కుండపోత

ABN , First Publish Date - 2022-08-09T05:43:19+05:30 IST

తీవ్ర అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసింది.

కుండపోత
మామిడిపల్లి వంతెన వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న సువర్ణముఖీ నది

 జిల్లాపై అల్పపీడన ప్రభావం

 అంతటా వర్షం

 ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు

సాలూరు రూరల్‌/గుమ్మలక్ష్మీపురం/గరుగుబిల్లి/మక్కువ, ఆగస్టు 8: తీవ్ర అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసింది. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండగా,  మబ్బులతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. కొన్నిచోట్ల చిరుజల్లులే కురిశాయి.  ‘మన్యం’ ఏజెన్సీలో మాత్రం కుండపోతగా వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. ప్రధాన రహదారులు, కూడళ్లలో వర్షపునీరు నిలిచిపోవడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. వాగులు, వంకలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి.  ఏవోబీలో సాలూరుకు అనుకొని ఉన్న ఒడిశా రాష్ట్రం పొట్టంగి  తూర్పుకనుమల్లో 15 సెంటీ మీటర్లు ( 149 మిల్లీమీటర్లు ) వర్షం కురిసింది. దీంతో  సువర్ణముఖీ, గోముఖీ నదులతో  పాటు వివిధ కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సాలూరు మండలంలోని మామిడిపల్లి వద్ద సువర్ణముఖీకి  వరద పోటెత్తడంతో  గ్రామంలోని  పీహెచ్‌సీ నీటమునిగిపోయే ప్రమాదముందని ఆసుపత్రివర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు సాలూరు అర్బన్‌,రూరల్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఇదిలా ఉండగా గురుగుబిల్లి మండలం తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి వరద ప్రవాహం పెరిగింది.  సోమవారం నాటికి  పైనుంచి నదిలోకి 4,500 క్యూసెక్కులు రాగా, దిగువకు 3,500 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా కిందకు విడుదల చేశారు.   ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 104.15 మీటర్ల మేర నీటి నిల్వ సామర్థ్యం ఉంది.   నదీ తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ అజూ రఫీజాన్‌ సూచించారు.   నది వైపు ఎవరూ వెళ్లకుండా దండోరా వేయించాలని  వీఆర్‌వోలను ఆదేశించారు.  మక్కువ మండలంలోని శంబర గ్రామ సమీపంలో ఉన్న వెంగళరాయ సాగర్‌ జలాశయం నుంచి 70 క్యూసెక్కుల నీటిని సువర్ణముఖి నదిలోకి విడుదల చేసినట్లు  ఏఈ రాజశేఖర్‌ తెలిపారు.    

 

Updated Date - 2022-08-09T05:43:19+05:30 IST