Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

వలస బతుకులు

twitter-iconwatsapp-iconfb-icon

సికింద్రాబాద్ బోయిగూడలోని ఓ స్క్రాప్ గోడౌన్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ౧1మంది కార్మికులు సజీవదహనమైన ఘటన హృదయవిదారకమైనది. వీరంతా బతుకు తెరువుకోసం బిహార్ నుంచి వలసవచ్చినవారు. ప్రమాదం జరిగిన ‘శ్రావణి స్క్రాప్ ట్రేడర్స్’ పదేళ్ళనుంచి నడుస్తున్నదనీ, ఎలాంటి అనుమతులూ లేకుండా ప్లాస్టిక్, గ్లాస్, ఎలక్ట్రికల్ ఇత్యాది వ్యర్థాల గోదామును అక్కడ నిర్వహిస్తున్నారనీ అధికారులు చెబుతున్నారు. మరొకరి గోదామును లీజుకు తీసుకున్నవ్యక్తి దానిని నాలుగుభాగాలుగా చేసి రెండుచోట్ల చెక్క, ఇనుము వర్క్ షాప్ లు కూడా నిర్వహిస్తున్నాడు. మధ్యలో ఉన్న ఇనుపమెట్లమీదనుంచి కార్మికులు పైకివెళ్ళి అక్కడున్న రెండు ఇరుకైన గదుల్లో ఆ రోజు కూడా నిద్రించారు. కింద గోదాములనుంచి మంటలు ఎగిసిపడుతున్నప్పుడు వారు దిగిరావడానికి ఈ ఇనుపమెట్లు ఒక్కటే మార్గం. మంటల ఉధృతిలో సజీవంగా దహనమైపోవడం తప్ప వారికి మరోదారి లేకపోయింది.


వ్యవస్థల పట్ల ఎంతోకొంత విశ్వాసం ఉన్నవారికి ఇటువంటి దారుణాలు జరిగినప్పుడు ఆ కాస్త నమ్మకం కూడా సడలిపోయే రీతిలో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగుచూస్తుంటాయి. దుర్ఘటనలు జరిగినప్పుడల్లా అధికారుల నోటినుంచి అనుమతులు లేవన్నమాట ఎప్పుడూ వినిపించేదే. వారి కళ్ళముందే దశాబ్దాలుగా అనధికారిక కార్యకలాపాలు జరిగిపోతున్నా పట్టదు. ప్రాణాలు పోయినప్పుడు మాత్రం పర్మిషన్లు లేవన్న ఒక్కమాటతో తమ బాధ్యత దులిపేసుకుంటారు. ఆ గోదాము అగ్నికి ఆహుతి అయిపోతుంటే, పైనుంచి దూకిన ఓ కార్మికుడు లోపల అనేకమంది తగలబడిపోతున్నారని చెబితేనే ఆ భయానక ప్రదేశంలో మనుషులున్నారన్న విషయం పోలీసులకు తెలిసింది. మంటలు తగ్గాక లోపలికిపోయి, మృతదేహాలు ఒకదానిమీద ఒకటిపడి బూడిదకుప్పలా మారిన దృశ్యాన్ని చూడటం తప్ప వారూ చేయగలిగేదేమీలేకపోయింది. రాష్ట్రపతి నుంచి స్థానిక రాజకీయనేతలవరకూ అందరూ స్పందించారు, ఖండించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారాన్ని ప్రకటించాయి, మృతదేహాలను వారి స్వరాష్ట్రానికి పంపడమూ జరిగింది.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొత్తపార్లమెంటు భవన నిర్మాణ వేగాన్ని పరిశీలించడానికి ఈ మధ్యన వెళ్ళినప్పుడు, ఆ పనిలో పాలుపంచుకున్నవారి వివరాలను కూడా రికార్డుచేయాలని చెప్పిమరీ వచ్చారట. రాళ్ళెత్తిన వందలాదిమంది కూలీల వివరాలు కూడా అందులో ఉంటాయో లేదో తెలియదు కానీ, ఈ దేశంలో కోట్లాదిమంది వలసకార్మికులకు నిజానికి కావల్సింది కడుపునిండా అన్నం, కాస్తంత బతికే అవకాశం. పాలకుల అలసత్వం, యాజమాన్యాల లాభాపేక్ష వల్ల వేలాదిమంది వలసకార్మికులకు వీటికి కూడా దిక్కులేకపోయింది. అమానవీయమైన వాతావరణంలో, నిరంకుశులైన యాజమానుల చేతుల్లో కార్మికులు నలిగిపోతున్నారు. కార్మికచట్టాలంటే మన పాలకులకు ఎంతో వెగటు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే గౌరవనామంతో వాటిని ఏటా నిర్వీర్యపరుస్తూ, కుదిస్తూ, కలిపేస్తూ ఏవో విన్యాసాలు చేస్తుంటారు. కార్మికులు పనిపరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రమాదాలనుంచి రక్షించగలిగే వ్యవస్థలున్నాయా? యజమాన్యాలు కనీసంగా పాటించాల్సిన ప్రమాణాలను పాటిస్తున్నాయా, రిజిస్టర్లను నిర్వహిస్తున్నాయా వంటివి చూడాల్సిన అధికారులు కూడా పట్టించుకోడం లేదు. ఏటా జరపాల్సిన తనిఖీలు నిఘాల సంఖ్యను ప్రభుత్వాలే కుదించి, మీరు అటుగా పోనవసరం లేదని అధికారులకు చెప్పి, యాజమాన్యాలే ఆన్ లైన్ లో అన్నీ రాసేసుకోగలిగే వాతావరణం ఇప్పుడుంది. 


కరోనా కష్టకాలంలో వేలాదిమంది వలస కార్మికుల కాళ్ళు పచ్చిపుండైన దృశ్యాన్ని చూసి దేశం చలించిపోయింది. అలసిసొలసి రైల్వేట్రాకుల మీద నిద్రపోయిన వారు శాశ్వత నిద్రలోకి జారుకున్న ఘటనలూ కలచివేశాయి. దేశంలో ఎంతమంది వలసకార్మికులున్నదీ కేంద్రానికి తెలియదు, ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది వచ్చిందీ, వారి బతుకులు ఎలా ఉన్నదీ రాష్ట్రాలకూ పట్టదు. పనివెతుక్కుంటూ వచ్చినవారు తిరిగి ప్రాణాలతో ఇళ్ళకు వెడతారన్న నమ్మకం లేదు. వలసకార్మికులంటే ఏ దిక్కూలేనివారు, రికార్డులకు ఎక్కనివారు, గొడ్డుచాకిరీ చేసేవారు కనుక పరిశ్రమలు, భవననిర్మాణం సహా చాలా చోట్ల మూడువంతులమంది వారే. వలసకార్మికుల పట్ల ఏమిటీ నిర్లక్ష్యం అంటూ న్యాయస్థానాలు దుమ్ముదులిపిసినప్పుడు కేంద్రం ఎన్నో హామీలు ఇచ్చినా ఆచరణకు నోచుకోలేదు. అంతర్ రాష్ట్ర వలసకార్మికుల చట్టాన్ని పునరుద్ధరించి, పటిష్టపరచి, ప్రతీ రాష్ట్రమూ దానికి లోబడి వలసకార్మికుడికి మేలుచేకూరిస్తే తప్ప వారి పరిస్థితులు మారవు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.