ఇమ్యూనిటీ పచ్చళ్ళు
ABN , First Publish Date - 2020-09-05T04:42:11+05:30 IST
ఈ సమయంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
ఈ సమయంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. రకరకాల కూరగాయల్లోనే కాదు, పప్పు దినుసులతోనూ, వాటితో చేసే పచ్చళ్లతోనూ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. పప్పుల పొడి, కూర పొడి, కరివేపాకు పచ్చడి, నువ్వుల పచ్చడి, అల్లం పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఆ కోవకు చెందినవే. ఇంకెందుకాలస్యం.. ఈ వారం మీరూ ట్రై చేయండి.
అల్లం పచ్చడి
కావలసినవి
అల్లం - పావుకేజీ, ఆవాలు - ఒక టీస్పూన్, మెంతులు - పది గింజలు, మినప్పప్పు - ఒక టీస్పూన్, బెల్లం - కొద్దిగా, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, చింతపండు - నిమ్మకాయంత, ఎండుమిర్చి - ఎనిమిది, జీలకర్ర - కొద్దిగా, ఉప్పు - తగినంత, పసుపు - కొద్దిగా, ఇంగువ - కొద్దిగా.
తయారీ విధానం
ముందుగా స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేగించాలి.
అల్లం శుభ్రంగా కడిగి పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చసుకోవాలి.
చింతపండును నీళ్లలో నానబెట్టాలి.
ఇప్పుడు పోపు, అల్లం ముక్కలు, బెల్లం, పసుపు, ఉప్పు, నానబెట్టిన చింతపండు... అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే అల్లం చట్నీ రెడీ.
వంద గ్రాముల అల్లంలో...
క్యాలరీలు - 335
ఫ్యాట్ - 4.2 గ్రా
సాచురేటెడ్ ఫ్యాట్ - 2.6గ్రా
సోడియం - 27 ఎంజి
కార్బోహైడ్రేట్లు - 72 గ్రా
డైటరీ ఫైబర్ - 14 గ్రా
ప్రొటీన్ - 9 గ్రా
ఇంకా క్యాల్షియం, ఐరన్, పొటాషియం మైక్రోగ్రాముల్లో లభిస్తాయి.
అల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అల్లం జీర్ణసమస్యలను దూరం చేస్తుంది. జలుబు, ఫ్లూ లక్షణాలను తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తిని అందిస్తుంది.
నువ్వుల పచ్చడి
కావలసినవి
నువ్వులు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - ఆరు, ధనియాలు - అరస్పూన్, మెంతులు - ఆరు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, చింతపండు - నిమ్మకాయంత, బెల్లం - కొద్దిగా, నూనె - రెండు టీస్పూన్లు, ఆవాలు - అరస్పూన్, ఎండుమిర్చి - ఒకటి.
తయారీ విధానం
ముందుగా నువ్వులు దోరగా వేగించాలి. ధనియాలు, మెంతులు వేగించుకోవాలి.
చింతపండును నీళ్లలో నానబెట్టాలి.
నువ్వులను పొడి చేసుకోవాలి.
తరువాత ధనియాలు, మెంతులు వేసి పొడి చేయాలి.
నానబెట్టిన చింతపండు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ గ్రైండ్ చేయాలి.
ఇప్పుడు స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు వేయాలి.
తియ్యగా ఉండాలని కోరుకునే వాళ్లు బెల్లం కలపవచ్చు.
వందగ్రాముల నువ్వుల్లో...
క్యాలరీలు - 573
కార్బోహైడ్రేట్లు - 23 గ్రా
డైటరీ ఫైబర్ - 12 గ్రా
ప్రొటీన్ - 18 గ్రా
ఇంకా విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, పొటాషియం మైక్రోగ్రాముల్లో లభిస్తాయి.
నువ్వులు తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి. శ్వాస సమస్యలు దూరమవుతాయి. గుండెకు చాలా మేలు జరుగుతుంది. ఇవి ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడతాయి.
కరివేపాకు పచ్చడి
కావలసినవి
కరివేపాకు కట్టలు - ఐదు (చిన్నవి), ఎండుమిర్చి - పది, చింతపండు - నిమ్మకాయంత, పసుప్పు - అర టీస్పూన్, ధనియాలు అర టీస్పూన్, నువ్వులు - ఒక టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - రెండు చిటికెడులు, నూనె - రెండు టీస్పూన్లు, శనగపప్పు - అర స్పూన్, మినప్పప్పు - అర స్పూన్, ఆవాలు - అర స్పూన్, జీలకర్ర - అర స్పూన్.
తయారీ విధానం
ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టుకోవాలి.
నువ్వుపప్పు దోరగా వేగించాలి.
స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక శెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.
ఆ పోపును ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
అదే బాణలిలో ఎండుమిర్చి వేసి వేగించాలి. కాసేపయ్యాక కరివేపాకు వేయాలి. చింతపండు వేసి స్టవ్‌పై నుంచి దింపాలి.
చల్లారాక అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు కలిపి పచ్చడి తయారీ చేసుకోవాలి.
కరివేపాకులో...
క్యాలరీలు - 108
కార్బోహైడ్రేట్లు - 18
ఫైబర్ - 6.4 గ్రా
ప్రొటీన్ - 6 గ్రా
ఇంకా క్యాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, సి-విటమిన్, కాపర్, మెగ్నీషియంలు మైక్రోగ్రాముల్లో లభిస్తాయి.
కంటిచూపును కాపాడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలం. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
కూర పొడి (మిక్స్‌డ్ పల్స్)
కావలసినవి
ఎండుమిర్చి - ఐదు, జీలకర్ర - ఒక స్పూన్, ఇంగువ - చిటికెడు, మిరియాలు - రెండు, లవంగం - ఒకటి, ఎండుకొబ్బరి - రెండు స్పూన్లు, శనగపప్పు - ఒక కప్పు, మినప్పప్పు - అర కప్పు, నువ్వుపప్పు - అర కప్పు, నూనె - ఒక స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, పల్లీలు - అరకప్పు, ధనియాలు - ఒక స్పూన్, జీడిపప్పు - ఐదారు పలుకులు.
తయారీ విధానం
స్టవ్ మీద బాణలి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక ఎండుమిర్చి, ఇంగువ, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, లవంగం వేసి వేగించాలి.
తరువాత నువ్వుపప్పు, జీడిపప్పు వేసి వేగించాలి. పప్పు దినుసులు కూడా వేసి వేగించాలి.
ఇప్పుడు అన్నీ కలిసేలా కలిపి తగినంత ఉప్పు వేసి, ఎండు కొబ్బరి కలపాలి.
ఈ పొడి గుత్తి వంకాయ, సొరకాయ, బీర, బెండకాయ కూరల్లో వాడొచ్చు. ఈ పొడి వల్ల కూర మరింత రుచిగా ఉంటుంది.
కొత్తిమీర పచ్చడి
కావలసినవి
కొత్తిమీర కట్ట - ఒకటి(పెద్దది), పచ్చిమిర్చి - ఎనిమిది, ఎండుమిర్చి - ఒకటి, నూనె - మూడు టీస్పూన్లు, ఆవాలు - అర స్పూన్, జీలకర్ర - అర స్పూన్, శనగపప్పు - కొద్దిగా, మినప్పప్పు - కొద్దిగా, మెంతులు - ఆరు, ఇంగువ - కొద్దిగా, చింతపండు - నిమ్మకాయంత, బెల్లం - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - కొంచెం.
తయారీ విధానం
కొత్తిమీరను సన్నగా తరిగి బాగా కడిగి ఆర బెట్టుకోవాలి.
స్టవ్‌పై బాణలిపెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఇంగువ వేసి వేగించాలి.
తరువాత ఎండుమిర్చి వేసుకోవాలి. చివరన పచ్చిమిర్చి వేసి కలపాలి.
ఇప్పుడు కొత్తిమీర వేసి కాసేపు వేగించి దింపాలి.
చింతపండు పోయాలి. చల్లారాక బెల్లం, పసుపు, ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసే సమయంలో నీళ్లు పోయకూడదు. పోపు నూనెతోనే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.
వంద గ్రాముల కొత్తిమీరలో..
క్యాలరీలు - 23
కార్బోహైడ్రేట్లు - 3.7 గ్రా
డైటరీ ఫైబర్ - 2.8 గ్రా
ప్రొటీన్ - 2.1 గ్రా
ఇంకా క్యాల్షియం, ఐరన్, పొటాషియం మైక్రోగ్రాముల్లో లభిస్తాయి.
రోగనిరోధకశక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు కొత్తిమీరలో పుష్కలం. షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తినిస్తుంది. గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది.
పప్పుల పొడి
కావలసినవి
పల్లీలు - ఒక కప్పు, పుట్నాలు - అరకప్పు, నువ్వులు - అరకప్పు, ఎండుమిర్చి - నాలుగైదు, జీలకర్ర - అర స్పూన్, మెంతులు - ఐదు లేదా ఆరు, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - చిటికెడు, నూనె - అర స్పూన్.
తయారీ విధానం
ముందుగా స్టవ్‌పై బాణలి పెట్టుకుని ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, మెంతులు వేసి దోరగా వేగించుకుని పక్కన పెట్టుకోవాలి.
పల్లీలు, పుట్నాలు, నువ్వుపప్పు వేర్వేరుగా వేగించుకోవాలి.
ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, ఇంగువ కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
తరువాత పల్లీలు, పుట్నాలు, నువ్వులు పొడి చేసుకోవాలి. చివరగా రుచికి తగినంత ఉప్పు కలపాలి.
ఈ పొడిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే రుచిగా ఉంటుంది.
వంద గ్రాముల వేరుశనగల్లో...
క్యాలరీలు - 567
ప్రొటీన్ - 25.8 గ్రా
కార్బోహైడ్రేట్లు - 16.1 గ్రా
ఫైబర్ - 8.5 గ్రా
ఫ్యాట్ - 49.2గ్రా
మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు వేరుశనగలు సహాయపడతాయి. తద్వారా మలబద్ధకం దరిచేరదు. గుండె సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి.
పంపినవారు
మోహిని ఆచార్య
హైదరాబాద్
ఫోన్ 9515088279