TS: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్య గమనిక

ABN , First Publish Date - 2021-10-13T14:10:07+05:30 IST

ఇంటర్‌..

TS: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్య గమనిక

70శాతం సిలబస్‌తోనే ఫస్టియర్‌ ప్రశ్నపత్రాలు

పరీక్షల గురించి ఒత్తిడి, భయం వద్దు

విద్యార్థులకు సూచించిన ఇంటర్‌ బోర్డు

వెబ్‌సైట్‌లో ఉచితంగా స్టడీ మెటీరియల్‌

ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫస్టియర్‌ పబ్లిక్‌ పరీక్షలను 70% సిలబస్‌తోనే నిర్వహించనున్నట్టు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. దీన్ని అనుసరించే ప్రశ్నపత్రాలను రూపొందించినట్టు, ఇంటర్నల్‌ చాయిస్‌ను పెంచినట్టు వెల్లడించింది. పరీక్షల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని తెలిపింది. కరోనా కారణంగా రద్దయిన ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలను ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించాలని బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల పట్ల విద్యార్థుల్లో వ్యక్తమవుతున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెకండియర్‌లో కాలేజీ మారిన విద్యార్థులు.. ఫస్టియర్‌లో చదివిన కళాశాల జోన్‌ నుంచే పరీక్షలకు హాజరుకావాలన్నారు. కాగా, ఫస్టియర్‌ పరీక్షల కోసం ఉచిత స్టడీ మెటీరియల్‌తోపాటు సబ్జెక్టుల వారీగా మోడల్‌ క్వశ్చన్‌ పేపర్లను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుతం జువాలజీ, బోటనీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, హిస్టరీ సబ్జెక్టుల మెటీరియల్‌ను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. రెండు మూడు రోజుల్లో మిగతా సబ్జెక్టుల మెటీరియల్‌ను అప్‌లోడ్‌ చేస్తామన్నారు.


కాలేజీల షిఫ్టింగ్‌ కుదరదు..!

ఒక మండలం నుంచి మరో మండలానికి, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరస్కరించినట్టు సమాచారం. కాలేజీలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకోవడానికి వీలుగా 2021 మార్చిలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ఆధారంగా రాష్ట్రంలో సుమారు 42 కాలేజీలు షిఫ్టింగ్‌ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో కొన్ని కాలేజీలు ఒక మండలం నుంచి మరో మండలానికి, ఇంకొన్ని కాలేజీలు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చాలని దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో 26 కాలేజీలకు సంబంధించిన ఫైలును ప్రభుత్వ అనుమతి కోసం పంపించారు. ఈ కాలేజీల షిఫ్టింగ్‌కు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభిప్రాయపడ్డారు. దీంతో ఫైలును తిరస్కరిస్తూ వెనక్కి పంపించారు.


గెస్ట్‌ లెక్చరర్ల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌

జూనియర్‌ కాలేజీల్లో గెస్ట్‌ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. గెస్ట్‌ లెక్చరర్ల నియామకాలకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Updated Date - 2021-10-13T14:10:07+05:30 IST