భారత్‌తో సంబంధాలపై ఇమ్రాన్ ఖాన్ గట్టి నిర్ణయం

ABN , First Publish Date - 2021-04-03T19:59:50+05:30 IST

భారత దేశంతో ప్రస్తుత పరిస్థితుల్లో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించరాదని

భారత్‌తో సంబంధాలపై ఇమ్రాన్ ఖాన్ గట్టి నిర్ణయం

ఇస్లామాబాద్ : భారత దేశంతో ప్రస్తుత పరిస్థితుల్లో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించరాదని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించారు. కీలక మంత్రులతో సమావేశం అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పాకిస్థాన్ మీడియా శనివారం తెలిపింది. 


పాకిస్థాన్‌లో పంచదార, ప్రత్తి తదితర వస్తువులు అందుబాటులో ఉండటంపై కేబినెట్ మంత్రులతో ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం సమావేశమైనట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. అవసరమైన సరుకులను చౌకగా దిగుమతి చేసుకునేందుకుగల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖను ఆదేశించారని తెలిపింది. ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీకి వివిధ ప్రతిపాదనలు అందాయని, వీటిని ఆర్థిక, వాణిజ్యపరమైన దృష్టితో పరిశీలిస్తున్నారని పేర్కొంది. 


ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీకి వచ్చిన ప్రతిపాదనల్లో భారత దేశం నుంచి ప్రత్తి, నూలు దారం, పంచదారలను దిగుమతి చేసుకోవడం కూడా ఉందని తెలిపింది. దీనిని పరిశీలించిన ఇమ్రాన్ ఖాన్ తన కేబినెట్ సహచరులతో చర్చించారని,  ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశంతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడం సాధ్యం కాదని చెప్పారని వెల్లడించింది. 


ఇదిలావుండగా భారత దేశం నుంచి ప్రత్తి, నూలు దారం, పంచదారలను దిగుమతి చేసుకోవాలని అంతకుముందు పాకిస్థాన్ ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి మొదట మద్దతు పలికిన ఇమ్రాన్ ఖాన్ యూ-టర్న్ తీసుకోవడం వెనుక ఆయనపై పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) ఒత్తిళ్ళు ఉన్నాయని జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. 


జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా విమర్శిస్తోంది. 2019 ఆగస్టులో అధికరణ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారత దేశంతో వాణిజ్య సంబంధాలను పాకిస్థాన్ ఏకపక్షంగా తెంచుకుంది. 


Updated Date - 2021-04-03T19:59:50+05:30 IST