మందు బిళ్లలు తెచ్చిన పాపానికి జైలు శిక్ష

ABN , First Publish Date - 2020-09-16T09:09:21+05:30 IST

స్నేహితుడి కోరిక మేరకు.. తన సొంత ప్రాంతం నుంచి మందు బిళ్లల డబ్బాను తీసుకొచ్చిన పాపానికి ఓ తెలుగు ప్రవాసీ ఐదున్నరేళ్లు ..

మందు బిళ్లలు తెచ్చిన పాపానికి జైలు శిక్ష

రాజు క్షమాభిక్షతో ఐదున్నరేళ్లకు విడుదల..

టీవల హైదరాబాద్‌కు పయనం

తెలియక చేసిన తప్పునకు కొరడా దెబ్బలు

అతనితో పాటు.. మరో ముగ్గురికీ తిప్పలు


(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): స్నేహితుడి కోరిక మేరకు.. తన సొంత ప్రాంతం నుంచి మందు బిళ్లల డబ్బాను తీసుకొచ్చిన పాపానికి ఓ తెలుగు ప్రవాసీ ఐదున్నరేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. కొరడా దెబ్బలు కూడా తిన్నాడు. చివరికి క్షమాభిక్ష ప్రసాదంతో ఇటీవల స్వదేశానికి వెళ్లాడు. ఆ మందు బిళ్లలు తెప్పించిన హైదరాబాద్‌కు చెందిన దంపతులతో పాటు మరో యువకుడు కూడా జైలు, కొరడా దెబ్బల శిక్షలు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌కు చెందిన అబ్దుల్‌ వహీద్‌ (37) రియాద్‌ లోని ఒక బ్యాంకులో పని చేస్తుండేవాడు. ఆయనకు కూతురు పుట్టడంతో 2015లో హైదరాబాద్‌ వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో.., రియాద్‌లో పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన మోయిజ్‌.. తన స్నేహితుడి కుటుంబ సభ్యులు ఒక పార్శిల్‌ ఇస్తారని, దానిని తీసుకువారాలని కోరాడు.


తీరా విమానం దిగిన వెంటనే కస్టమ్స్‌ అధికారులు వహీద్‌ను తనిఖీ చేయగా.. ఆ పార్శిల్‌లో మందు బిళ్లల డబ్బా ఉంది. వాటి విక్రయంపై సౌదీలో నిషేధం ఉండటంతో.. పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మోయిజ్‌ మిత్రుడు షేక్‌ బదర్‌ కోరడంతో ఆ పార్శిల్‌ తెచ్చానని చెప్పాడు. పోలీసులు బదర్‌ను కూడా అరెస్టు చేశారు. తన భార్య హజ్రాకు అనారోగ్యం, నిద్రలేమి సమస్య ఉందని, సౌదీలో మందుల ఖరీదు ఎక్కువగా ఉండటంతో.. హైదరాబాద్‌ నుంచి తెప్పించానని బదర్‌ వెల్లడించాడు. కానీ, బదర్‌ భార్య గతంలో ఈ మందులను వాడలేదని పోలీసుల విచారణలో తేలింది.


కేసును విచారించిన న్యాయస్థానం నలుగురినీ దోషులుగా తేల్చి శిక్ష విధించింది.   వహీద్‌కు 8 సంవత్సరాల జైలు శిక్ష, 800 కొరడా దెబ్బలు, లక్ష రియాళ్ల (రూ.20 లక్షలు) జరిమానా, మందు బిళ్లలను తెప్పించిన బదర్‌, హజ్రాకు 5 సంవత్సరాల జైలు శిక్ష, 500 కొరడా దెబ్బలు, లక్ష రియాళ్ల జరిమానా, మోయిజ్‌కు రెండున్నరేళ్ల జైలు, 300 కొరడా దెబ్బలు విధించాలని కోర్టు తీర్పిచ్చింది. ఇటీవల సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ మానవతా దృక్పథంతో  క్షమాభిక్ష ప్రకటించగా.. అబ్దుల్‌ వహీద్‌ శిక్ష గడువుకు ముందే విడుదల అయి స్వదేశానికి వెళ్లాడు.  

Updated Date - 2020-09-16T09:09:21+05:30 IST