ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు

ABN , First Publish Date - 2022-05-28T06:07:32+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పడకలు రోగులకు సరిపోవడం లేదని, అదనపు పడకల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీచేస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

అదనపు పడకలకోసం ప్రతిపాదనలు

ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌, ఎమ్మెల్యే 


నల్లగొండ అర్బన్‌, మే 27: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పడకలు రోగులకు సరిపోవడం లేదని, అదనపు పడకల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో కలిసి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ప్రవేశపెడుతున్న పథకాల వల్ల ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా పడకలు పెంచాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న 550 పడకలకు మరో 200 పడకలు అదనంగా పెంచి 750 పడకలు చేసేందుకు, ఆస్పత్రి అదనపు భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈఈ అజీజ్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ సేవలను పరిశీలించారు. ప్రస్తుతం ఇన్‌పేషంట్లకే సీటీ స్కాన్‌ సేవలు అందుతున్నా యా? లేదా? అని తెలుసుకున్నారు. అత్యవసర వార్డులో డ్యూటీలో ఉన్న నర్సుల కోసం పాత సీటీస్కాన్‌ గదిని కేటాయించాలన్నారు. ఆస్పత్రిలో ఎక్కడ కూడా అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూడాలన్నారు. నూతనంగా అందుబాటులోకి తెచ్చిన 50 పడకల ఐసీయూని పరిశీలించారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని ఆస్పత్రి అధికారులకు సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ఆపరేషన్ల సంఖ్య పెంచాలని, అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు అందించి రోగులను ప్రైవేటు ఆస్పత్రుల వైపు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆస్పత్రి డాక్టర్లపైనే ఉందన్నారు. ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలున్నా తక్షణమే తన దృష్టికి తీసుకొస్తే, సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానన్నారు. వారివెంట మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, ఆస్పత్రి డాక్టర్లు ఉన్నారు.


సమ్మె విరమించిన డాక్టర్లు 

నల్లగొండ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజకుమారి వైఖరికి నిరసనగా మెడికల్‌ కళాశాల డాక్టర్లు రెండు రోజులు గా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. శుక్రవారం ఉదయం కూడా డాక్టర్లు ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు సమ్మెలో పాల్గొన్నారు. కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆస్పత్రి తనిఖీకి రానుండటంతో అంతకుముందు డాక్టర్లను పిలిపించి తక్షణమే సమ్మె నిలిపేయాలని, ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు జారీ చేసే మెమోలు ఉపసంహరించుకుంటుకున్నానని ప్రిన్సిపాల్‌ తెలిపారు. హాజరులో ఎలాంటి కోత లేకుండా ఏప్రిల్‌ నెల మొత్తం వేతనం చేస్తున్నామని హామీచ్చి సమ్మె విరమించి సమ్మెకోసం వేసిన టెంటును తక్షణమే తీసివేయాలని డాక్టర్లను కోరారు. అయితే డాక్టర్లు మా త్రం తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నామని, సమ్మెకోసం వేసిన టెంట్‌ను కలెక్టర్‌ వచ్చే సరికి తీసివేసి విధులకు హాజరయ్యారు. కానీ డాక్టర్లు మాత్రం ప్రిన్సిపాల్‌ ఇచ్చిన మెమోల కు తాము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అర్థంపర్థం లేకుండా ఇచ్చిన మెమోలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ విధానా న్ని సూపరింటెండెంట్‌ పర్యవేక్షణలో కొనసాగించాలని, బయోమెట్రిక్‌తో పాటు రిజిస్టర్‌ అటెండెన్స్‌ కూడా పరిగణలోకి తీసుకోవాలని డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-05-28T06:07:32+05:30 IST