Abn logo
Oct 23 2021 @ 00:51AM

ముంచేశారు సారూ..!

  1. పత్తి రైతులకు నాసిరకం విత్తు
  2. వేలాది ఎకరాల్లో నిలిచిన ఎదుగుదల
  3. ఎకరానికి మూడు క్వింటాళ్ల దిగుబడీ కష్టమే
  4. మంచి ధర ఉన్న సమయంలో తీవ్ర నష్టం
  5. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గూడూరు రైతులు
  6. కాలం చెల్లిన, నాసిరకం అడ్డాగా కర్నూలు 


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 22:  పత్తి దిగుబడులకు రికార్డు స్థాయిలో ధర లభిస్తోంది. క్వింటం ధర దాదాపు రూ.9 వేలను తాకుతోంది. కనిష్ఠ ధర కూడా రూ.5,500 పైగానే ఉంది. ఇలాంటి సమయంలో మంచి దిగుబడి సాధిస్తే తమ కష్టాలు తీరుతాయని రైతులు అనుకున్నారు. పత్తి సాగు చేసిన రైతులందరూ ఈ ధరలను చూసి, ఇక అప్పులన్నీ తీరుతాయని ఊహల్లో తేలియాడారు. కానీ కాలం చెల్లిన పత్తి విత్తనాలు కొనుగోలు చేశామని, నాసిరకం విత్తనాలు తమ కొంప ముంచుతాయని ఊహించలేకపోయారు. మొక్కలు ఎదగడం లేదు. నాలుగైదు కాయలు కూడా కనిపించడం లేదు. దీంతో కలెక్టర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఇదంతా వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి ఫలితమే అని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.


గూడూరు మండలం మల్లాపురం గ్రామానికి చెందిన ఈ రైతు పేరు కాశీం. వ్యవసాయమే జీవనాధారం. ఈ ఖరీఫ్‌లో తనకున్న నాలుగెకరాల పొలంలో పత్తి సాగు చేశాడు. ఓ కావేరి కంపెనీ పత్తి విత్తనాలను ప్యాకెట్‌ రూ.730 ప్రకారం 15 ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. మార్కెట్‌లో పత్తికి బ్రహ్మాండమైన ధర లభిస్తోంది. దీంతో రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ రూ.10,950 చెల్లించి తాను కొన్నది కాలం చెల్లిన, నాసిరకం విత్తనాలు అని తరువాత గుర్తించాడు. పంట ఎదుగుదల లేదు. చెట్టుకు ఐదారు పిందెలు కూడా రాలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఎకరాకు 10 క్వింటాళ్ల పత్తి వస్తుందని ఆశించాడు. కానీ 3 నుంచి 4 క్వింటాళ్లకు మించి దిగుబడి రాదని ఆవేదన వ్యక్తం చేశాడు. గూడూరు మండలంలో వందలాది మంది రైతులు కర్నూలు నగరంలోని కామధేను ట్రేడర్స్‌ విత్తన దుకాణం, గూడూరులోని మరి కొన్ని దుకాణాల్లో కంపెనీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసి మోసపోయారు. ఈ రైతులంతా తమకు న్యాయం చేయాలని, కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని పది రోజుల క్రితం స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన్‌ తదితర నియోజకవర్గాల్లో పత్తి పంటను సాగు చేసిన రైతులంతా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పత్తి పంటను కర్నూలు జిల్లాలోనే సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో జిల్లా అంతటా రెండున్నర లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగైంది. నాసిరకం, కాలం చెల్లిన పత్తి విత్తనాలతో రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 


ఏటా ఇదే పరిస్థితి..


జిల్లాలో రెండున్నర లక్షల హెక్టార్లలో రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారు. హెక్టారుకు రూ.75 వేల నుంచి రూ.80 వేల దాకా పెట్టుబడి ఖర్చు అవుతోంది. రైతు అవసరాలను అనుకూలంగా మార్చుకుని పత్తి విత్తన వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నాసిరకం విత్తనాలతో పాటు కాలం చెల్లిన పత్తి విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. కర్నూలు నగరం నాసిరకం పత్తి విత్తనాలకు అడ్డాగా మారింది. కొంత మంది ప్రాసిసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకుని పత్తిని వేరు చేసి నాసిరకం విత్తనాలను, కాలం చెల్లిన విత్తనాలను అందమైన ప్యాకెట్లలో నింపి గ్రామాల్లో దళారులను నియమించుకుని రైతులకు అంటగడుతున్నారు. అధికారులు వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో పాత గిడ్డంగులను, భవనాలను అద్దెకు తీసుకుని దందా నడుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడుల్లో నాసిరకం, కాలం చెల్లిన పత్తి విత్తనాల నిల్వలు బయట పడుతున్నాయి. కర్నూలు నగరం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, కర్నూలు, పాణ్యం తదితర ప్రాంతాల్లో ఇవి పట్టుబడ్డాయి. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం పట్టనట్లు ఉండిపోతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


వర్షాభావంతో దెబ్బ


పూత, కాయ వచ్చే సమయంలో నీటి తడి అవసరం. ఆగస్టు నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పత్తి పంట పూర్తిగా దెబ్బతింటోంది. చాలా నియోజకవర్గాల్లో పత్తి పంట ఎండిపోతోంది. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో పర్యటించి పురుగు, బెట్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 


గులాబి పురుగు గుబులు


పత్తి పంట విత్తిన తర్వాత 50 రోజులకు మొగ్గ దశ మొదలవుతుంది. ప్రస్తుతం జిల్లాలో ఈ పంట 90 రోజులకు చేరింది. కాయ దశలో ఉంది. మొగ్గ దశ నుంచే పురుగు ఆశించడం మొదలై.. కాయ దశలో మరింత ఎక్కువైంది. కొన్ని రోజులుగా మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పత్తి పంటను గులాబి రంగు పురుగు ఆశించింది. ఈ పురుగు కలిగించే నష్టాన్ని అంచనా వేయడం కష్టమే. గొంగళి పురుగు గుడ్డు నుంచి వెలువడిన వెంటనే పూత, కాయ, లోపలి భాగాల్లోకి చొచ్చుకెళ్లి నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పురుగు వ్యాపించిన పూలు విచ్చుకోకుండా గుడ్డి పూలుగా మారుతాయి. గొంగళి పురుగు దశను పూర్తిగా కాయలోనే గడుపుతుంది. తద్వారా కాయలు పక్వానికి రాకముందే పగిలిపోతాయి. దీంతో దూది నాణ్యత, పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


విచారిస్తున్నాం.. 


గూడూరు మండలంలో కావేరి కంపెనీ పత్తి విత్తనాలను వాడిన రైతులు పంట దిగుబడి రాలేదని, తమకు డీలర్లు నాసిరకం విత్తనాలను అంటగట్టారని స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ మండలంలో శాస్త్రవేత్తల చేత పరీక్షలు నిర్వహించాము. నమూనాలు తీసి ప్రయోగశాలకు పంపించాము. ఫలితాల్లో నాసిరకం అని తేలితే డీలర్లపై, కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడి తగ్గితే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. 


- వరలక్ష్మి, జేడీఏ


కఠిన చర్యలు తీసుకోవాలి..


నాసిరకం, కాలం చెల్లిన విత్తనాల తయారీకి కర్నూలు అడ్డాగా మారింది. వ్యవసాయ శాఖ అధికారులు వీటికి అడ్డుకట్ట వేయడం లేదు. జిల్లా కేంద్రంలోనే నాసిరకం విత్తనాల విక్రయాలు జోరుగా జరుగుతున్నా పట్టించుకునే వారే లేరు. గూడూరు మండలంలో నాసిరకం పత్తి విత్తనాలు, మరి కొన్ని నియోజకవర్గాల్లో మొక్కజొన్న, మిరప తదితర నాసిరకం విత్తనాలను వాడి రైతులు నష్టపోయారు. వ్యవసాయ శాఖ అధికారులకు విత్తన కంపెనీల యాజమాన్యాలు, డీలర్ల నుంచి భారీగా మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులపై ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. విజిలెన్స్‌ అధికారులు అడపా దడపా తనిఖీలు చేపట్టినా నాసిరకం విత్తనాల వాడకం జిల్లాలో తగ్గడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. కంపెనీ యజమానులు, డీలర్లతో సంబంధాలు ఉన్న వ్యవసాయశాఖ అధికారులను బదిలీ చేస్తే తప్ప రైతులకు న్యాయం జరగదు. 

 - రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి


విత్తన లోపమే కారణం.. 


  1. నివేదికలో పేర్కొన్నశాస్త్రవేత్తలు 


పత్తి పైరుకు పూత రాలిపోవడం, ఏడెనిమిది కాయలు మాత్రమే రావడంతో తమకు నాసిరకం విత్తనాలను అంటగట్టారంటూ గూడూరు మండలంలోని పలు గ్రామాల రైతులు పది రోజుల క్రితం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రకాష్‌ రెడ్డి, మంజునాథ్‌, చైతన్యతో పాటు కంపెనీ ప్రతినిధులు వారం క్రితం పత్తి పంటను పరిశీలించారు. శాంపుల్స్‌ తీసుకుని పరీక్షలు నిర్వహించారు. విత్తన లోపం కారణంగానే పైరు ఎదుగుదల లేక దిగుబడి తగ్గిపోయిందని వారు తేల్చారు. ఈ నివేదిక మూడు రోజు ల క్రితమే జేడీఏకి అందజేశారు. దీనిపై కర్నూలు ఏడీఏ శాలురెడ్డిని ఆరా తీస్తే.. శాస్త్రవేత్తలు పొలాలను పరిశీలించి పూలు రాలిపోవడం, కాయలు కూడా తగినంతగా రాకపోవడాన్ని గమనించారన్నారు. శాస్త్రవే త్తల నివేదికను మండల వ్యవసాయాధికారికి అందించామన్నారు. పత్తి విత్తన లోపం కారణంగానే దిగుబడి తగినంతగా రాలేదనే విషయం తేలిందని వ్యవసాయ అధికార వర్గాలు పేర్కొన్నాయి.