అనాధ పిల్లల కోసం ఇంటినే అమ్మేశాడు..

ABN , First Publish Date - 2021-02-21T17:47:04+05:30 IST

నైస్‌’... అంటే ‘నీడీ ఇల్లిటరేట్‌ చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌’. అనాధలను చూసినప్పుడు నా కళ్లు చెమర్చి... మనసు ద్రవించి... గుండె లోతుల్లో నుంచి పుట్టిన ఆలోచన ఇది! నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఓ సంస్థ ఉండాలనే ...

అనాధ పిల్లల కోసం ఇంటినే అమ్మేశాడు..

తెల్ల చొక్కా... పీక్కుపోయిన ముఖం ... భుజానికో సంచీ... పాత స్కూటర్‌పై ఉదయాన్నే మొదలవుతుంది ఆయన ప్రయాణం. అది తన కోసం కాదు... 250 మంది పిల్లల భవిష్యత్తు కోసం. రెండు దశాబ్దాలుగా ఇదే ఆయన దైనందిన జీవితం. రోడ్లపై బతుకీడుస్తున్న అనాధలను చేరదీసి... ఉచితంగా వసతి, విద్యాబుద్ధులు చెబుతున్నారు. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది తిరిగి ఈ సమాజానికి అందిస్తున్నారు పోపూరి పూర్ణచంద్రరావు ఉరఫ్‌ ‘నైస్‌’ పూర్ణచంద్రరావు.  

‘నైస్‌’... అంటే ‘నీడీ ఇల్లిటరేట్‌ చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌’. అనాధలను చూసినప్పుడు నా కళ్లు చెమర్చి... మనసు ద్రవించి... గుండె లోతుల్లో నుంచి పుట్టిన ఆలోచన ఇది! నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఓ సంస్థ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాను. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఇవ్వాళ ఇంతమంది బాలల భవిష్యత్తుకు పునాదులు వేయగలుగు తున్నానంటే... దాని వెనక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది. ఆటుపోట్లు... అవమానాలూ ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొల్లపల్లి గ్రామం మాది. నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబం. నేనొక్కడినే సంతానం. మా అమ్మ సీతమ్మ. నాకు నాలుగేళ్లప్పుడు నాన్న చనిపోయాడు. ఒక్కసారిగా భారం అమ్మపై పడింది. పొలాల్లో కూలీ పని చేసి నన్ను సాకింది. అమ్మ కష్టంతో 1989 (ఇంగ్లిష్‌)లో బీఏ పూర్తి చేశాను. 


కన్ను దెబ్బతిన్నాక ...

చదువు పూర్తవ్వగానే పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్‌ వచ్చాను. ఇక్కడ ఓ సంస్థలో ఏడొందల రూపాయలకు క్లర్క్‌గా ఉద్యోగం దొరికింది. అందులో ఏడేళ్లు చేసి, ఆ తరువాత ఓ ఫార్మా కంపెనీలో చేరాను. అందులో పనిచేస్తుండగా కెమికల్‌ రియాక్షన్‌ అయ్యింది. నా ఎడమ కన్ను పోయింది. వైద్యానికి కంపెనీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నా పేదరికాన్ని చూసి నాకే బాధ కలిగింది. ఇక, అనాధలకు ఇలాంటి సంఘటనలు జరిగితే ఎలా బతుకుతారు? అనిపించింది. వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపించింది. ‘క్రై’ (చైల్డ్‌ రిలీఫ్‌ అండ్‌ యూ) ఎన్‌జీఓలో చేరాను. ఐదేళ్లు పని చేశాక బయటకు వచ్చేశా. నేనే ఎందుకు ఓ సంస్థను ప్రారంభించకూడదని అనుకున్నాను. ఎన్‌జీఓ నెలకొల్పాలన్న ఆలోచన మెదిలిన వెంటనే కార్యక్షేత్రంలోకి దిగాను. భవిష్యత్తుకు తొలి అడుగు విద్య. ఆ విద్య అందక తల్లిదండ్రులు లేనివారు ఎంతో మంది నేడు దుర్భరంగా బతుకుతున్నారు. అలాంటి వారికి చదువు అందించడం ద్వారా వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడటమే కాకుండా, ఈ సమాజానికి, దేశానికీ మేలు జరుగుతుందన్నది నా ఆలోచన. కానీ నిధులు ఎక్కడి నుంచి తేవాలి? మా ఊళ్లో నాకో చిన్న ఇల్లు ఉండేది. దాన్ని అమ్మితే రూ.60 వేలు వచ్చింది. ఆ డబ్బుతో గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని కనపర్తి గ్రామంలో 60 సెంట్ల స్థలం కొన్నాను. అందులో ఓ చిన్న భవనం కట్టించాను. అలా 2002లో ‘నైస్‌’కు శ్రీకారం చుట్టాను. ఐదు నుంచి పదో తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో నడిచే రెసిడెన్షియల్‌ పాఠశాల ఇది.  


ఇంటింటికీ తిరిగి... 

చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. కొందరు పిల్లల్ని ‘నైస్‌’లో చేర్చుకున్నాం. కానీ దాని నిర్వహణకు చేతిలో రూపాయి లేదు. దీంతో నా పీఎఫ్‌లో ఉన్న రూ.20 వేలు తీసేసి ఖర్చు పెట్టాను. చందాల కోసం హైదరాబాద్‌లో ఇంటింటికీ తిరిగాను.  

బడిలో పిల్లలు పెరుగుతున్నారు. ఉన్న భవనం సరిపోవడం లేదు. ఇది గమనించిన ‘నాట్కో’ చైర్మన్‌ వెంకయ్య చౌదరి నన్నపనేని కొత్త భవనం కోసం రూ.50 లక్షలు ఇచ్చారు. ‘నాట్కో ట్రస్టు’ ప్రాజెక్ట్‌ హెడ్‌ స్వాతి కాంతామణి, రాజీవ్‌లు పాఠశాల గ్రంథాలయానికి సహాయం అందించారు.  సంస్థ పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.13 కోట్ల నిధులు సేకరించాం. అందులో రెండు కోట్లతో అన్ని వసతులతో విశాలమైన భవనం నిర్మించాం. రేపు నేను ఉన్నా లేకపోయినా ‘నైస్‌’ నిరాటంకంగా నడిచేందుకు రెండు కోట్ల రూపాయలు కార్పస్‌ ఫండ్‌ కింద పెట్టాను. ఇక్కడ చదివిన విద్యార్థుల్లో కొందరు సీఏలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అయ్యారు. ఐఐటీ, ఐఐఎంలలో చదువుకున్న శరత్‌చంద్ర తొమ్మిదేళ్లుగా ఉచితంగా పాఠాలు చెబుతున్నారు. అలాగే అమెరికాలోని ‘హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌’ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌ కొమ్ము... ‘నైస్‌’ నిస్వార్థ సేవపై అక్కడ గొప్పగా ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఇలాంటివి నా బాధ్యతను రెట్టింపు చేశాయి. 

- హనుమా


మా ఊళ్లో నాకో చిన్న ఇల్లు ఉండేది. దాన్ని అమ్మితే రూ.60 వేలు వచ్చింది. ఆ డబ్బుతో గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని కనపర్తి గ్రామంలో 60 సెంట్ల స్థలం కొన్నాను. అందులో ఓ చిన్న భవనం కట్టించాను. అలా 2002 లో ‘నైస్‌’కు శ్రీకారం చుట్టాను ..

Updated Date - 2021-02-21T17:47:04+05:30 IST