కీలక ఎన్నికలు

ABN , First Publish Date - 2021-02-27T06:23:34+05:30 IST

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించడంతో రాజకీయవేడి మరింత రాజుకోబోతున్నది. రిటైర్‌ కాబోతున్న ప్రధాన ఎన్నికల అధికారి సునీల్‌ అరోరా ఇదే నా ఆఖరి సమావేశం అంటూ మార్చి...

కీలక ఎన్నికలు

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించడంతో రాజకీయవేడి మరింత రాజుకోబోతున్నది. రిటైర్‌ కాబోతున్న ప్రధాన ఎన్నికల అధికారి సునీల్‌ అరోరా ఇదే నా ఆఖరి సమావేశం అంటూ మార్చి 27నుంచి ఆరంభమై, మే 2న ఫలితాల ప్రకటన వరకూ కొనసాగే ఈ ఎన్నికల వివరాలను మీడియాకు తెలియచేశారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఒకే విడతలో, అసోం మూడుదశల్లో పోలింగ్‌కు పోతుంటే, బెంగాల్‌ మాత్రం ఎనిమిది విడతల పోలింగ్‌ జరుపుకోవడం కేవలం మోదీ కుట్ర అని పశ్చిమబెంగాల్‌ సీఎం అప్పుడే నిప్పులుకక్కుతున్నారు. దేశంలో కరోనా వైరస్‌ ప్రబలిన తరువాత జరుగుతున్న అతిపెద్ద ఎన్నికలు ఇవి. గత ఏడాది నవంబరులో బిహార్‌ ఎన్నో జాగ్రత్తల మధ్య ఎన్నికలకు పోయింది. ఇప్పుడు కరోనా వ్యాప్తి కాస్తంత తగ్గుముఖం పట్టిన స్థితిలో, మలివిడత విజృంభణ భయాల మధ్య 18కోట్లమంది ఈ ఎన్నికల్లో ఓటువేయబోతున్నారు.

 

పుదుచ్చేరిలో ప్రధాని పర్యటన తరువాతే ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుందని అనుకున్నదే. ఎన్నికలకు పోవాల్సి ఉన్న ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని ముందుగానే కాంగ్రెస్‌ చేతుల్లోనుంచి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ గుప్పిట్లోకి లాగేవరకూ బీజేపీ ఊరుకోలేదు. కేంద్రంలో మోదీ–అమిత్‌ షా ద్వయం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ ఎన్నికా యుద్ధమే. ఎన్నికలకు ముందు కదనరంగాన్ని అనుకూలంగా తీర్చిదిద్దుకోవడంలో బిజెపిది అందెవేసిన చెయ్యి. పుదుచ్చేరిలో ప్రధానంగా రెండు జాతీయపార్టీల మధ్య జరిగే ఈ యుద్ధంలో, కాంగ్రెస్‌ నుంచి చేరివచ్చిన కీలకనేతల సహాయంతో బిజెపి గెలుస్తుందో, కిరణ్‌బేడీ కుట్ర రాజకీయాలపై కాంగ్రెస్‌ విమర్శలను ప్రజలు విశ్వసిస్తారో చూడాలి. నామినేటెడ్‌ ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన బిజెపి ఇప్పుడు సంపూర్ణాధికారం కోసం తపించిపోతోంది. ఈ ఎన్నికలకు ముందు బిజెపి చేతుల్లో ఉన్నది అసోం ఒక్కటే. అక్కడ దాని అధికారానికి వచ్చే ప్రమాదమేమీ లేదు. 


తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో బిజెపి శక్తిమేర పోరాడుతున్నది. గత ఎన్నికల్లో ఒక స్థానం మాత్రమే దక్కిన కేరళలో, మారోమారు మతంతో పాటు మెట్రో శ్రీధరన్‌ వంటివారి ప్రయోగం అదనంగా ఎన్నిస్థానాలు సంపాదిస్తుందో చూడాలి. రాహుల్‌ గాంధీ శ్రమకు కొంత గుర్తింపు లభించవచ్చునేమో కానీ, కమ్యూనిస్టు పాలనమీద ప్రజల్లో అంతవ్యతిరేకత ఏమీ లేదు. కరుణానిధి, జయలలిత కన్నుమూత తమిళరాజకీయాల్లో ఎన్నడూలేనంత శూన్యాన్ని సృష్టించింది. జయలలిత కన్నుమూసిన క్షణంనుంచి తమిళరాజకీయాల్లో కాలూనడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు తెలిసినవే. పన్నీరు సెల్వం తిరుగుబాటు, శశికళ జైలుకు పోవడం, బిజెపి ఒత్తిడి మేరకు పళని–పన్నీరు మధ్య సయోధ్య, ఇద్దరూ ఉమ్మడిగా శశికళపై తిరుగుబాటు చేయడం ఇత్యాది పరిణామాలు ఓటర్లను ఏమేరకు ప్రభావితం చేశాయో ఈ ఎన్నికలు చెబుతాయి. రాజకీయాల్లోకి వస్తాడనుకున్న రజనీ రాకపోవడం, రావద్దని కోరుకున్న శశికళ తిరిగి రావడం బీజేపీ–అన్నాడీఏంకె ఆశలను బాగా దెబ్బతీశాయని అంటున్నారు. స్టాలిన్‌ ప్రభావం అంతర్లీనంగా చాలా ఉందన్న వాదనా వినిపిస్తున్నది.


నడిమధ్యలో ఉన్న కమల్‌హాసన్‌ పట్ల ఎవరికీ పెద్ద నమ్మకాలు లేవు కానీ, రజనీయే చివరినిముషంలో పరోక్ష మద్దతుతో ఫలితాలను తారుమారుచేయవచ్చునన్న అనుమానాలైతే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అందరి దృష్టీ ప్రధానంగా పశ్చిమబెంగాల్‌పైనే ఉంది. ముచ్చటగా మూడోమారు అధికారంలోకి రావాలనుకుంటున్న మమతనుంచి బెంగాల్‌ను వశం చేసుకొని, మోదీకి పోటీగా జాతీయరాజకీయాల్లోకి ఎదగాలన్న ఆమె ప్రయత్నాలను ఆదిలోనే తుంచివేయాలని ఢిల్లీ పెద్దల ప్రయత్నం. తృణమూల్‌ కీలకనాయకులు కొందరు కాషాయకండువాలు కప్పుకుంటున్నా దీదీ వెరవకుండా పోరాడుతున్నారు. రాబోయే రోజుల్లో బిజెపి నడవడికను, దూకుడును ప్రభావితం చేసే ఈ ఎన్నికల్లో దేశంలోని వేర్వేరు ప్రాంతాల ప్రజలు ఏ తీర్పు ఇస్తారో చూడాలి.

Updated Date - 2021-02-27T06:23:34+05:30 IST