కట్టు తప్పుతున్న జనం

ABN , First Publish Date - 2020-06-05T10:16:45+05:30 IST

జిల్లాలో లాక్‌డౌన్‌ సడలింపుల అమలు తీరు ప్రమాదాన్ని తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నది.

కట్టు తప్పుతున్న జనం

మాస్కులు ధరించరు...

 భౌతిక దూరం పాటించరు

 యథేచ్ఛగా వీధులలో రద్దీ వాతావరణం

 నామమాత్రంగా యంత్రాంగం చర్యలు


ఒంగోలు, జూన్‌ 4 : జిల్లాలో లాక్‌డౌన్‌ సడలింపుల అమలు తీరు ప్రమాదాన్ని తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నది. అత్యధిక ప్రాంతాల్లో జనం కట్టు తప్పుతున్నారు. పట్టణాలలో ప్రత్యేకించి ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యధికులు మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటి జన సంచారం, వాహనాల తాకిడితో పలు చోట్ల తీవ్ర రద్దీ వాతావరణం నెలకొంటుండగా నియంత్రించడంపై యంత్రాంగం అంతగా దృష్టి పెట్టడం లేదు. దాదాపు 70 రోజుల తర్వాత జిల్లాలో లాక్‌డౌన్‌ సడలింపులు అమలు జరుగుతున్నాయి. అధికారికంగా కేంద్రం ప్రకటించిన 5.0 లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సండలింపు నిబంధనలు అమలు సరిగా జరగడం లేదు.


దుకాణాలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇతరత్రా ప్రైవేటు సంస్థలన్నింటిని ఉద యం 7నుంచి రాత్రి 7 వరకు తెరిచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయా సంస్థల వద్ద ప్రభుత్వం నిర్దేశించిన సడలింపు నిబంధనలు అయిన మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటింపు, శానిటైజ్‌వంటి అంశాలు అంతంత మాత్రంగానే అమలవుతున్నాయి. ఇక రోడ్లపై జనసంచారం, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలపై రాకపోకలు సాగించేవారు, చిరు వ్యాపారులు, వివిధ వ్యాపారాలు చేసేవారు వీటి గురించి అంతగా పట్టించుకోవడం లేదు. అత్యధిక శాతం మంది వాటినేవి పాటించకుండానే తిరుగుతున్నారు. ఒంగోలు నగరంలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నది.  టీకొట్లు, చిరు వ్యాపారాలు, వీధి వ్యాపారులు, ఒక మోస్తరు దుకాణాలతో పాటు రోడ్లపై నిబంధనలు పాటించకుండా తిరిగేవారు అధికంగా కనిపిస్తున్నారు. పోలీస్‌ యంత్రాంగం సాధారణ ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ కు పరిమితమై లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు పట్టించుకోవడం లేదు.


ఒంగోలులో గురువారం కార్పొరేషన్‌ సిబ్బంది అక్కడక్కడ రోడ్లపై తనిఖీలు చేసి కొంత హడాహుడి చే శారు. ఇతర ప్రాంతాలో ఆది కూడా కనిపించలేదు. కరోనా మాత్రం జిల్లాలో రోజు రోజుకు విస్తరిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో కట్టుతప్పుతున్న జనాన్ని నియంత్రించకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2020-06-05T10:16:45+05:30 IST