Abn logo
Jun 4 2020 @ 22:03PM

వస్తువులు అమ్మి 100 కుటుంబాలకు సాయం చేస్తున్నా: బాలీవుడ్ నటుడు

ముంబై: కరోనా కారణంగా అనేక అవస్థలు పడుతున్న పేదలకు అనేకమంది అండగా ఉంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి సోనూసుద్, సల్మాన్ ఖాన్ వంటి అనేకమంది సెలబ్రిటీలు వలస కార్మికులకు, అన్నార్తులకు అండగా ఉంటున్నారు. బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ కూడా దాదాపు 100 కుటుంబాల వారికి అండగా ఉంటున్నారు. ముఖ్యంగా వారందరికీ ఆహారం అందించడంతో పాటు మాస్కులు వంటి సౌకర్యాలు కల్పించే బాధ్యతను రోనిత్ రాయ్ తీసుకున్నారు. అయితే ప్రస్తుతం వారిని పోషించేందుకు తన వద్ద ఉన్న అనేక వస్తువులను అమ్ముతున్నానని చెప్పారు. ‘జనవరి నుంచి నేను ఒక్క రూపాయి సంపాదించలేదు. ఈ నేపథ్యంలో నాకున్న చిన్న వ్యాపారంతోనే నెట్టుకొచ్చాను. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా అది కూడా మూతపడింది. అయితే ఈ లాక్‌డౌన్‌లో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు.


అందుకే ఓ 100 కుటుంబాల బాధ్యత నేను తీసుకున్నాను. కానీ వారికి సరిపడా డబ్బులు లేకపోవడంతో నా వద్ద ఉన్న వస్తువులను అమ్మి వారికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని రోనిత్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తానేమీ డబ్బున్నవాడిని కాదని, అయినప్పటికీ వారికి వారికి ఎలాగైనా సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నానని చెప్పారు. ఆకలితో అలమటించడం, డబ్బులు లేక అవస్థలు పడడం అన్నీ తనకు తెలుసని, అందుకే ఎలాగైనా వారికి సాయం చేయాలని అనుకుంటున్నానని రోనిత్ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement