నా పదవి పోతే భారత్ పండుగ చేసుకుంది : ఇమ్రాన్ ఖాన్

ABN , First Publish Date - 2022-04-14T22:42:56+05:30 IST

పాకిస్థాన్ ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంతో పదవీచ్యుతుడైన ఇమ్రాన్

నా పదవి పోతే భారత్ పండుగ చేసుకుంది : ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంతో పదవీచ్యుతుడైన ఇమ్రాన్ ఖాన్ భారత దేశంపై నిందలు మోపుతున్నారు. పెషావర్‌లో బుధవారం మాట్లాడుతూ, తాను ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగడంతో భారత్, ఇజ్రాయెల్ ఎక్కువగా సంబరాలు చేసుకున్నాయన్నారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించడంలో విదేశీ శక్తుల కుట్ర ఉందని ఆయన అనేకసార్లు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 


మనపై ఈ బందిపోట్లను రుద్దడం ద్వారా పాకిస్థాన్‌ను అమెరికా అవమానించిందన్నారు. పదవిలో ఉన్నప్పటికన్నా ఇప్పుడు తాను మరింత ప్రమాదకారిని అవుతానని  చెప్పారు. ‘‘నేను ప్రభుత్వంలో ఉన్నపుడు ప్రమాదకారిని కాదు. కానీ ఇప్పుడు నేను మరింత ప్రమాదకారినవుతాను’’ అని చెప్పారు. కోర్టులు అర్ధరాత్రి సమయంలో ఎందుకు తెరుచుకున్నాయని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పని చేయడం లేదని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజలను తాను రెచ్చగొట్టలేదని చెప్పారు. 


ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌‌కు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ కోసం  పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఏప్రిల్ 9న రాత్రి పొద్దుపోయాక సమావేశమైంది. ఈ తీర్మానంపై అర్ధరాత్రి ఓటింగ్‌ను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, అప్పటి నేషనల్ అసెంబ్లీ (పాకిస్థాన్ పార్లమెంటు) స్పీకర్ అసద్ కైజర్ ఓటింగ్‌ను నిర్వహించలేదు. ఆయన తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఓటింగ్ జరిగింది.  వేరొక పిటిషన్‌పై విచారణ కోసం ఇస్లామాబాద్ హైకోర్టు కూడా అర్ధరాత్రి పని చేసింది. 



Updated Date - 2022-04-14T22:42:56+05:30 IST