ఇమ్యూనిటీ కోసం..!

ABN , First Publish Date - 2020-07-11T06:09:44+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా డైట్‌ విషయంలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. పెసరపప్పు ఇడ్లీ, సెనగ - పాలకూర సలాడ్‌, బెల్లం లడ్డూ, టొమాటో మిరియాల సూప్‌ వంటి ప్రత్యేక రెసిపీలు తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. మరి మీరూ ట్రై చేయండి.

ఇమ్యూనిటీ కోసం..!

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా డైట్‌ విషయంలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. పెసరపప్పు ఇడ్లీ, సెనగ - పాలకూర సలాడ్‌, బెల్లం లడ్డూ, టొమాటో మిరియాల సూప్‌ వంటి ప్రత్యేక రెసిపీలు తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. మరి మీరూ ట్రై చేయండి.


పెసరపప్పు ఇడ్లీ

కావలసినవి

పెసరపప్పు - ఒక కప్పు, పెరుగు - పావు కప్పు, నూనె - కొద్దిగా, ఆవాలు - అర టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, అల్లం ముక్క - కొద్దిగా, కరివేపాకు - రెండు రెమ్మలు, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, క్యారెట్‌ - ఒకటి, ఇంగువ - చిటికెడు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, బేకింగ్‌ సోడా - కొద్దిగా.

తయారీ

  • ముందుగా పెసరపప్పును రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • తరువాత నీళ్లు తీసేసి మెత్తటి  పేస్టులా చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
  • ఇందులో పెరుగు వేసి కలపాలి. 
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి.
  • తరువాత సెనగపప్పు, మిర్చి, అల్లం ముక్క, కరివేపాకు, జీడిపప్పు వేసి మరికాసేపు వేగనివ్వాలి.
  • ఇప్పుడు క్యారెట్‌ తురుము వేసి ఇంకాసేపు వేగించాలి.
  • ఈ మిశ్రమాన్ని పెసరపప్పు మిశ్రమంలో వేసి కలపాలి.
  • ఇంగువ, కొత్తిమీర, తగినంత ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి అన్నీ బాగా కలిసేలా కలియబెట్టాలి.
  • తరువాత ఇడ్లీ పాత్రలో వేసి కుక్కర్‌లో పావుగంటపాటు చిన్నమంటపై ఉడికించాలి.
  • చట్నీతో లేక సాంబారుతో వీటిని తింటే రుచితో పాటు రోగనిరోధక శక్తిని కూడా అందిస్తాయి. 

డిటాక్స్‌ వాటర్‌

కావలసినవి

నారింజ పండు - ఒకటి, నిమ్మకాయ - ఒకటి, పైనాపిల్‌ ముక్కలు - కొన్ని, కీర ముక్కలు - కొన్ని, అల్లం ముక్క - కొద్దిగా, పుదీనా ఆకులు - రెండు టేబుల్‌స్పూన్లు.


తయారీ

  • నారింజ పండు పొట్టు తీసి ముక్కలు చేసుకోవాలి. నిమ్మకాయ కట్‌ చేయాలి. 
  • ఒక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో నారింజ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, పైనాపిల్‌, కీర, అల్లం ముక్క వేసి అరగంట పాటు పక్కన పెట్టాలి.
  • తరువాత పదార్థాలన్నీ తీసివేసి కావాలనుకుంటే ఐస్‌ వేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


శొంఠి లడ్డూ

కావలసినవి

నెయ్యి - మూడు టేబుల్‌స్పూన్‌, బెల్లం - పావు కప్పు, పసుపు - అర టేబుల్‌స్పూన్‌, శొంఠి పొడి - అర టేబుల్‌స్పూన్‌, దాల్చినచెక్క పొడి - అర టీస్పూన్‌.


తయారీ

  • స్టవ్‌పై పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. మంట చిన్నగా పెట్టుకోవాలి.
  • తరువాత బెల్లం వేసి కలుపుకోవాలి. రెండు బాగా కలిసి చిక్కటి మిశ్రమంలా తయారయ్యేలా కలుపుకోవాలి.
  • ఒక పాత్రలో పసుపు, శొంఠి పొడి, దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు బెల్లం మిశ్రమంలో వేసి కలియబెట్టాలి. 
  • మిశ్రమం కాస్త చల్లారిన తరువాత చిన్న చిన్న లడ్డూలుగా చేయాలి. 
  • ఇవి నిల్వ ఉంటాయి. పిల్లలు సైతం ఇష్టంగా తింటారు.


సెనగలు - పాలకూర సలాడ్‌

కావలసినవి

సెనగలు - రెండు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, పాలకూర(లేతవి) - నాలుగు కట్టలు, పుదీనా - ఒకకట్ట, ఆలివ్‌ ఆయిల్‌ - పావు కప్పు, నిమ్మరసం - మూడు టేబుల్‌స్పూన్లు, జీలకర్రపొడి - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా.


తయారీ

  • సెనగలను ముందుగా ఉడికించుకోవాలి. పాలకూర, పుదీనాను శుభ్రంగా కడిగి కట్‌ చేయాలి.
  • ఒక పాత్రలో సెనగలు, ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి.
  • మరొక పాత్రలో ఆలివ్‌ ఆయిల్‌ వేసి, అందులో నిమ్మరసం, జీలకర్రపొడి, ఉప్పు, మిరియాల పొడి వేసి కలియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని సెనగలపై పోయాలి. లేత పాలకూర ఆకులను జత చేసుకుని తినొచ్చు.


టొమాటో మిరియాల సూప్

కావలసినవి

టొమాటోలు - మూడు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, అల్లం ముక్క - చిన్నది, దాల్చిన చెక్క - చిన్నది, ఉల్లిపాయ - ఒకటి, నూనె - ఒక టీస్పూన్‌, పుదీనా - కొద్దిగా.


తయారీ

  • ఒక పాత్రలో ఒక కప్పు నీళ్లు పోసి అందులో టొమాటోలు, అల్లం, దాల్చినచెక్క, మిరియాల పొడి వేసి మరిగించాలి.
  • మిశ్రమం చల్లారిన తరువాత టొమాటోలను గుజ్జుగా చేయాలి. 
  • పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు వేసి వేగించాలి.
  • తరువాత టొమాటో మిశ్రమం వేయాలి. తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. 
  • చిన్న మంటపై ఉడికించాలి. మిరియాల పొడి చల్లుకుని, పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-07-11T06:09:44+05:30 IST