నేను దుబాయ్‌లో కులాసాగా ఉన్నా.. : విజయకాంత్ ట్వీట్

ABN , First Publish Date - 2021-09-06T19:39:55+05:30 IST

డీఎండీకే అధ్యక్షుడు, ప్రముఖ తమిళ సినీ నటుడు విజయకాంత్‌ దుబాయ్‌లో..

నేను దుబాయ్‌లో కులాసాగా ఉన్నా.. : విజయకాంత్ ట్వీట్

చెన్నై : డీఎండీకే అధ్యక్షుడు, ప్రముఖ తమిళ సినీ నటుడు విజయకాంత్‌ దుబాయ్‌లో తాను కులాసాగా వున్నానంటూ ట్విట్టర్‌లో నర్సులతో తీయించుకున్న ఫొటో పోస్టు చేసి అభిమానులను సంతోషపరిచారు. గత సోమవారం ఉదయం వైద్యం కోసం ఆయన దుబాయ్‌ పయనమయ్యారు. కెప్టెన్‌తోపాటు ఆయన కుమారుడు షణ్ముగపాండ్యన్‌ వెళ్లగా, రెండు రోజుల క్రితం ఆయన భార్య కూడా దుబాయ్‌ బయల్దేరి వెళ్ళారు. ప్రస్తుతం దుబాయ్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో విజయకాంత్‌ చికిత్స పొందుతున్నారు.


ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం విజయకాంత్‌ ట్విట్టర్‌లో తన ఫొటో పోస్టు చేశారు. అందులో విజయకాంత్‌‌కు ఇరువైపులా నర్సులు నిలుచుని వుండగా, నీలిరంగు టీషర్టు, బ్రౌన్‌ ప్యాంట్‌ ధరించి, సోఫోలో స్టయిల్‌గా కూర్చుని సెల్‌ఫోన్‌ పట్టుకుని ఉన్నారు. ఆ ఫొటోతోపాటు విజయకాంత్‌ పోస్టు చేసిన సందేశంలో తాను కులాసాగా వున్నానని, తనకు సేవలందిస్తున్న నర్సులతోపాటు సెల్‌ఫోన్‌లో తాను నటించిన ‘క్షత్రియన్‌’ సినిమా చూస్తున్నప్పటి ఫొటో ఇది అంటూ పేర్కొన్నారు. విజయకాంత్‌ పోస్టు చేసిన ఈ ఫొటో ప్రస్తుతం ప్రసారమాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

Updated Date - 2021-09-06T19:39:55+05:30 IST