ఊహనే చరిత్ర అంటున్నారేమో

ABN , First Publish Date - 2020-09-28T06:22:26+05:30 IST

‘ఈ స్థాయి సంకుచి తత్వం అవసర మా!’ (ఆంధ్రజ్యోతి వివిధ, సెప్టెంబర్‌ 7, 2020) అంటూ సామిడి జగన్‌ రెడ్డి రాసిన వ్యాసం చూశాను. అందులో...

ఊహనే చరిత్ర అంటున్నారేమో

‘ఈ స్థాయి సంకుచి తత్వం అవసర మా!’ (ఆంధ్రజ్యోతి వివిధ, సెప్టెంబర్‌ 7, 2020) అంటూ సామిడి జగన్‌ రెడ్డి రాసిన వ్యాసం చూశాను. అందులో చర్చించవలసిన అంశాలెన్నో ఉన్నాయిగాని, ఒక్క విషయానికి మాత్రం పరిమితమవుతాను. అది కూడ ‘‘ఒక రచయిత’’ అని పేరు కూడ రాయకుండానే నా ప్రస్తావన చేశారు గనుక రాయవలసి వస్తున్నది. ఒక పుస్తకపు ప్రచురణ వివరాలు కూడ సరిగా ఇవ్వని, ఇద్దరు రచయితలలో ఒకరి పేరు రాసి, మరొకరి పేరు ‘‘ఒక రచయిత’’తో సరిపెట్టిన జగన్‌ రెడ్డి పరిశోధనా ప్రమాణాల గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది.


వట్టికోట ఆళ్వారుస్వామి జీవితంపై ‘సార్థక జీవనం’ పేరుతో సంగిశెట్టి ‘‘ఒక రచయిత’’తో కలిసి ఒక పుస్తకం అచ్చువేశాడని, ‘‘అందులో చివరిదశలో ఆళ్వారుస్వామి సిపిఐని వదిలి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతిని దాచి తెలంగాణ సమాజాన్ని దగా చేసేందుకు సంగిశెట్టి ఒడి గట్టాడ’’ని జగన్‌రెడ్డి రాశారు. ఆళ్వారుస్వామి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత 1952లో కమ్యూనిస్టు పార్టీకి దూరం జరిగారని, పార్టీ సభ్యత్వం కూడ వదులుకున్నారని చరిత్రలో నమోదై ఉంది. తర్వాత 1956-57ల్లో ఆయన రాసిన ‘రామప్ప రభస’ శీర్షికలో కాంగ్రెస్‌ మీద, కమ్యూనిస్టుల మీద, మొత్తంగా రాజకీ యాల మీద నిరసన, నిరాశ స్పష్టంగా కనబడతాయి. ఆ కాలంలో ఆయన ఎవరితోనూ లేరని ఆ రచనలు చూపుతాయి. ఆ తర్వాత కేరళలో నంబూద్రిపాద్‌ ప్రభు త్వాన్ని కేంద్ర ప్రభుత్వం కూల్చివేసిన రోజే, కాంగ్రెస్‌ చేసిన ఆ చర్యకు నిర సనగా ఆయన ‘‘ధుమ ధుమలాడుతూ’’ వచ్చి, మళ్లీ కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారని దాశరథి రంగాచార్య చెప్పారు, రా శారు. కేరళ ప్రభుత్వ కూల్చివేత జరిగింది 1959 జూలై 31న. ఆ తర్వాత ఆళ్వారుస్వామి 1961 ఫిబ్ర వరి 5న మరణించారు. ఈ మధ్యలో పద్దెనిమిది నెలల్లో ఆయన మళ్లీ కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం వదులుకుని కాంగ్రెస్‌లో చేరారనడానికి జగన్‌రెడ్డికి ఉన్న ఆధారమే మిటో తెలియదు. ఆ ఆధా రాన్ని మా పుస్తకానికి ముందు ఆయనగాని, మరెవరైనా గాని బైటపెట్టి ఉంటే దాన్ని విస్మ రించి, ‘‘దాచి’’ మేం తెలంగాణ సమాజాన్ని దగా చేశామనే మాట చెల్లుతుంది. లేదా పతంజలి పాత్ర అన్నట్టు సత్యాన్ని ఊహించి కనిపెట్టే విద్యలో నిష్ణాతు లైన జగన్‌రెడ్డి గతంలో చాలసార్లు చరిత్రను ఊహించి కనిపెట్టినట్టే ఇప్పుడు కూడ తన ఊహనే చరిత్ర అంటు న్నారేమో. ఇప్పటికైనా విశ్వసనీయమైన ఆధారాన్ని బైటపెట్టి తెలంగాణ సమాజానికి జరిగిన దగానుంచి రక్షించవలసిందిగా జగన్‌ రెడ్డికి విజ్ఞప్తి.  

‘‘ఒక రచయిత’’

ఎన్‌. వేణుగోపాల్‌


Updated Date - 2020-09-28T06:22:26+05:30 IST