నా రెండో భార్యకు నా శత్రువులు డబ్బులిచ్చారు : ఇమ్రాన్ ఖాన్

ABN , First Publish Date - 2022-04-30T23:15:46+05:30 IST

Pakistan మాజీ ప్రధాన మంత్రి Imran Khan తన పార్టీ కార్యకర్తల సమావేశంలో

నా రెండో భార్యకు నా శత్రువులు డబ్బులిచ్చారు : ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్ : Pakistan మాజీ ప్రధాన మంత్రి Imran Khan తన పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తనపై షరీఫ్ మాఫియా దుష్ప్రచారం ప్రారంభించబోతోందని జోస్యం చెప్పారు. తన రెండో భార్యకు ఈ మాఫియా డబ్బులిచ్చి, తన వ్యక్తిత్వ హననానికి పురిగొలుపుతోందన్నారు. 


లాహోర్‌లో శుక్రవారం జరిగిన పాకిస్థాన్ తెహరీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇమ్రాన్ మాట్లాడారు. మాజీ ప్రధాన మంత్రి బేనజీర్ భుట్టోకు వ్యతిరేకంగా గతంలో జరిగినట్లుగానే, ఈద్ తర్వాత తనపై కూడా షరీఫ్ మాఫియా దుష్ప్రచారం ప్రారంభించబోతోందని చెప్పారు. తన వ్యక్తిత్వ హననం కోసం ఆ మాఫియా ఆరోపణలు చేయబోతోందన్నారు. 


ఇస్లాంను స్వీకరించిన తర్వాత పాకిస్థాన్‌కు వచ్చిన ఓ మహిళకు వ్యతిరేకంగా షరీఫ్ మాఫియా దుష్ప్రచారం చేసిందని గుర్తు చేశారు. వారు ఆమెను యూదు మతస్థురాలని ఆరోపించారన్నారు. ఆమెపై ఓ బూటకపు కేసును దాఖలు చేశారని, అది ఓ ఏడాదిపాటు సాగిందని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలను తన మొదటి భార్య జెమీమా గోల్డ్‌స్మిత్‌ను ఉద్దేశించి చేశారనే సంగతి సుస్పష్టం. ఆమె 1995 నుంచి 2004 వరకు ఇమ్రాన్‌తో వైవాహిక బంధంలో ఉన్నారు. వీరిద్దరికీ విడాకులు మంజూరైన తర్వాత ఆమె కూడా చాలాసార్లు తాను పాకిస్థాన్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. 


ఇమ్రాన్ ఖాన్ తన రెండో భార్య రెహం ఖాన్ గురించి ప్రస్తావిస్తూ, తనకు వ్యతిరేకంగా 2018 ఎన్నికలకు ముందు ఓ పుస్తకం రాయడానికి ఇదే మాఫియా ఓ మహిళకు డబ్బులిచ్చిందన్నారు. Reham Khan పేరును ఆయన ప్రత్యక్షంగా పేర్కొనలేదు. 


రెహం ఖాన్ బీబీసీ మాజీ పాత్రికేయురాలు. ఆమె తన జీవితం గురించి ‘రెహం ఖాన్’ పేరుతో ఓ పుస్తకం రాశారు. దీనిలో అత్యధికంగా ఇమ్రాన్ ఖాన్‌తో తన జీవితం గురించి రాశారు. ఆధ్యాత్మికత, చేతబడులపై ఆయనకుగల నమ్మకాల గురించి రాశారు. ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యల అంతరార్థాన్ని గుర్తించిన రెహం ఖాన్ తక్షణమే ఘాటుగా స్పందించారు. 


రెహం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఆయనను పెళ్లి చేసుకోవడానికి, ఓ ఏడాదిపాటు ఆయనను భరించడానికి  నాకు వాళ్ళు ఎంత ఇచ్చారో ఆయనను దయచేసి అడగండి. నన్ను నిరంతరం వెంటాడటానికి వాళ్ళు ఆయనకు ఎంత ఇచ్చారో అడగండి. అపనమ్మకం ఓ వ్యాధి’’ అని మండిపడ్డారు. 


Updated Date - 2022-04-30T23:15:46+05:30 IST