భారత్ వృద్ధి రేటుపై ఐఎంఎఫ్ శుభవార్త!

ABN , First Publish Date - 2021-04-07T00:52:57+05:30 IST

భారత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్య

భారత్ వృద్ధి రేటుపై ఐఎంఎఫ్ శుభవార్త!

న్యూఢిల్లీ : భారత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సవరించింది. 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత దేశ జీడీపీ వృద్ధి రేటు 12.5 ఉంటుందని అంచనా వేసింది. అంతకుముందు ఈ రేటు 11.5 శాతం ఉండవచ్చునని చెప్పిన సంగతి తెలిసిందే. ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి శుభవార్త అని చెప్పవచ్చు. 


ఐఎంఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్‌ ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ జీడీపీ వృద్ధి రేటు 12.5 శాతం ఉండవచ్చు. ఈ స్థాయి వృద్ధి అంచనా అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో అత్యధికమైనది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి బాగా పుంజుకుంటుంది. జనవరిలో విడుదల చేసిన నివేదికలో మన దేశ జీడీపీ వృద్ధి రేటు 11.5 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. తాజా నివేదికలో ఈ రేటు మరింత పెరుగుతుందని అంచనా వేసింది. ఇది శుభవార్త అయినప్పటికీ, మొత్తం మీద జీడీపీ 8 శాతం క్షీణిస్తుందని తాజా నివేదిక పేర్కొంది. 


ఈ తాజా నివేదికలో 2022 ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో కూడా భారత దేశ వృద్ధి రేటు అంచనాను సవరించింది. దీంతో మన దేశ వృద్ధి గతి దీర్ఘకాలంలో స్థిరంగా ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం వల్ల, ఆ ప్రభావం అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలపై పడుతుందని ఈ నివేదిక తెలిపింది. 


ప్రపంచంలో రెండో అతి పెద్ద కోవిడ్ హాట్‌స్పాట్‌గా భారత దేశం మారిన సమయంలో ఆశావాదంతో కూడిన ఐఎంఎఫ్ నివేదిక వెలువడింది. అయితే ఐఎంఎఫ్ ఆశావాదానికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 5న విడుదల చేసిన మార్చి నెల ఆర్థిక సమీక్షకు పొంతన కుదరడం విశేషం. 


కోవిడ్-19 మహమ్మారి ఫస్ట్ వేవ్‌లో విజయవంతమైన నిర్వహణ ద్వారా సంపాదించిన అవగాహనతో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరం పుంజుకుంటోందని ఐఎంఎఫ్ పేర్కొంది. తాజాగా సెకండ్ వేవ్ విసిరే సవాలుతో పోరాడటానికి భారత దేశం సిద్ధంగా ఉందని పేర్కొంది. 


Updated Date - 2021-04-07T00:52:57+05:30 IST