చివరి ‘పరీక్ష’

ABN , First Publish Date - 2022-05-19T04:56:57+05:30 IST

పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలని.. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎంతో కష్టపడి చదివాడు. బుధవారం విపరీతమైన తలనొప్పి.. వాంతులు చేసుకున్నాడు. చికిత్స చేసి పర్యవేక్షణలో ఉండాలని వైద్యసిబ్బంది చెప్పారు. అయినా ఆ విద్యార్థి పరీక్ష రాయాలని నిర్ణయించుకుని కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష రాస్తూ అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. జీవితంలో అదే చివరి పరీక్షగా.. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. పాతపట్నంలో ఇంటర్‌ విద్యార్థి బూరాడ కార్తీక్‌(16) విషాదాంతమిది. - అలాగే మరో విద్యార్థిని తూలుగు ధనలక్ష్మి కూడా పరీక్ష రాస్తూ అస్వస్థతకు గురైంది. కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం కోలుకుంది. ఈ రెండు ఘటనలూ పాతపట్నంలోనే వేర్వేరు పరీక్షా కేంద్రాల్లో చోటుచేసుకోవడం గమనార్హం.

చివరి ‘పరీక్ష’
కార్తీక్‌ మృతదేహం.. ఇన్‌సెట్‌లో (ఫైల్‌ఫొటో).. సీహెచ్‌సీ వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

అనారోగ్యం.. అయినా పరీక్షకు హాజరు
కళ్లు తిరిగి కుప్పకూలి అపస్మారకస్థితిలోకి..
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
ఇంకోచోట మరో విద్యార్థినికి అస్వస్థత
పాతపట్నంలో వేర్వేరు కేంద్రాల్లో ఘటనలు
పాతపట్నం, మే 18:

పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలని.. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎంతో కష్టపడి చదివాడు. బుధవారం విపరీతమైన తలనొప్పి.. వాంతులు చేసుకున్నాడు. చికిత్స చేసి పర్యవేక్షణలో ఉండాలని వైద్యసిబ్బంది చెప్పారు. అయినా ఆ విద్యార్థి పరీక్ష రాయాలని నిర్ణయించుకుని కేంద్రానికి వెళ్లాడు. పరీక్ష రాస్తూ అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. జీవితంలో అదే చివరి పరీక్షగా.. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. పాతపట్నంలో ఇంటర్‌ విద్యార్థి బూరాడ కార్తీక్‌(16) విషాదాంతమిది.

- అలాగే మరో విద్యార్థిని తూలుగు ధనలక్ష్మి కూడా పరీక్ష రాస్తూ అస్వస్థతకు గురైంది. కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం కోలుకుంది.

ఈ రెండు ఘటనలూ పాతపట్నంలోనే వేర్వేరు పరీక్షా కేంద్రాల్లో చోటుచేసుకోవడం గమనార్హం.

పాతపట్నంలోని కిరణ్మయి జూనియర్‌ కళాశాల కేంద్రంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం కెమెస్ట్రీ పరీక్ష రాస్తూ బూరాడ కార్తీక్‌(16) మృతి చెందాడు. సారవకోట మండలం ధర్మలక్ష్మీపురం పంచాయతీ దాసుపురానికి చెందిన కార్తీక్‌.. పాతపట్నంలో బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంలో ఉంటూ మహేంద్ర జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ చదువుతున్నాడు. బుధవారం ఉదయం తలనొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నాడు. వెంటనే వసతిగృహ సిబ్బంది స్థానిక సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందజేయగా.. కొద్దిసేపటికి కాస్త కోలుకున్నాడు.  పర్యవేక్షణలో ఉంచాలని వైద్య సిబ్బంది సూచించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలుపగా.. ఎక్కువగా కష్టంగా ఉంటే.. పరీక్షకు వెళ్లొద్దని వారు సూచించారు. కాగా.. ఎలాగైనా పరీక్ష రాయాలనే ఉద్దేశంతో.. వైద్యులకు విజ్ఞప్తి చేస్తూ బీసీ వసతిగృహానికి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి పరీక్ష కేంద్రానికి హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభమైన అరగంటలోనే పరీక్ష రాస్తూ.. కళ్లు తిరిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే ఇన్విజిలేటర్‌ గమనించి.. ఈ విషయాన్ని చీఫ్‌ ఎగ్జామినర్‌కు తెలియజేశారు. పోలీసులు, సిబ్బంది సహకారంతో చికిత్స నిమిత్తం కార్తీక్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని.. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యసిబ్బంది సూచించారు. దీంతో పాతపట్నంలోని సామాజిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే కార్తీక్‌ మృతి చెందాడని వైద్యాధికారి బాలకృష్ణ తెలిపారు. ఇంట్రాసెలిబ్రల్‌ సంబంధిత కారణాలతో మృతి చెంది ఉంటాడని అభిప్రాయపడ్డారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రాగామానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మహ్మద్‌ అమీర్‌ అలీ తెలిపారు.

విద్యార్థినికి అస్వస్థత
పాతపట్నంలో మహేంద్ర జూనియర్‌ కళాశాల కేంద్రంలో బుధవారం పరీక్ష రాస్తూ తూలుగు ధనలక్ష్మి అస్వస్థతకు గురైంది. హిరమండలం మండలం ధనుపురానికి చెందిన ఈ విద్యార్థిని పాతపట్నంలోని కిరణ్మయి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కాగా, బుధవారం పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికి ధనలక్ష్మి కడుపునొప్పితో బాధపడుతూ.. కళ్లు తిరిగి అస్వస్థతకు గురైంది. వెంటనే సిబ్బంది ఆమెను స్థానిక సామాజిక ఆస్పత్రి తరలించగా.. చికిత్స అనంతరం కోలుకుంది. మధ్యాహ్నం ఆ విద్యార్థినిని ఇంటికి పంపారు.

మండువేసవే కారణమా..
పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండుటెండలో పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని కొందరు పేర్కొంటున్నారు. పాతపట్నంలోని బుధవారం ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో.. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  

మిన్నంటిన రోదనలు
సారవకోట(జలుమూరు) : కార్తీక్‌ మృతితో రోదనలు మిన్నంటాయి. స్వగ్రామమైన దాసుపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు శ్యాంసుందరరావు, కుమారిలు బోరున విలపించారు. పరీక్షలు రాసి.. ఆనందంగా ఇంటికి వస్తావునుకుంటే.. ఇలా తీరని లోకాలకు వెళ్లిపోయావా.. నాయనా.. అంటూ తల్లి రోదన చూపరులను కంటతడి పెట్టించింది. తలకొరివి పెడతావనుకుంటే.. నీకే మేము తలకొరివి పెట్టాల్సి వచ్చిందని తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులతో పాటు తోటి విద్యార్థులంతా విషాదంలో మునిగిపోయారు. దాసుపురంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2022-05-19T04:56:57+05:30 IST