Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా వేళ..కంటి నిండా నిద్ర

ఒక వైపు కొవిడ్‌... మరో వైపు శీతాకాలం..

రకరకాల ఆరోగ్య సమస్యలు... 

వీటితో అనేక మందికి కంటి నిండా కునుకు లేకుండా పోతోంది

ఇలా పారిపోతున్న నిద్రను ఎలా ఒడిసి పట్టుకోవాలో చెబుతున్నారు స్లీప్‌ స్పెషలిస్ట్‌... 

డాక్టర్‌ విశ్వేశ్వరన్‌ బాలసుబ్రమణియన్‌


రోజుకు కనీసం 8 గంటల నిద్ర అవసరం. నిద్రలో శరీరం విశ్రాంత స్థితిలోకి చేరుకుంటుంది. దాంతో మరుసటి రోజుకు సరిపడా ఉత్సాహం, శక్తి నిద్రతో పొందుతాం. అయితే కరోనా కారణంగా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నవాళ్లు ఎక్కువ సమయం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్లతో గడుపుతున్నారు.వాటి నుంచి వెలువడే నీలం వెలుగు నిద్రలేమికి కారణమవుతూ ఉంటుంది. అలాగే కరోనా గురించిన భయం, ఆందోళన కూడా నిద్రలేమికి దారి తీస్తూ ఉంటాయి. సక్రమమైన హార్మోన్ల ఉత్పత్తికి, రోగనిరోధకశక్తికి ఎంతో కీలకమైన నిద్రకు ఏర్పడే ఈ అవరోధాలను తేలికగా తీసుకోకూడదు. దీర్ఘకాల నిద్రలేమి తీవ్రమైన రుగ్మతలకు దారితీస్తుంది. పనుల్లో ఏకాగ్రత తగ్గడం, శక్తి లోపించడం లాంటి స్వల్ప ఇబ్బందులతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి. 


అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా

గురకతో నిద్రకు పదే పదే భంగం కలగడమే అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా. మనందరం నిద్రలో ఎంతో కొంత గురక పెడుతూ ఉంటాం. అధిక బరువు ఉన్నవారిలో, అడినాయిడ్‌, టాన్సిల్స్‌ కలిగిన పిల్లల్లో గురక ఎక్కువగా ఉంటుంది. గురకతో నిద్రకు, పక్కనున్న వాళ్లకు అసౌకర్యం కలుగుతున్నా, మరుసటి రోజు పగటివేళ నిద్ర అవసరం పడుతున్నా... ఆ గురకను సమస్యగా భావించాలి. అలాగే గురకతో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉంటే అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియాను తీవ్రంగా పరిగణించాలి. గురక సమయంలో ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలి పరిమాణం తగ్గుతుంది. గొంతులోని శ్వాస నాళం ఇరుకుగా మారి, సరిపడా గాలి లోపలికి వెళ్లదు. దీనివల్ల శరీరంలోని ప్రధాన అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. దాంతో సింపథెటిక్‌ సిస్టం అప్రమత్తమవుతుంది. ఏదైనా విపరీతమైన స్థితి తలెత్తినప్పుడు శరీరం ఎలాగైతే స్పందిస్తుందో, దాన్ని పోలిన పరిస్థితే (సింపథెటిక్‌ సిస్టం) స్లీప్‌ ఆప్నియాలోనూ తలెత్తుతుంది. విశ్రాంత స్థితికి చేరుకోవలసిన నిద్ర సమయంలో శరీరం అప్రమత్తమవడంతో ఆ ప్రభావం పలు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.


హైపర్‌టెన్షన్‌: రక్తనాళాలు, గుండె ఒత్తిడికి లోనై హైపర్‌టెన్షన్‌ మొదలవుతుంది.


అథెరోస్ల్కెరోసిస్‌: గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు కుంచించుకుపోయి అథెరోస్క్లెరోసిస్‌ సమస్య తలెత్తుతుంది. దాంతో గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులు ఏర్పడి, సడెన్‌ కార్డియాక్‌ డెత్‌కు దారి తీసే ప్రమాదం ఉంది.


మధుమేహం: శరీరంలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గడం మూలంగా ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ చోటుచేసుకొని మధుమేహం కూడా తలెత్తవచ్చు.


బ్రెయిన్‌ స్ర్టోక్‌: మెదడుకు సరిపడా ఆక్సిజన్‌ అందకపోవడం మూలంగా బ్రెయిన్‌ స్ట్రోక్‌ కూడా రావచ్చు.


అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా సమస్య ఉన్నవాళ్లు సమస్యను వైద్యుల దృష్టికి తీసుకువెళ్లి చికిత్స తీసుకోవాలి. వైద్యుల సూచన మేరకు చక్కటి నిద్రకు తోడ్పడే పరికరాలను ఉపయోగించుకోవాలి.

కృత్రిమ నిద్ర 

నిద్ర పట్టకపోవడానికి 80 రకాల సమస్యలు ఉంటాయి. వాటిలో అసలు కారణాన్ని వైద్యుల సహాయంతో కనిపెట్టి, సరిదిద్దుకోవాలి. అంతే తప్ప కృత్రిమ నిద్ర కోసం నిద్ర మాత్రలనూ, మద్యపానాన్నీ ఆశ్రయించకూడదు. ఇవి రెండూ ఆరోగ్యానికి చేటు చేసేవే! మానసిక సమస్యలతో నిద్ర దూరమైనవారికి (ఇన్‌సోమ్నియా) తాత్కాలిక చికిత్సలో భాగంగా వైద్యులు నిద్ర మాత్రలు సూచిస్తూ ఉంటారు. అంతే తప్ప నిద్రలేమి చికిత్సలో నిద్రమాత్రలకు చోటు ఉండదు. ఈ మాత్రలనే మందుల షాపుల్లో కొనుక్కుని వాడడం మొదలుపెడితే, వాటికి బానిసలుగా మారే ప్రమాదం ఉంటుంది. అదే పనిగా ఈ మాత్రలను వాడడం వల్ల నిద్రలేమి శాశ్వత సమస్యగా మారే అవకాశమూ ఉంటుంది. అంతేకాదు, అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా సమస్య ఉన్నవాళ్లు నిద్రమాత్రలను వాడడం మరింత ప్రమాదకరం. కొందరు నిద్ర కోసం మద్యం మీద ఆధారపడుతూ ఉంటారు. మద్యంతో గాఢనిద్రలోకి జారుకోవడం కష్టమవుతుంది. వారు మత్తుతో నిద్రలోకి జారుకున్నా ఆ స్థితి తాత్కాలికమే! 


నిద్రతో రోగనిరోధకశక్తి 

నిద్రకూ, రోగనిరోధకశక్తికీ సంబంధం ఉందని పలు అధ్యయనాల్లో రుజువైంది. కరోనా సమయంలో వెలువడే భయానక వార్తలు, భవిష్యత్తు గురించిన భయాలు, ఆందోళనలతో నిద్రలేమి సమస్యకు గురయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. నిద్రలేమితో రోగనిరోధకవ్యవస్థ సన్నగిల్లితే కరోనా బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి సరిపడా నిద్రకు దోహదపడే చిట్కాలు, జాగ్రత్తలు అనుసరించాలి. 

చక్కటి నిద్ర కోసం

రాత్రి నిద్ర పట్టకపోతే పగటి నిద్రతో సరిపెట్టవచ్చు అనుకుంటాం. వరుసగా రోజుల తరబడి నిద్రలేమి వేధిస్తున్నా ఆ విషయానికి ప్రాధాన్యం ఇవ్వం. కానీ నిద్రలేమిని ఆరోగ్య సమస్యగానే భావించాలి. చక్కటి నిద్ర కోసం కొన్ని నియమాలు పాటించాలి. 


అవేంటంటే....

టైమ్‌టేబుల్‌: నిద్రకూ వేళలు కచ్చితంగా పాటించాలి. ఏడున్నర నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడానికి తగిన సమయాలను నిర్ణయించుకోవాలి. ఆ వేళలను  అనుసరించాలి.


రాత్రి భోజనం: నిద్రకు రెండు గంటల ముందే రాత్రి భోజనం ముగించాలి.


సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌: ఇవి వెలువరించే నీలం వెలుగు నిద్రకు తోడ్పడే మెలటోనిన్‌ అనే రసాయనం ఉత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి నిద్రకు రెండు గంటల ముందు సెల్‌ఫోన్‌, ల్యాప్‌టా్‌పలకు దూరంగా ఉండాలి.


వ్యాయామం: ఆదమరిచి నిద్ర పట్టాలంటే శరీరం ఎంతో కొంత అలసటకు లోనవ్వాలి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమూ అవసరమే! అయితే సాయంత్రం వ్యాయామం చేసే అలవాటు ఉన్నవాళ్లు నిద్ర సమయానికి రెండు గంటల ముందే ముగించాలి.


అలారం: ఫోన్‌ లేదా, గడియారాల్లో రిపీటెడ్‌ అలారం పెట్టుకోకూడదు. ఎలాంటి అలారం అవసరం లేకుండా ఉదయం ఒకే సమయానికి మెలుకువ వచ్చేలా అలవాటు చేసుకోవాలి.


పడగ్గదిలో ఇవి వద్దు: ఆఫీసు పనులకు, ఇతరత్రా ఇండోర్‌ గేమ్స్‌కూ బెడ్‌రూమ్‌ ఉపయోగించకూడదు. బెడ్‌రూమ్‌లో టివి ఉండకూడదు. నిద్రకు గంట ముందు బెడ్‌రూమ్‌లో బెడ్‌లైట్‌ ఆన్‌ చేసి పెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే, బెడ్‌రూమ్‌ నిద్ర కోసమే అనే జ్ఞాపకం మెదడులో నిక్షిప్తమవుతుంది. దాంతో బెడ్‌రూమ్‌లోకి అడుగు పెట్టిన వెంటనే నిద్ర పడుతుంది.

డాక్టర్‌ విశ్వేశ్వరన్‌ బాలసుబ్రమణియన్‌

సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మొనాలజిస్ట్‌ అండ్‌ స్లీప్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌, 

యశోద హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.


Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...