ముంచేసిoది

ABN , First Publish Date - 2020-11-28T08:08:28+05:30 IST

నివర్‌ తుఫాన్‌ రైతన్నను అతలాకుతలం చేసింది. అంచనాలకు అందని నష్టాన్ని మిగిల్చింది. వరుసగా రెండోరోజు కూడా భారీవర్షాలు కొనసాగడంతో పంట చేలన్నీ నీట మునిగాయి. చేతికొచ్చిన ధాన్యం ఇల్లు చేరకుండానే వర్షార్పణం అయింది.

ముంచేసిoది

వెన్ను విరిచిన నివర్‌

లక్షల ఎకరాల్లో పంట నష్టం.. వాన నీటిలో నానుతున్న పంట చేలు

వరుసగా రెండో రోజూ కుండపోత.. వరి కంకుల నుంచి మొలకలు..

తెగిన పింఛా ప్రాజెక్టు మట్టి ఆనకట్ట.. నెల్లూరులో పెన్నా ఉగ్ర రూపం

తీరప్రాంత మండలాల్లో రెడ్‌ అలర్ట్‌.. ఉప్పాడలో అల్లకల్లోలంగా సముద్రం..

కాకినాడలో ఎగుమతులకు బ్రేక్‌.. చిత్తూరులో ఐదుగురు మృతి


నివర్‌తో వచ్చిన ముప్పు ఇంకా తప్పనే లేదు! అంతలోనే మరో ‘తుఫాను’ హెచ్చరిక! పంటలు దెబ్బతిని నిలువెల్లా మునిగిన అన్నదాతలపై మరో పిడుగు! ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది... వాయుగుండంగా, ఆ తర్వాత  తుఫానుగా మారే అవకాశముందని తెలిపింది. నివర్‌ తుఫాను ప్రభావంతో ఒకటిరెండు జిల్లాలు మినహా రాష్ట్రమంతా తడిసి ముద్దయింది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులూ వంకలు పొంగిపొర్లాయి. చెరువుల కట్టలు తెగాయి. పలుచోట్ల రోడ్లు అడ్డంగా కోతకు గురయ్యాయి. నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఆగిపోయాయి. అనేక ఏళ్ల తర్వాత పెన్నా నది పరవళ్లు తొక్కింది. సోమశిల ప్రాజెక్టు నుంచి 3.69 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలో అనేకచోట్ల విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయి. కడప జిల్లాలో పింఛా ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. వరదనీరు పోటెత్తింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వేలాది ఎకరాల్లో కోతలకు సిద్ధంగా ఉన్న వరి నేలరాలింది. రోజుల తరబడి నీళ్లలో నానడంతో పొలాల్లోనే ధాన్యం మొలకెత్తుతోంది. అధికారిక అంచనా ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా 2.18 లక్షల హెక్టార్లలో పంటనష్టం జరిగింది. క్షేత్రస్థాయిలో దీనికి అనేక రెట్లలోనే పంట నష్టపోయినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో పంటనష్టంతోపాటు ప్రాణ నష్టమూ సంభవించింది.  జిల్లాలో ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. నివర్‌ బలహీనపడి అల్పపీడనంగా మారి కర్ణాటకవైపు వెళుతుందని భావించినా...  


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): నివర్‌ తుఫాన్‌ రైతన్నను అతలాకుతలం చేసింది. అంచనాలకు అందని నష్టాన్ని మిగిల్చింది. వరుసగా రెండోరోజు కూడా భారీవర్షాలు కొనసాగడంతో పంట చేలన్నీ నీట మునిగాయి. చేతికొచ్చిన ధాన్యం ఇల్లు చేరకుండానే వర్షార్పణం అయింది. లక్షలాది హెక్టార్లలో పంట నష్టపోవడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం భీమవరం అంబేడ్కర్‌ కాలనీకి చెందిన రాజోలు పెదయోగయ్య (35) నీట మునిగిన పంట పొలాన్ని చూసి గుండె పోటుతో చనిపోయాడు. నివర్‌ ప్రభావంతో తిరుమల, పరిసర ప్రాంతాల్లో దాదాపు 300 భారీ వృక్షాలు వేర్లతో సహా కుప్పకూలాయి. బుధ, గురువారాల్లో వర్షంతో పాటు భారీగా ఈదురుగాలులు వీచిన క్రమంలో తిరుమలతోపాటు చుట్టుపక్కల ఉండే శ్రీవారిపాదాలు, ధర్మగిరి, శిలాతోరణం, పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, వేణుగోపాల స్వామి ఆలయం, రెండు ఘాట్‌రోడ్లలో భారీ వృక్షాలు కూలాయి. ‘తుఫాన్‌ కారణంగా పంటలు తెబ్బతిన్న రైతులకు పరిహారాన్ని నెలలోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. ఊహించిన దానికంటే పంట నష్టం ఎక్కువగా ఉంది.


  రాష్ట్రంలో తుఫాను కారణంగా 2.18 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా. వీటిలో ఎక్కువగా వరికే పెద్ద నష్టం’’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ హనుమంత్‌ అరుణ్‌ కుమార్‌ చెప్పారు. శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని హాఫ్‌పేట, ఖాజీపేట గ్రామాల పరిధిలో తుఫానుకు దెబ్బతిన్న వరి, మినుము పొలాలను పరిశీలించారు. వర్షాలు తగ్గిన వెంటనే నష్టం అంచనాలు మొదలు పెడతామని, వీటిని 15 రోజుల్లో పూర్తిచేసి, మరో 15 రోజుల్లో రైతు ఖాతాకు ఆ మొత్తాన్ని జమ చేస్తామని వివరించారు. ఎకరాలో 33 శాతంపైగా పంట దెబ్బతిని ఉంటేనే నష్టం జరిగినట్టుగా లెక్కలోకి తీసుకుంటామని, ఆ రైతుల పేర్లను మాత్రమే నమోదు చేస్తామని పేర్కొన్నారు. 


  గుంటూరు జిల్లాలోని సుమారు 30-35 మండలాల్లో 4లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన వరిపంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. డెల్టాలో కోతకొచ్చిన మినుము, వరిపొలాలు నీటిలో మునిగాయి. పడిపోయిన వరికంకుల నుంచి మొలకలొస్తున్నాయి. ఎంపీ మోపిదేవి వెంకట రమణ, వ్యవసాయ కమిషనర్‌ సిహెచ్‌. అరుణ్‌కుమార్‌, గుంటూరు ఏజీ దినేశ్‌ శుక్రవారం డెల్టాలో పర్యటించారు. 


  తూర్పుగోదావరిలోని 1.43 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అనేకచోట్ల వరి పంట కోసి మడుల్లో పనలు ఉంచారు. వర్షాలతో ఇవన్నీ మునిగిపోయి కుళ్లిపోయాయి. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారం పెట్టుబడి నష్టం ఎకరాకు రూ.24వేల చొప్పున రూ.343కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. వర్షాల కారణంగా కాకినాడ పోర్టు నుంచి రెండోరోజు కూడా బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. విశాఖకు చెందిన ఫిషింగ్‌ బోటు కాకినాడ తీరంలో బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు ప్రాణాలు కాపాడుకున్నారు. 



  ప్రకాశం జిల్లాలోని 35 మండలాల్లో 98,805 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. దాదాపు లక్ష హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పంటలు ప్రస్తుతం నీళ్లలో ఉన్నాయి. మత్య్సకారుల వలలు, పడవలు దెబ్బతిన్నాయి. నాగులుప్పలపాడు మండలం కనపర్తి పల్లెపాలెంలో సైకం పోలయ్య(60) అనే వృద్ధుడు గుడిసె కూలి మృతిచెందాడు. 


 కృష్ణాజిల్లాలో రెండు రోజులపాటు కురిసిన భారీవర్షాలకు 94,116 హెక్టార్లలో వరి, వేరుశెనగ, మినుము, పత్తి పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం ప్రభుత్వానికి ప్రాఽథమిక నివేదిక పంపారు. 


 కడప జిల్లాలో 72,755 హెక్టార్లలో వివిధ పంటలు నీటిపాలయ్యాయి. అధికారిక అంచనాల ప్రకారం రూ.82.05 కోట్లు నష్టం వాటిల్లింది. అత్యధికంగా వరి 15,951 హెక్టార్లలో నీటిపాలైంది. 


 పశ్చిమగోదావరి జిల్లాలో 21,234 హెక్టార్లలో వరి, పత్తి, మినుము పంటలు నీట మునిగాయి. ఇందులో ప్రధానంగా వరి పంట 20,058 హెక్టార్లలో ముంపునకు గురైంది. పనల మీద ఉన్న ధాన్యం పనికిరాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. 


 శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, గార, కంచిలి మండలాల్లో 1,400 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 


 నెల్లూరు జిల్లావ్యాప్తంగా నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గూడూరు వద్ద జాతీయ రహదారిపై వంతెన నిర్మాణంలో భాగంగా వేసిన సర్వీసు రోడ్డు నీట మునిగిపోవడంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు జాతీయ రహదారిపై  వేలాది వాహనాలు నిలిచిపోయాయి. గూడూరు నుంచి ఇటు నెల్లూరు వరకు అటు సూళ్లూరుపేట వరకు 40కి.మీ. మేర వాహనాలు ఆగడంతో 18గంటలపాటు ప్రయాణికులు నరకం అనుభవించారు. కావలిసహా 50 గ్రామాలు గత 48 గంటలుగా అంధకారంలో ఉన్నాయి. ఆర్టీసీ 180 సర్వీసులను రద్దు చేసింది.


చిత్తూరు జిల్లావ్యాప్తంగా ప్రాథమిక అంచనాల మేరకు 15వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. గురు, శుక్రవారాల్లో నీటి ప్రవాహాల్లో మొత్తం ఏడుగురు గల్లంతయ్యారు. వారిలో ఐదుగురి మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన ఇద్దరి ఆచూకీ తెలియలేదు. 1,100 ఇళ్లు పూర్తిగానూ, పాక్షికంగానూ ధ్వంసమయ్యాయి. పీలేరు వద్ద పింఛా నదిలో మూడిళ్లు కొట్టుకుపోయాయి. సదుం మండల కేంద్రంలో గార్గేయ నది ఉధృతికి 1934లో బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్మించిన చారిత్రక బ్రిడ్జి కూలిపోయి కొట్టుకుపోయింది. వర్షాలకు ఆర్‌ అండ్‌ బీ పరిధిలోని 523 కి.మీ. మేరకు రోడ్లు ధ్వంసమయ్యాయి.



చలి గాలులకు 465 జీవాలు మృతి

  గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలంలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి, చలి గాలులకు 465 గొర్రెలు శుక్రవారం మృతి చెందాయి. తుఫాను కారణంగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, చలి గాలులకు రుద్రవరంలో 47, బొల్లవరంలో 70, దమ్మాలపాడులో 348 గొర్రెలు మృతి చెందాయి.


ఎక్కడ ఎంత నష్టం?


జిల్లాల వారీగా పంట నష్టం (హెక్టార్లలో) ప్రాథమిక అంచనా

గుంటూరు           1,61,874

ప్రకాశం                 98,805 

కృష్ణా                 94,116 

పశ్చిమగోదావరి 21,234 

తూర్పుగోదావరి 57,870

చిత్తూరు         15,000 

కడప                 72,755 

శ్రీకాకుళం         1,400 

నెల్లూరు         6,500.


Updated Date - 2020-11-28T08:08:28+05:30 IST