‘మంచిప్ప’లో ముంచొద్దు!

ABN , First Publish Date - 2022-04-28T06:30:06+05:30 IST

మంచిప్ప రిజర్వాయర్‌ ఎత్తు పెంచి తమను అందులో ముంచొద్దని భూనిర్వాసితులు, ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. రిజర్వాయర్‌ ఎత్తు పెంచడాన్ని మొదటి నుంచి ముంపు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ముమ్మాటికీ ఎత్తు పెంచవద్దని కోరుతున్నారు.

‘మంచిప్ప’లో ముంచొద్దు!
మంచిప్ప రిజర్వాయర్‌ వద్ద ఆందోళన చేస్తున్న వారిని సముదాయిస్తున్న పోలీసులు

మంచిప్ప రిజర్వాయర్‌ భూనిర్వాసితులు, ముంపు గ్రాస్థుల ఆందోళన బాట

ఎత్తు పెంచొద్దని మూకుమ్మడిగా కదిలిన బాధితులు 

జిల్లా అధికారులకు వినతుల వెల్లువ

పాత డిజైన్‌ ప్రకారమే నిర్మించాలని గ్రామస్థులు, గిరిజనుల డిమాండ్‌

తాజాగా వృద్ధురాలి ఆత్మహత్య

ఇంటితో పాటు వ్యవసాయ భూమిని కోల్పోతానన్న మనోవేదనతోనే..

కుటుంబీకులు, భూనిర్వాసితుల ఆగ్రహం

వృద్ధురాలు బుజ్జిబాయి మృతదేహంతో రిజర్వాయర్‌ వద్ద ఆందోళన

పరిస్థితి ఉద్రిక్తం... మోహరించిన పోలీసులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ మోపాల్‌: మంచిప్ప రిజర్వాయర్‌ ఎత్తు పెంచి తమను అందులో ముంచొద్దని భూనిర్వాసితులు, ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. రిజర్వాయర్‌ ఎత్తు పెంచడాన్ని మొదటి నుంచి ముంపు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు.  ముమ్మాటికీ ఎత్తు పెంచవద్దని కోరుతున్నారు. గడిచిన నెల రోజులుగా పలు దఫాలుగా ప్రాజెక్టు వద్ద ధార్నాలు నిర్వహించారు. జిల్లా అధికారులతో సమీక్షల్లో పాల్గొన్నారు. నష్టపరిహారం ఎంత ఇచ్చినా.. భూములను వదులుకోమని భూనిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు. అటవీ, పర్యావరణశాఖ అనుమతులు మంజూరు చేసినా గ్రామస్థులు, గిరిజనులు మాత్రం రిజర్వాయర్‌కు భూములను ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు.

కొనసాగుతున్న నిర్మాణ పనులు

కాళేశ్వరం పథకం కింద 20, 21, 22వ ప్యాకేజీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు, పైప్‌ లైనుల నిర్మాణం, పంపుహౌజ్‌ల కోసం రూ.26 వందల కోట్లను వెచ్చిస్తున్నారు. మంచిప్ప, కొండెం చెరువు ఎత్తు పెంచి 3.5 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మాణం చేస్తే శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ను ఎక్కువ రోజులు ఉపయోగించవచ్చని రిజర్వాయర్‌ డిజైన్‌ను మార్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అనుమతులను సైతం ఇచ్చింది. రిజర్వాయర్‌ నిర్మాణం గతంలో కొంత చేసిన అధికారులు.. ముంపు గ్రామాల నుంచి వ్యతిరేకత రావడం, డిజైన్‌కు అనుగుణంగా భూసేకరణకు నోటిపికేషన్‌ ఇవ్వకపోవడం వల్ల ప్రస్తుతం పంపుహౌజ్‌ల నిర్మాణం చేస్తున్నారు.

భూనిర్వాసితుల ఆందోళన బాట

మంచిప్ప రిజార్వాయర్‌ కింద మంచిప్ప గ్రామభూములతో పాటు అమ్రాబాద్‌, బైరాపూర్‌, మొత్తం ఎనిమిది తండాలకు చెందిన భూములు, ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాల పరిధిలో 12 వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో తండాలో ఎక్కువగా గిరిజనులు ఉన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి చెందిన 16 వందల ఎకరాల భూములు, ఇళ్లు కోల్పేతే తమకు జీవనాధారం పోతుందని భావిస్తున్నారు. రిజర్వాయర్‌ డిజైన్‌ మార్చినప్పటి నుంచి పనులు చేయవద్దని కోరుతున్నారు. డీపీఆర్‌ ప్రకటించకుండా పనులు చేపట్టవద్దని డిమాండ్‌ చేస్తున్నారు. పాత డిజైన్‌ ప్రకారమే కొనసాగించాలని కోరుతున్నారు. అధికారులతో సమావేశాలలో అదే వివరిస్తున్నారు. హైకోర్టులోనూ ఎత్తు పెంచవద్దని పిటిషన్‌ సైతం వేశారు. వివిధ మార్గాలలో పోరాటాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన రిజార్వాయర్‌ కావడం, ఎక్కువ గ్రామాలకు సాగునీరు అందించే అవకాశం ఉండటంతో గ్రామస్థులతో మాట్లాడే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. వారికి అనుకున్న విధంగా మంచి ప్యాకేజీ ఇస్తామని ప్రకటిస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు మాత్రం ఒప్పుకోవడం లేదు.

అధికారులు, కాంట్రాక్టర్‌పై ఫిర్యాధు

అమ్రాబాద్‌ గ్రామం పరిధిలో మంచిప్ప రిజర్వాయర్‌ పనులు మొదలు పెట్టినందునే స్థానిక బుజ్జి అనే మహిళ అత్మహత్య చేసుకుందని కుటుంబీకుల తో కలిసి భూనిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశాకు ఈ మేరకు  పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌, తహసీల్దార్‌, అర్‌డీవోలు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా మంచిప్ప రిజార్వాయర్‌ నిర్మాణ పనులు చేస్తున్నారని కుటుంబీకులు, భూనిర్వాసితులు, మంపు గ్రామాల ప్రజలు ఆరోపించారు. వారు పనులు చేపట్టడం వల్లనే తమ నాయనమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి మనువడు మోపాల్‌  ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, గ్రామస్థుల సహాయంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. అమ్రాబాద్‌ గ్రామంతో పాటు రిజార్వాయర్‌ వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు.

బుజ్జిబాయిది సహజ మరణమే..

: రవి, ఆర్డీవో, నిజామాబాద్‌

మోపాల్‌ మండలం అమ్రాబాద్‌ గ్రామంలో బుధవారం బుజ్జిబాయి(63) అనే మహిళ ఉరేసుకుని మృతి చెందినట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అబద్ధం. ఆమె ఉరేసుకుని మృతి చెందినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆమెది సహజ మరణం. అంతేకాకుండా ఆమెకు ఎలాంటి భూమి కూడా లేదు. అసత్య ప్రచారాలు నమ్మవద్దు.

Updated Date - 2022-04-28T06:30:06+05:30 IST