Pakistan : పెట్రో ధరల తగ్గింపు... భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు...

ABN , First Publish Date - 2022-05-22T18:00:11+05:30 IST

పెట్రోలు, డీజిల్‌లపై పన్నులను తగ్గించిన భారత ప్రభుత్వంపై పాకిస్థాన్ మాజీ

Pakistan : పెట్రో ధరల తగ్గింపు... భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు...

ఇస్లామాబాద్ : పెట్రోలు, డీజిల్‌లపై పన్నులను తగ్గించిన భారత ప్రభుత్వంపై పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. అమెరికా ఒత్తిళ్ళు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసం రష్యా నుంచి డిస్కౌంట్ రేటుతో చమురును భారత్ కొనుగోలు చేసిందన్నారు. 


ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డయలాగ్ (QUAD) దేశాల్లో భారత దేశం (India) ఒకటి అని, అయినప్పటికీ, భారత దేశం అమెరికా (America) ఒత్తిడిని తట్టుకుని, సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసం రష్యా (Russia) నుంచి డిస్కౌంట్ రేటుతో చమురును కొనుగులో చేసిందని ప్రశంసించారు. 


స్వతంత్ర విదేశాంగ విధానంతో పాకిస్థాన్‌ (Pakistan)లో కూడా ఇటువంటిదానిని సాధించేందుకు తన ప్రభుత్వం కృషి చేసిందన్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం దిక్కు తోచని స్థితిలో అటూ ఇటూ పరుగులు తీస్తోందని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ అరాచక స్థితిలో ఉందన్నారు. మీర్ జాఫర్లు, మీర్ సాదిక్‌లు విదేశీ ఒత్తిళ్ళకు తలొగ్గి ప్రభుత్వాన్ని మార్చేశారన్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌లపై సుంకాలను తగ్గించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిపై ఎక్సయిజ్ డ్యూటీ తగ్గింపు వల్ల సంవత్సరానికి రూ.1 లక్ష కోట్ల వరకు ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం చెప్పారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ విధంగా స్పందించారు. 


కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఢిల్లీలో ఆదివారం లీటరు పెట్రోలు రూ.95.91కు, లీటరు డీజిల్ రూ.89.67కు లభిస్తోంది. 


క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డయలాగ్‌ కూటమిలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఉన్నాయి. 




Updated Date - 2022-05-22T18:00:11+05:30 IST