మీరనుకుంటున్న ఆ నేను.. నేను కాదు: ఒలింపిక్ గ్రేట్ మో ఫరా సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-07-12T23:11:20+05:30 IST

ఇంగ్లండ్‌కు చెందిన ఒలింపిక్ గ్రేట్ మో ఫరా (Mo Farah) సంచలన వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు

మీరనుకుంటున్న ఆ నేను.. నేను కాదు: ఒలింపిక్ గ్రేట్ మో ఫరా సంచలన వ్యాఖ్యలు

లండన్: ఇంగ్లండ్‌కు చెందిన ఒలింపిక్ గ్రేట్ మో ఫరా (Mo Farah) సంచలన వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అందరూ అనుకుంటున్న మో ఫరాను తాను కాదని, తన నేపథ్యం వేరే అని చెప్పి ఒక్కసారిగా క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమయ్యాడు. 9 ఏళ్ల వయసులో తాను మానవ అక్రమ రవాణా ముఠా (Trafficked) చేతికి చిక్కానని, బాలకార్మికుడిగా డిజిబౌటీ నుంచి లండన్‌కు అక్రమంగా వచ్చి పడ్డానని వివరించాడు. అందరూ అనకుంటున్నట్టుగా తన పేరు మో ఫరా కాదని, తన అసలు పేరు హుస్సేన్ అబ్ది ఖహీన్ (Hussein Abdi Kahin) అని పేర్కొన్నాడు.


ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసులో తూర్పు ఆఫ్రికా దేశం నుంచి యూకేకు తనను తీసుకొచ్చిన మహిళ ముఖాన్ని మో మళ్లీ చూడలేదు. ఆ తర్వాత ఓ ఇంట్లో చిన్న పిల్లాడిని చూసుకునే పనికి కుదిరినట్టు బీబీసీ డాక్యుమెంటరీ ‘ది రియల్ మో ఫరా’లో పేర్కొన్నారు. ఇది బుధవారం ప్రసారం అవుతుంది. 


2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో ఒలింపిక్స్‌లలో 5,000-10,000 మీటర్ల డబుల్స్‌ను గెలుచుకున్న ఫరా.. తాను తన తల్లిదండ్రులతో కలిసి సోమాలియా (Somalia) నుంచి యూకేకే శరణార్థిగా వచ్చినట్టు గతంలో చెప్పాడు. తాజాగా మరో సంచలన విషయాన్ని వెల్లడించాడు. తన తల్లిదండ్రులు అసలు యూకేనే రాలేదని పేర్కొన్నాడు. సోమాలియాలో జరిగిన ఘర్షణల్లో తన తండ్రి మరణించాడని, అప్పుడు తన వయసు నాలుగేళ్లని 39 ఏళ్ల ఫరా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన తల్లి ఇద్దరు సోదరులతో కలిసి సోమాలియా నుంచి విడిపోయి, అంతర్జాతీయ సమాజం గుర్తించని భూభాగంలో నివసిస్తున్నట్టు వివరించాడు. 


‘‘నిజమేంటంటే మీరనుకుంటున్న నేను.. నేను కాదు’’ అని ఫరా చెప్పుకొచ్చాడు. ‘‘చాలామందికి నేను మో ఫరాగానే తెలుసు. కానీ అది నా పేరు కాదు, నా నేపథ్యం వేరే’’ అని ఫరా వివరించాడు. బంధువుల ఇంటికని యూకే తీసుకొచ్చిన ఆ మహిళ అతడి పేరును మహమ్మద్‌గా నకిలీ ట్రావెల్ డాక్యుమెంట్లు సృష్టించింది. అందులో అతడి ఫొటో పక్కన ‘మహహ్మద్ ఫరా’ అని రాసి ఉంది. 


ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో నాలుగు స్వర్ణాలు గెలిచిన తొలి బ్రిటిష్ అథ్లెట్‌గా ఫరా రికార్డు సొంతం చేసుకున్నాడు. తన గతం గురించి ప్రపంచానికి వెల్లడించాలని తన కుమారులు తనను ప్రేరేపించడంతోనే ఇప్పుడీ విషయాలు వెల్లడించినట్టు తెలిపాడు. ఈ విషయాలను తాను చాలాకాలంగా రహస్యంగానే ఉంచానని, వాటిని భరించడం కష్టమని అన్నాడు. తన పిల్లల వల్లే ఇప్పుడీ విషయాలు చెప్పాల్సి వచ్చిందని మో వివరించాడు. 


ఫరాను 2010లో పెళ్లాడడానికి ముందే అతడి భార్య తానా.. ఫరా కథలో కొంత భాగం మిస్సయిందని గ్రహించింది. ఆ తర్వాత పలుమార్లు ఆ విషయమై ప్రశ్నలు వేసేది. దీంతో ఆ మిస్సైన కథను ఫరా పూర్తిగా బయటపెట్టాడు. ఫరాను యూకే తీసుకొచ్చిన మహిళ.. అతడి జేబులో బంధువుల వివరాలున్న కాగితాన్ని తీసుకున్ని చింపేసి చెత్తబుట్టలో పడేసింది. అప్పుడే తొలిసారి తాను ప్రమాదంలో ఉన్నానని ఫరా గుర్తించాడు. తన నోట్లోకి ముద్ద వెళ్లాలంటే ఇంటి పని చేయడంతోపాటు పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చాలాసార్లు బాత్రూములో తలుపు వేసుకుని ఏడ్చానని ఫరా గుర్తుచేసుకున్నాడు.   

Updated Date - 2022-07-12T23:11:20+05:30 IST