆర్థికంగా విఫలం కాకపోవడం వల్ల పెను సంక్షోభం నుంచి తప్పించుకోగలిగాం...’’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఇటీవల ఎగబాకిన స్టాక్ మార్కెట్, రెవెన్యూ వసూళ్లను బట్టి  ఏ మేరకు పురోగతి సాధించామో చూడవచ్చునని ఇమ్రాన్ అన్నారు. కరోనా సంక్షోభం రాకుంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంచనాలకు మించి ఉండేదన్నారు. 

Updated Date - 2020-08-15T02:49:03+05:30 IST