రైతుల నిరసనపై తొలగని ప్రతిష్టంభన.. చర్చలకు నో..!

ABN , First Publish Date - 2020-11-29T22:26:04+05:30 IST

కేంద్రం తెచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దు పాయింట్లలో రైతులు చేపట్టిన..

రైతుల నిరసనపై తొలగని ప్రతిష్టంభన.. చర్చలకు నో..!

న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దు పాయింట్లలో రైతులు చేపట్టిన  నిరసన నాలుగో రోజైన ఆదివారం కూడా కొనసాగుతోంది. మరికొంత మంది రైతులు కూడా వచ్చి చేరడంతో నిరసనకారుల సంఖ్య పెరిగింది. సిటీలోని బురారీ గ్రౌండ్స్‌లో వందలాది మంది ప్రదర్శకులు చేరుకున్నారు. పలు రోడ్లు, ఎంట్రీ పాయింట్లు దిగ్బంధం చేయడంతో, రైతులు నిరంకారి గ్రౌండ్స్‌కు తరలి వెళ్లాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా అక్కడ ప్రదర్శనలు చేసుకోవాలని, నిర్దేశించిన ప్రదేశానికి వెళ్లిన తర్వాత సాధ్యమైనంత త్వరగా చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.


రైతులు నో...

చర్చలకు అమిత్‌షా ఇచ్చిన ఆఫర్‌ను రైతులు తోసిపుచ్చారు. రైతుల సమస్యలు, డిమాండ్లపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, నిరసనలకు నిర్దేశించిన ప్రదేశానికి రైతులు వెళ్తేనే చర్చలు జరుగుతాయని అమిత్‌షా శనివారంనాడు ప్రతిపాదన చేశారు. కాగా, తమ నేతలు భవిష్యత్ కార్యాచరణపై సమావేశం జరుపుతున్నారని, సమావేశంలో ఏది నిర్ణయిస్తే ఆ విధంగా నడుచుకుంటామని ఆందోళనలో పాల్గొంటున్న రైతులు తెలిపారు. కాగా, సింఘు సరిహద్దు (ఢిల్లీ-హర్యానా) వద్ద నిరసనల్లో పాల్గొంటున్న రైతులకు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజిమెంట్ కమిటీ (డీఎస్‌జీఎంసీ) ఆహారం అందజేసింది.


బేషరతుగా చర్చలు  జరపండి...

కాగా, రైతుల ఆందోళనపై ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ, రైతులతో చర్చలకు ఎలాంటి షరతులు విధించరాదని, తక్షణం కేంద్రం చర్చలు జరపాలని అన్నారు. నిరసన చేస్తున్న వారంతా ఈ దేశ రైతులనీ, వారు ఎక్కడ నిరసన తెలపాలనుకున్నా అనుమతించాలని అన్నారు.

Updated Date - 2020-11-29T22:26:04+05:30 IST