‘ప్రొటోకాల్‌’పై చెప్పాల్సిన చోట చెప్పాను!

ABN , First Publish Date - 2022-04-13T08:21:34+05:30 IST

తన అధికారిక పర్యటనల్లో ప్రొటోకాల్‌ పరంగా నిబంధనలు పాటించడం లేదనే విషయాన్ని తాను ఎవరికి చెప్పాలో వారికి చెప్పానని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు.

‘ప్రొటోకాల్‌’పై చెప్పాల్సిన చోట చెప్పాను!

ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ మధ్య గ్యాప్‌పై మీరే చెప్పాలి


విలేకర్ల సమావేశంలో గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలు

జూన్‌ 2న గిరిజన అభివృద్ధిపై సమీక్ష చేస్తానని వెల్లడి

ముగిసిన కొత్తగూడెం జిల్లా పర్యటన

రైల్లో హైదరాబాద్‌కు గవర్నర్‌ తిరుగు పయనం

గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలు

‘భద్రాద్రి-ఐదు పంచాయతీల సమస్య’ కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి 

ముగిసిన కొత్తగూడెం జిల్లా పర్యటన 


కొత్తగూడెం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): తన అధికారిక పర్యటనల్లో ప్రొటోకాల్‌ పరంగా నిబంధనలు పాటించడం లేదనే విషయాన్ని తాను ఎవరికి చెప్పాలో వారికి చెప్పానని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. ‘ప్రొటోకాల్‌’ విషయాన్ని తాను కంప్లెయింట్‌గా చూడనని, కాంప్లిమెంటరీగా చూస్తానని అన్నారు. ఇటీవల గవర్నర్‌ పర్యటనల్లో ప్రొటోకాల్‌ పాటించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతుండటం, కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఆమె రెండు రోజుల పర్యటనలోనూ ముఖ్య అధికారులు దూరంగా ఉండటంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు గవర్నర్‌ పైవిధంగా స్పందించారు. రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌కు మఽధ్య దూరం పెరిగిందంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రశ్నించంగా ‘అలాంటిదేమీ లేదు.. ఆ గ్యాప్‌ ఎంత దూరం ఉందో మీరే చెప్పండి’ అని వ్యాఖ్యానించారు. కొత్తగూడెం జిల్లాలో గవర్నర్‌ రెండు రోజుల పర్యటన ముగిసింది.


రెండోరోజైన మంగళవారం జిల్లాలోని దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో, పర్యటన ముగిశాక  కొత్తగూడెంలోని సింగరేణి ఇల్లెందు అతిథిగృహంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో గవర్నర్‌ మాట్లాడారు. జూన్‌ రెండో తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు తన పుట్టినరోజు కూడా అని.. ఆ రోజున రాష్ట్రంలో  అన్ని జిల్లాల అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో సమీక్ష నిర్వహించి గిరిజనాభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేస్తామని తమిళిసై వెల్లడించారు. తన రెండు రోజుల జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసిందన్నారు. భద్రాచలం దేవస్థానం ఆహ్వానం మేరకు శ్రీరామ మహాపట్టాభిషేక ఉత్సవంలో పాల్గొన్నానని, గిరిజనుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు.


గవర్నర్‌గా రాష్ట్రంలోని గిరిజనుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నానని, అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ఆరు గ్రామాలను దత్తత తీసుకున్నానని వివరించారు. గిరిజనుల్లో రక్తహీనత అధికంగా ఉందని,  వైద్య పరీక్షల్లో బీపీతోపాటు రక్తహీనత పౌష్టికాహార సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. హైపర్‌టెన్షన్‌ వల్ల గుండె, కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయని,  బ్రెయిన్‌ ట్యూమర్‌ రోగులను కూడా గుర్తించామని, వారందరికి వైద్య సదుపాయాలు సమకూర్చుతున్నట్టు వివరించారు.


గిరిజనాబివృద్ధికి రెడ్‌క్రాస్‌ లాంటి స్వచ్ఛంద సంస్థలతోపాటు దాతల సహకారం తీసుకుంటామని,  రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సహకారం కోరతామన్నారు. ఏపీలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలు  పురుషోత్తపట్నం, గుండాలా, ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడును తిరిగి భద్రాచలంలో కలిపేందుకు చొరవ చూపాలంటూ స్థానిక ఎమ్మెల్యే పోదెం వీరయ్య చేసిన విజ్ఞప్తిపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. విలేకర్ల సమావేశం అనంతరం ఆమె, రైలులో హైదరాబాద్‌ తిరుగుపయనమయ్యారు.  


హైకోర్టు తీర్చు ఇచ్చినా క్రమబద్ధీకరణ లేదు 


భద్రాచలంలోని ఐటీడీఎ పరిధిలోని మారుమూల ఆశ్రమ పాఠశాలల్లో 14 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను అకారణంగా తొలగించారని బాధిత ఉపాధ్యాయులు మంగళవారం గవర్నర్‌ తమిళిసై దృష్టికి తెచ్చారు. తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలంటూ కొత్తగూడెంలోని సింగరేణి ఇల్లెందు గెస్ట్‌హౌ్‌సలో   గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకొని, క్రమబద్ధీకరించాలంటూ 2020, 21లో హైకోర్టు, తీర్పులిచ్చినా అమలు కావడం లేదని వాపోయారు. 

Updated Date - 2022-04-13T08:21:34+05:30 IST