Abn logo
Sep 27 2021 @ 00:51AM

వైద్యుల సహకారంతోనే కొవిడ్‌ను ఎదుర్కొంటున్నాం

జేసీ శివశంకర్‌ను సన్మానిస్తున్న ఐఎంఏ సభ్యులు

ఐఎంఏ నగర శాఖ వార్షిక సమావేశంలో జేసీ శివశంకర్‌

గవర్నర్‌పేట, సెప్టెంబరు 26: కరోనా విజృంభిస్తున్న తరుణంలో వైద్యులు, వైద్య సిబ్బంది సహకారం వల్లనే అనేకమంది ప్రాణాలను కాపాడగలిగామని జాయింట్‌ కలెక్టర్‌ శివశంకరరావు పేర్కొన్నారు. చల్లపల్లి బంగ్లా సమీపంలోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) హాలులో ఆదివారం అసోసియేషన్‌ నగర శాఖ వార్షిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రసంగించారు. సమావేశానికి ఐఎంఏ నగర కార్యదర్శి డాక్టర్‌ తుమ్మల కార్తీక్‌ అధ్యక్షత వహించారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు వైద్యులు జిల్లా యంత్రాంగానికి అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. జిల్లాలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూశామన్నారు. ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్‌ మధుసూధనశర్మ మాట్లాడుతూ అధికార యంత్రాంగంలో ఉన్న కలెక్టర్‌, జేసీ సంపూర్ణ సహకారం, పని విధానం కారణంగానే ఆస్పత్రుల్లో అవిశ్రాంత సేవలందించామన్నారు. భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా సేవలందించడానికి తాము సిద్దంగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ నగర శాఖ ఫైనాన్స్‌ సెక్రటరీ డాక్టర్‌ ఉస్మాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ సభ్యులు జేసీ శివశంకర్‌ను సన్మానించి జ్ఞాపికను అందజేశారు.