పాకిస్థాన్‌ను సైన్యం నియంత్రించడం లేదు : ఇమ్రాన్

ABN , First Publish Date - 2021-07-31T20:05:28+05:30 IST

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ను సైన్యం నియంత్రించడం లేదు : ఇమ్రాన్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలు వింతగా ఉన్నాయి. ఆ దేశాన్ని సైన్యం నియంత్రించడం లేదని చెప్తూ, సైన్యం నియంత్రణలో పాక్ ఉందనేది భారత దేశ దుష్ప్రచారమని అన్నారు. పాకిస్థాన్ సైన్యం తన ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని సమర్థిస్తోందన్నారు. శుక్రవారం జరిగిన పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మీడియా కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


25 ఏళ్ళ నుంచి తన పార్టీ మేనిఫెస్టోలో భాగంగా ఉన్న విదేశాంగ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తమకు సానుకూలురు, అభిమానులు లేరన్నారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు ఎవరిని ఎంచుకుంటే, వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడమే తమ విధానమని చెప్పారు.  తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతిస్తోందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. తాలిబన్లు చేస్తున్నదేమిటి, చేయనిదేమిటి? అనేదానితో పాకిస్థాన్‌కు సంబంధం లేదన్నారు. తాము తాలిబన్లకు బాధ్యులం కాదని, వారి అధికార ప్రతినిధులము కాదని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి నెలకొనడం మాత్రమే తమకు కావాలన్నారు. 


Updated Date - 2021-07-31T20:05:28+05:30 IST