Amma Odi date ఫిక్స్..! ఎప్పుడంటే..!

ABN , First Publish Date - 2022-05-13T19:54:58+05:30 IST

సంక్షేమ కేలండర్‌, సాగునీటి విడుదలకు సంబంధించిన ప్రణాళికలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ నెల 16న రైతు భరోసా...జూన్‌ 21వ తేదీన అమ్మ ఒడి ఇస్తామని ప్రకటించింది. అదేవిధంగా సాగునీటి విడుదలను ఏ డెల్టాకు ఎప్పుడు విడుదల...

Amma Odi date ఫిక్స్..! ఎప్పుడంటే..!

జూన్‌ 21వ తేదీన అమ్మ ఒడి

ఈ నెల 16వ తేదీన రైతు భరోసా

ఈసారి ముందుగానే సాగునీళ్లు

గౌతంరెడ్డి పేరుతో యూనివర్సిటీ

పలు కంపెనీలకు భూముల కేటాయింపు

మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు 


అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ కేలండర్‌, సాగునీటి విడుదలకు సంబంధించిన ప్రణాళికలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ నెల 16న రైతు భరోసా...జూన్‌ 21వ తేదీన అమ్మ ఒడి(Amma Odi) ఇస్తామని ప్రకటించింది. అదేవిధంగా సాగునీటి విడుదలను ఏ డెల్టాకు ఎప్పుడు విడుదల చేస్తామన్నదీ చెప్పింది. గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి(Chief Minister YS Jaganmohan Reddy) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ... .సంక్షేమా నికి క్యాలండర్‌ ప్రకటించిన తొలి పాలకుడు జగన్‌. శుక్రవారం సీఎం ముమ్మిడివరంలో మత్స్యకార భరోసా పథకం ద్వారా నిధులు విడుదల చేస్తారు. ఈ నెల 16న రైతు భరోసా పథకంలో భాగంగా రూ.5,500 ఖాతాల్లో వేస్తారు. ఇదే పథకం కింద ప్రధానమంత్రి కిసాన్‌ యోజన కింద వచ్చే రూ.2వేలు ఈ నెల 31వ తేదీన వేస్తాం. 19న పశువుల కోసం అంబులెన్స్‌లు ప్రారంభిస్తాం. జూన్‌ 6వ తేదీన 3వేల ట్రాక్టర్లు, 4,200హార్వెస్టర్ల పంపిణీ  చేస్తాం. జూన్‌ 14న వైఎస్సార్‌ పంటల బీమా ద్వారా 2021ఖరీఫ్‌ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అంది స్తాం. జూన్‌ 21వ తేదీన అమ్మ ఒడి తల్లుల ఖాతాల్లో వేస్తాం’’ అని పేర్కొ న్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నాణ్యతతో చేయా లని సీఎం చెప్పారని, వైసీపీ ఎమ్మెల్యేలు లేనిచోట్ల ప్రభుత్వ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు కలిసి ఈ కార్యక్రమం చేస్తారని చెల్లుబోయిన తెలిపారు.


1 నుంచి గోదావరి డెల్టాకు నీరుగోదావరి డెల్టాకు జూన్‌ 1వ తేదీనుంచి, కృష్ణా డెల్టాకు జూన్‌ 10వ తేదీనుంచి నీటిని ఇస్తామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ‘‘ఎందుకింత తొందరగానే ఇవ్వగలుగుతున్నామంటే... పోలవరం స్లూయిజ్‌ పూర్తి అయింది. ఇప్పటికే సముద్రంలోకి కొంత నీరు వృథాగా వెళ్లిపోతోంది. డెడ్‌స్టోరేజీ నుంచి కూడా కొంత నీరు విడుదల చేస్తాం. ఇక కృష్ణా డెల్టా, గుంటూరు చానల్‌కు జూన్‌ 10నుంచి నీరిస్తాం. పులిచింతలలో నీరుంది. ఆ నీటిని ఉపయోగించుకునేలా వైసీపీ ప్రభుత్వం వచ్చాక భూసేకరణకు రూ.100కోట్ల పరిహారం చెల్లించి నిల్వ చేసే దానికి ఏర్పాటుచేశాం. పట్టిసీమ మీద ఆధారపడకుండా పంటలకు నీరివ్వచ్చు. ఇక.. నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు జూలై 15నుంచి నీటిని ఇస్తాం. నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత ఉంది. సోమశిల, గండికోట, చిత్రావతి, బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టుల రైతాంగానికి జూలై 10నుంచి నీరు విడుదల చేస్తాం. సోమశిల సామర్థ్యం 78టీఎంసీలు కాగా, 56టీఎంసీలు నిల్వ ఉంది. కాబట్టి నీరు ఇవ్వగలం. రాయలసీమకు సంబంధించి గోరకల్లు, అవుకు, గండి, ఎస్‌ఆర్‌బీసీ ఆయకట్టులకు జూన్‌ 30న నీరు విడుదల చేస్తాం. వంశధార, తోటపల్లి, గొట్ట తదితర ప్రాజెక్టుల ఆయకట్లకు నీటి నిల్వను అంచనా వేసి నిర్ణయిస్తాం. ఇలా నీటి విడుదల ప్రణాళికను ముందే చెప్పడం వల్ల రైతులు సిద్ధమవుతారు. ఖరీఫ్‌ తొందరగా ప్రారంభమవుతుంది. నవంబరు-డిసెంబరు నెలల్లో తుఫాన్లు వస్తాయి. తొందరగా నీళ్లిస్తే అప్పటికి పంట చేతికొచ్చేస్తుంది. రబీ కూడా తొందరగా వేసుకునేందుకు అవకాశం ఉండడంతో పాటు మూడోపంట అపరాలు, గడ్డి వేసుకునేందుకూ కొన్నిచోట్ల వీలుంటుంది’’ అని అంబటి తెలిపారు. నీరు ఆలస్యంగా ఇవ్వడంవల్ల అనేక సమస్యలు వస్తాయని ఆలోచించి ముందుగానే విడుదల చేస్తున్నామని మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ‘‘చరిత్రలో మొదటిసారిగా అనుకున్నదానికంటే ముందు నీళ్లు ఇవ్వనున్నాం. అందుకనుగుణంగా రైతు భరోసా కేంద్రాలకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని కాకాణి పేర్కొన్నారు.


కేబినెట్‌ ముఖ్యాంశాలు.. 

కృష్ణా జిల్లా పామర్రులో ఉన్న పీహెచ్‌సీని అప్‌గ్రేడ్‌ చేసి 38అదనపు పోస్టులు మంజూరు. పులివెందులలో ఏర్పాటుచేసే మహిళా డిగ్రీ కాలేజీకి 26మంది లెక్చరర్లు, 10మంది సిబ్బంది కోసం పోస్టులు మంజూరు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, రైతు బజార్లలో మౌలిక సదుపాయాలకు రూ.1600కోట్ల రుణ సమీకరణకు ఆమోదం. మార్కెఫెడ్‌లో మేనేజర్లు, ఉప మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్ల పోస్టుల భర్తీకి సమ్మతి. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎంఆర్‌ఆర్‌ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో మేకపాటి గౌతమ్‌రెడ్డి అగ్రీ కాలేజీ ఏర్పాటు. 2022-27 ఎగుమతుల విధానం,  లాజిస్టిక్స్‌ ప్రోత్సాహకాల విధానాలకు ఆమోదం. నెల్లూరులో వెంకటాచలం మండలంలో క్రిబ్కో సంస్థ విత్తనాల బదులుగా బయో ఇథనాల్‌ ప్లాంట్‌ను పెడతామని చేసిన ప్రతిపాదనకు ఆమోదం. లోకాయుక్తలో పోస్టుల మంజూరుకు సమ్మతి. ప్రైవేటురంగంలో 100పడకల ఆస్పత్రుల నిర్మాణానికి ఆమోదం. మచిలీపట్నం, ఒంగోలు, కొత్తూరులో అత్యాధునిక ఆస్పత్రుల కోసం భూకేటాయింపులు. కడప జిల్లాలో ఆస్పత్రికి భూమి మంజూరు. సూళ్లూరుపేట దగ్గర 11ఎకరాలు టెక్స్‌టైల్‌ పార్కుకు, మడకశిర దగ్గర 235ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు. మడకశిర మండలం గౌడనహళ్లిలో 314.18ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు. మరో 192.8ఎకరాలు కూడా ఇదే కార్పొరేషన్‌కు. ఇక్కడ ఫుడ్‌ప్రాసెసింగ్‌, టైక్స్‌టైల్స్‌ యూనిట్లు ఏర్పాటు. పెనుగొండలో 40.4ఎకరాలు టూరిజం కోసం, తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలో పారిశ్రామిక పార్కు కోసం కొంత భూమిని కేటాయింపు. కోనసీమ జిల్లాలో పేరవరం దగ్గర ఏపీటీడీసీ 56ఎకరాల విస్తీర్ణంలో రిసార్ట్స్‌ కట్టేందుకు ఆమోదం. విశాఖపట్నంలోని ఎండాడలో కాపు భవన్‌ నిర్మాణానికి 50సెంట్లు కేటాయింపు. బాపట్ల జిల్లా రేపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు సవరించిన సరిహద్దులకు ఆమోదం. పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం దగ్గర బ్రిటిష్‌ కాలం నుంచీ సాగుచేస్తున్న 1754ఎకరాలను లీజుదారులకు రూ.100చొప్పున హక్కులు కల్పిస్తూ స్టాంప్‌, రిజిస్ర్టేషన్‌ చార్జీల నుంచి మినహాయింపు. సుమారు వెయ్యిమంది రైతులు ఈ భూముల్ని సాగుచేస్తున్నారు.

Read more