ఇమ్యూనిటీ బూస్టర్లు ఇవి!

ABN , First Publish Date - 2020-07-02T05:12:25+05:30 IST

ఇది వర్షాకాలం. వైరల్‌ జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు దాడి చేసే కాలం. వీటి బారిన పడకూడదంటే మన శరీరంలో బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉండాలి.

ఇమ్యూనిటీ బూస్టర్లు ఇవి!

ఇది వర్షాకాలం. వైరల్‌ జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు దాడి చేసే కాలం. వీటి బారిన పడకూడదంటే మన శరీరంలో బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉండాలి. ఏ మందులతోనో కాకుండా రోజూ తీసుకొనే ఆహారం ద్వారానే దీన్ని పొందడం ఉత్తమం. బాదంపప్పు, యోగర్ట్‌, పసుపు... ఈ మూడింటినీ మీ మెనూలో చేర్చుకొంటే అవి ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తాయంటున్నారు వైద్య నిపుణులు.

 

బాదంపప్పు: పోషకాల నిలయం 


ఇందులో మెగ్నీషియం, ప్రొటీన్‌, రిబోఫ్లోవిన్‌, జింక్‌ తదితర 15 రకాల పోషకాలుంటాయి. రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠపరచడంలో యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసే ‘ఇ’ విటమిన్‌ వీటికి అదనం. వైరస్‌, బ్యాక్టీరియాలతో వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడడంలో కూడా ‘ఇ’ విటమిన్‌ దోహదపడుతుంది. బాదంపప్పును ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా తినే వీలుంది. మీకు ఇష్టమైన ఫ్లేవర్స్‌తో బాదంపప్పును జత చేసి పౌష్టికంగా, రుచికరంగా శ్నాక్స్‌ తయారు చేసుకోవచ్చు. 


యోగర్ట్‌: ప్రోబయాటిక్స్‌ పుష్కలం 


ప్రోబయాటిక్స్‌ లేదా గుడ్‌ బ్యాక్టీరియా... యోగర్ట్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒంట్లో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అంతేకాదు... ఇందులో విటమిన్‌ ‘డి’ కూడా ఉంటుంది. జలుబు, ఫ్లూల నుంచి రక్షించడంలో ‘డి’ విటమిన్‌ కీలకం. యోగర్ట్‌తో ఫ్రూట్‌ స్మూతీస్‌ చేసుకోవచ్చు. లేదంటే పండ్ల ముక్కలు, జీడిపప్పు, బాదంపప్పు వంటివి ఓ కప్పు యోగర్ట్‌లో వేసుకొని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఒకవేళ కడుపు ఉబ్బరంగా అనిపించి, మంటగా ఉన్నా పెరుగు తీసుకొంటే ఉపశమనం కలుగుతుంది. ఇది వంటింటి చిట్కా. 


పసుపు: రోగ నిరోధకం 

భారత్‌లో లభించే అత్యంత శక్తిమంతమైన ఔషధం కాని ఔషధం పసుపు. ఇందులో క్యాల్షియం, ఫైబర్‌, ఐరన్‌, జింక్‌ తదితర 300 రకాల విలువైన పోషకాలుంటాయి. పసుపు రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా పసుపు పనిచేస్తుంది. మన వంటింట్లో ఇది సాధారణ వంట పదార్థమే! అయితే పాలు లేదా నేతిలో మిరియాల పొడితో పాటు పసుపు కూడా వేసుకొని తీసుకొంటే ఈ వైరస్‌ కాలంలో ఎంతో మేలు చేస్తుంది. 

Updated Date - 2020-07-02T05:12:25+05:30 IST