తక్షణ కర్తవ్యం

ABN , First Publish Date - 2021-06-18T09:36:15+05:30 IST

ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేసేవాడే విజ్ఞుడు. అత్యవసరంగా చేయాల్సిన పనిని పక్కన పెట్టి, ప్రాధాన్యం లేని పనిని పట్టుకొని వేలాడేవాడు అజ్ఞాని. కోపం వల్లో, ఇష్టం వల్లో, దురాశ వల్లో, పేరాశవల్లో ఇలాంటి ప్రాధాన్యత లేని

తక్షణ కర్తవ్యం

ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేసేవాడే విజ్ఞుడు. అత్యవసరంగా చేయాల్సిన పనిని పక్కన పెట్టి, ప్రాధాన్యం లేని పనిని పట్టుకొని వేలాడేవాడు అజ్ఞాని. కోపం వల్లో, ఇష్టం వల్లో, దురాశ వల్లో, పేరాశవల్లో ఇలాంటి ప్రాధాన్యత లేని పనులకు సమయాన్ని వృథా చేయడం తగదు. ముఖ్యంగా ఇలాంటి లక్షణం ఉన్న పాలకులు తమ రాజ్యాన్నీ, రాజ్య సంక్షేమాన్నీ విస్మరిస్తారు. ఒకసారి కోసల రాజు అలాంటి పనికే పూనుకున్నాడు. 


ఆ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. నదులు, వాగులు పొంగి పొరలుతున్నాయి. రాజధాని శ్రావస్తి ప్రజలు నిత్యావసర సరుకులు దొరక్క, ఎండు కట్టెలు లేక విలవిలలాడిపోతున్నారు. అదే సమయంలో రాజ్యం పొలిమేరలోని ఒక చిన్న గ్రామంలో అలజడి రేగింది. ప్రజలు పన్నులు కట్టలేమంటూ రాజోద్యోగులపై తిరుగుబాటు చేశారు. ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అనుకున్న రాజు తానే స్వయంగా సైన్యాన్ని వెంటపెట్టుకొని, ఆ పొలిమేర గ్రామానికి బయలుదేరాడు. రాజధాని నగరంలో చక్కబెట్టాల్సిన పనులను పక్కన పెట్టాడు. 


వర్షాల కారణంగా దారులన్నీ బురదమయం అయిపోయాయి. రాజుగారి గుర్రాలూ, రథాలూ కష్టంగా ముందుకు సాగుతున్నాయి. ప్రయాణం ఇబ్బందిగా మారడంతో... దారిలోని జేతవనంలో కొద్దిసేపు ఆగాలనుకున్నాడు కోసల రాజు. ఆ వనం బుద్ధుడి వర్షావాసం. అక్కడ ఆరామంలో బుద్ధుడు ఉన్నాడు. ఈ సంగతి తెలిసే రాజు అక్కడ ఆగి, బుద్ధుణ్ణి దర్శించుకున్నాడు. తాను ఎక్కడకు వెళుతున్నదీ, ఎందుకు వెళుతున్నదీ చెప్పాడు. అతడు చేయాల్సిన పనిని విడచి, చేయదగని పని కోసం వెళుతున్నాడని అర్థం చేసుకున్న బుద్ధుడు ఈ కథ చెప్పాడు.


‘‘రాజా! పూర్వం కాశీ రాజ్యాన్ని పాలించే రాజుకు కూడా ఇలాంటి సమస్యే వచ్చి పడింది. అతడు కూడా వర్షాకాలంలో ఒక తిరుగుబాటును అణచడానికి బయలుదేరాడు. ఒక అడవిలో ఆగాడు. అక్కడ గుర్రాల కోసం కొన్ని తొట్టెలలో గుగ్గిళ్ళు నానబోశారు. మధ్యాహ్నానికి అవి చక్కగా నాని, ఉబ్బాయి. చెట్టు మీద నివసించే ఒక కోతి ఈ గుగ్గిళ్ళను చూసింది. గబగబా చెట్టు దిగి వచ్చి, గుప్పిటితో గుగ్గిళ్ళు తీసి, నోటి నిండా పోసుకుంది. మళ్ళీ రెండు గుప్పిళ్ళ నిండా గుగ్గిళ్ళు పట్టుకొని, చకచకా చెట్టు ఎక్కి, కొమ్మ మీద కూర్చొని... వాటిని నమలసాగింది. 


ఇంతలో... దాని నోట్లోంచీ ఒక గింజ జారి నేల మీద పడింది. అలా జారి పడిపోయిన గింజ కోసం... తన రెండు చేతుల్లోని గుగ్గిళ్ళనూ అది దూరంగా విసిరి కొట్టింది. మిగిలిన గుగ్గిళ్ళను ఉమ్మేసింది. చెట్టు దిగి ఆ ఒక్క గింజ కోసం వెతికింది. ఎంత వెతికినా ఆ గింజ దొరకలేదు.

\ఈ తతంగమంతా దగ్గరలో ఉన్న తన గుడారం నుంచి చూస్తున్న కాశీ రాజుకు ‘నేను చేస్తున్న పని కూడా ఇలాంటిదే కదా!’ అనిపించింది. కొందరు సైనికులను పంపి సర్దుబాటు చేయాల్సిన సమస్య కోసం... రాజ్య సంరక్షణను వదలిపెట్టి తాను స్వయంగా కదలడం కూడా ఈ కోతి చేష్టలాగానే తోచింది. వెంటనే సైనికులతో తన రాజధానికి తిరుగు ప్రయాణమయ్యాడు’’ అని కథ ముగిస్తూ, ‘గోరంత కోసం కొండంత వదులుకోవడం తప్పు’ అని కాశీరాజు తెలుసుకున్నాడు’’ అని చెప్పాడు. 

ఆ కథ తన కోసమే అని కోసల రాజు గ్రహించాడు. ‘తక్షణ కర్తవ్యం’ ఏమిటో తెలుసుకున్నాడు. బుద్ధునికి నమస్కరించి, వెనుతిరిగాడు. వరదలతో సతమతమవుతున్న ప్రజలను ఆదుకొనే పనులను చేపట్టాడు.


ఫ బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2021-06-18T09:36:15+05:30 IST