గల్ఫ్‌ వలసదారులపై నీడ

ABN , First Publish Date - 2020-03-29T11:01:32+05:30 IST

జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన కార్మికులను ’కరోనా వైరస్‌’ వేధిస్తోంది. గోదావరి జిల్లాలకు చెందిన వేలాది

గల్ఫ్‌ వలసదారులపై నీడ

స్వస్థలాలకు వచ్చిన తర్వాత అనారోగ్యం

కోవిడ్‌-19 లక్షణాలతో పలువురు ఆసుపత్రుల్లో చేరిక

 కోనసీమ నుంచి కాకినాడ జీజీహెచ్‌కు వెళ్తున్న అనుమానితులు


(ఆంధ్రజ్యోతి-అమలాపురం): జీవనోపాధి  కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన కార్మికులను ’కరోనా వైరస్‌’ వేధిస్తోంది. గోదావరి జిల్లాలకు చెందిన వేలాది మంది పురుషులు, మహిళలు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ సహా వివిధ దేశాలకు వలసబాట పట్టారు. అక్కడి నుంచి స్వస్థలాలకు వస్తున్న వ్యక్తులు స్వల్ప అనారోగ్యానికి గురైనా కరోనా సోకిందనే భయంతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలను నిర్ధారించేందుకు కొన్ని రోజుల వ్యవధి పట్టనుండడంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన వారు ఆందోళనతో కాకినాడ క్యూ కడుతున్నారు.


గత రెండు రోజులుగా కోనసీమలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఈ వ్యాధి లక్షణాల అనుమానంతో ఆసుపత్రులకు వెళ్తున్నారు. మరోవైపు విదేశాల నుంచి వచ్చిన వారి జాబితాను విదేశాంగ శాఖ ద్వారా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు అందించడంతో ఆ వ్యక్తులపై పూర్తిస్థాయిలో నిఘా పెడుతున్నారు. ఆరోగ్యంలో తేడా వస్తే వారిని వెంటనే ఆంబులెన్సుల్లో కాకినాడ జీజీహెచ్‌కు  తరలిస్తున్నారు. కరోనా వైరస్‌ విదేశీ వ్యక్తులపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కువైట్‌లో ఆంక్షలు విధించ డంతో పాటు గల్ఫ్‌ దేశాల నుంచి వలస కార్మికులను


 తిరిగి పంపించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడకు వెళ్లి వచ్చిన వారికి రోగ లక్షణాలు ఉంటే వివిధ దశల్లో స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించి నిర్ధారిస్తున్నారు. అయితే ఆయా దేశాల నుంచి వచ్చేవారిని విమానాశ్రయాల్లో పూర్తిస్థాయిలో తనిఖీ చేసి వారి చిరునామాలను ఆయా జిల్లాల్లోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు అందిస్తున్నారు. దాంతో వారి కదలికలపై ఆయా  ప్రాంతాల వైద్య సిబ్బంది కొన్ని రోజులుగా నిఘా ఉంచి గృహ నిర్బంధంలోనే ఉంచుతున్నారు. అయితే మూడు రోజులుగా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలతో కోనసీమలోని పలు గ్రామాలకు చెందివారు మానసిక ఆందోళనకు గురై పరీక్షలు చేయించుకునేందుకు కాకినాడలోని జీజీహెచ్‌కు వెళ్తున్నారు. 


అమలాపురం రూరల్‌ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గల్ఫ్‌ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి 37 మంది వరకు స్వస్థలాలకు వచ్చారు. అయితే వారికి సంబంధించిన సమాచారం విదేశాంగ శాఖ నుంచి స్థానిక వైద్య సిబ్బందికి అందడంతో పద్నాలుగు రోజుల పాటు ఇళ్లల్లోనే ఉంచి పరిశీలిస్తున్నారు. పేరూరుకు చెందిన ఒక వ్యక్తికి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానంతో ఆదివారం రాత్రి కాకినాడ తరలించారు. దగ్గు, జ్వరం ఎక్కువగా ఉండడం వల్ల అనుమానంతో వైద్యులను ఆశ్రయించడంతో కాకినాడ తీసుకువెళ్లారు. రావులపాలెం మండలం దేవరపల్లి శివారు మట్లదొడ్డికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 12న దుబాయ్‌  నుంచి వచ్చాడు. అతడికి దగ్గు తీవ్రంగా రావడంతో ముందస్తు చర్యలో భాగంగా గోపాలపురం పీహెచ్‌సీ వైద్య సిబ్బంది కాకినాడ జీజీహెచ్‌లో ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. దుబాయ్‌ నుంచి స్వగ్రామమైన సఖినేటిపల్లి వచ్చిన ఒక మహిళ రాత్రి అనారోగ్యంతో కాకినాడ జీజీహెచ్‌లో చేరినట్టు సమాచారం.


రాజోలుకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం కువైట్‌ నుంచి కడలిలోని సొంతింటికి వచ్చినప్పటికీ దగ్గు వంటి లక్షణాలు ఉండడంతో ముందు జాగ్రత్తగా రాజోలు ఆసుపత్రి వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకున్నాడు. మలికిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా వ్యాధి లక్షణాలున్నట్టు భావించి కాకినాడ జీజీహెచ్‌కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లారు. రాజమహేంద్రవరంలోని దానవాయిపేటకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ లక్షణాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి అమలాపురం వచ్చే ఇంద్ర బస్సులో ప్రయాణికులపైనా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టినట్టు సమాచారం. ఎవరెవరూ ఏయే దేశాల నుంచి వస్తున్నారు, వారి ఆరోగ్య పరిస్థితి వంటి సమాచారాన్ని ఆర్టీసీ అధికారులు సేకరిస్తున్నారు. 

Updated Date - 2020-03-29T11:01:32+05:30 IST