Abn logo
Jul 1 2020 @ 00:52AM

ఒక్కసారిగా తగ్గించలేం

  • 70శాతం ముడి ఔషధాలు చైనావే
  • ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ్‌ భాస్కర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : చైనా నుంచి ముడి ఔషధాల దిగుమతులను ఒక్కసారిగా తగ్గించడం సాధ్యం కాదు. దశల వారీగా మాత్రమే చైనా ఆధారనీయత పరిమితం చేసుకోగలమని ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మాగ్జిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. ఏపీఐ దిగుమతులపై భారత్‌, చైనా ఉద్రిక్తల ప్రభావం, ఫార్మా క్లస్టర్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఔషధ ఎగుమతుల అంచనాలు మొదలైన విషయాలపై ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. 


చైనా దిగమతులను తగ్గించడం సాధ్యమవుతుందా?

మన ఔషధ కంపెనీలకు అవసరమైన 60-70 శాతం ఏపీఐలు, ఇంటర్మీడియెట్లు, కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్‌ (కేఎస్‌ ఎం) చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వీటి విలువ దాదాపు 350 కోట్ల డాలర్లు (దాదాపు రూ.24,500 కోట్లు).  ఒక్క సారిగా దిగుమతులను భారీగా తగ్గించడం సాధ్యం కాదు. దశల వారీగా మాత్రమే తగ్గించగలం.   చైనాపై ఎక్కువగా ఆధారపడడం ఔషధ భద్రతను దెబ్బ తీస్తుంది. దేశీయ ఔషధ పరిశ్రమకు కొవిడ్‌ ఒక మేలుకొలుపు. గత ఏడాది చైనా నుంచి ముడి ఔషధాల దిగుమతులు దాదాపు 4 శాతం తగ్గినట్లు అంచనా. 


చైనా దిగుమతులను తగ్గించుకోవాలని నిర్ణయించడానికి ప్రధాన కారణాలేమిటి?

చాలా కాలం నుంచి ముడి ఔషధాల దిగుమతులను తగ్గించుకోవాలని పరిశ్రమ భావిస్తోంది.  ఇక్కడ వ్యయం అధికంగా ఉండడం వల్ల దిగుమతి చేసుకుంటున్నాం. ఏపీఐల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు కల్పించాలని ప్రభుత్వాన్ని చాలా కాలం నుంచి కోరుతున్నాం. అయితే.. కొవిడ్‌ వైరస్‌ కారణంగా సరఫరా వ్యవస్థ దెబ్బతినడం, చైనాలో ఉత్పత్తి నిలిచిపోవడం, అక్కడి పర్యావరణ నిబంధనలు కఠినం కావడం, సరిహద్దు ఉద్రిక్తతలు మొదలైనవి దేశీయంగా ఏపీఐల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి దోహదం చేస్తున్నాయి. పెరుగుతున్న ముడి ఔషధ వ్యయం కంపెనీల మార్జిన్లపై ప్రభావాన్ని చూపుతోంది. ఈ ఏడాది మార్చి, మేల మధ్య ధరలు 20 శాతం పైగా పెరిగినట్లు చెబుతున్నారు. 


ఔషధ క్లస్టర్ల ఏర్పాటు, ఉత్పత్తి ప్రోత్సాహకాల వల్ల  దిగుమతులు ఏ మేరకు తగ్గొచ్చు?

దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికే ఔషధ క్లస్టర్లను ప్రోత్సహించే అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఇప్పుడున్న ఔషధ పార్కులు, కొత్తగా ప్రతిపాదించిన పార్కుల్లో ఉమ్మడి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం మూడు పార్కులకు రూ.1,000 కోట్ల వంతున సాయం చేయనుంది. పార్కుల ఎంపిక మార్గదర్శకాలను  త్వరలో విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, తమిళనాడు ఈ నిధుల కోసం ప్రతిపాదనలను సమర్పించినట్లు తెలుస్తోంది. దేశీయంగా ఇంటర్మీడియెట్లను అభివృద్ధి చేయడానికి ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. దీనికి వచ్చే ఎనిమిదేళ్లలో దాదాపు రూ.6,940 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా 53 ఔషధ ఉత్పత్తులకు సబ్సిడీలు ఇస్తారు. 


రెమ్‌డెసివిర్‌, ఫావిపిరావిర్‌ వంటి కొవిడ్‌  ఔషధాలను భారత కంపెనీలు తయారు చేయడానికి నడుం బిగించాయి. ఎగుమతులపై ఇవి ఎ లాంటి  ప్ర భావాన్ని చూపగలవు?

రెమ్‌డెసివిర్‌ తయారు చేసి 127 దేశాల్లో విక్రయించడానికి హెటెరో, డాక్టర్‌ రెడ్డీస్‌, మైలాన్‌ కంపెనీలు గిలీడ్‌ నుంచి లైసెన్స్‌ పొందాయి. హైదరాబాద్‌ కంపెనీ ఒకటి  ఫావిపిరావిర్‌ను ఎగుమతి చేస్తోంది. ఎగుమతులు పెరగడానికి ఇవి దోహదం చేస్తాయి. అయితే.. రెమ్‌డెసివిర్‌ పూర్తి స్థాయి చికిత్స ఔషధం కాదు. కొవిడ్‌  చికిత్సలో దీన్ని ఎంత కాలం కొనసాగిస్తారన్నది ప్రధానం. భారత్‌ బయోటెక్‌, తదితర కంపెనీలు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే వ్యాక్సిన్‌ ఎగుమతులు పెరుగుతాయి. 


2020-21 ఏడాదికి ఔషధ ఎగుమతులు ఏ స్థాయిలో ఉంటాయి?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2,400 కోట్ల డాలర్ల (దాదాపు రూ.1.68 లక్షల కోట్లు) ఔషధ ఎగుమతులు నమోదు కాగలవని అంచనా. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ మే  నెలలో ఎగుమతులు 17 శాతం పెరిగాయి. అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఎగుమతులు రెండంకెల వృద్ధిని నమోదు చేయగల పరిస్థితులు ఉన్నాయి. 2019-20 అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఎగుమతులు 7.57శాతం వృద్ధితో రూ.2,058 కోట్ల డాలర్లకు చేరాయి. 2018-19లో 1,913 కోట్ల డాలర్లు నమోదయ్యాయి. 


జపాన్‌ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందా?

ఇటీవల భారత్‌ మార్కెట్‌పై జపాన్‌ కంపెనీలకు అవగాహన కల్పించడానికి కార్యక్రమాన్ని చేపట్టాం. జపాన్‌లో నియంత్రణ సంస్థ నిర్దేశించే ప్రమాణాల కన్నా ఉన్నత ప్రమాణాలను కంపెనీలే సొంతగా నిర్ణయించుకుని ఔషధాలను తయారు చేస్తాయి. భారతకు రావడానికి అనేక అంశాలను ఆక్కడి కంపెనీలు ఆలోచిస్తాయి. అంత తొందరగా భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి జపాన్‌ కంపెనీలు ముందుకు రాకపోవచ్చు.

Advertisement
Advertisement
Advertisement