అక్రమ ఇసుక రవాణా

ABN , First Publish Date - 2020-05-23T09:28:10+05:30 IST

జిల్లాలోని హుజూర్‌నగర్‌లో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది.

అక్రమ ఇసుక రవాణా

గోదావరి ఇసుక హుజూర్‌నగర్‌లో అమ్మకం

అనుమతి హైదరాబాద్‌కు, దిగుమతి హుజూర్‌నగర్‌లో


హుజూర్‌నగర్‌, మే 22: జిల్లాలోని హుజూర్‌నగర్‌లో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. ఈ ప్రాంతంలో స్థానిక వాగులు, వంకలు కృష్ణానదీ తీరంలోని ఇసుకతో పాటు గోదావరి నుంచి తెచ్చిన ఇసుక సైతం లభిస్తోంది. అధికారుల కనుసన్నల్లో రాజకీయ పలుకుబడితో ఇసుక అక్రమ రవాణాకు బాటలు వేస్తున్నారు. వాస్తవంగా లారీ ఇసుక రూ.30 వేలు ఉంటుంది. కానీ రూ.లక్షకు వినియోగదారులకు అమ్ముతున్నారు. హుజూర్‌నగర్‌ కేంద్రంగా ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కొంతమంది కాంట్రాక్టర్లు ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని కృష్ణానది నుంచి టన్నుల కొద్దీ ఇసుకను తరలిస్తున్నారు. దీంతో పాటు వేములూరి ప్రాజెక్ట్‌ వాగు, వంకల నుంచి జోరుగా ఇసుక రవాణా జరుగుతోంది. హుజూర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన కొంతమంది ఇసుక వ్యాపారులు గోదావరి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. 30 టన్నుల ఇసుక సుమారు రూ.30వేలు పడుతుండగా అది రూ.లక్ష    వరకు అమ్ముతున్నారు. వాస్తవంగా టన్ను రూ.1500 ఉంటుంది. దానికి రెట్టింపు చేసి రూ.3వేల వరకు టన్ను ఇసుక అమ్ముతున్నారు. 


భద్రాచలం ప్రాంతంలోని కాళేశ్వరం ర్యాంపు, జయశంకర్‌ భూపాల్‌పల్లి ర్యాంప్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లాల్సిన ఇసుక లారీలు హుజూర్‌నగర్‌లో అమ్ముతున్నారు. ప్రతిరోజూ హుజూర్‌నగర్‌లో 10 లారీల ఇసుక రవాణా జరుగుతోంది. పేరుకు హైదరాబాద్‌ డీడీలు తీసే వ్యాపారులు, హుజూర్‌నగర్‌ ప్రాంతంలో దిగుమతిచేసి అక్రమ వ్యాపారానికి తెరతీస్తున్నారు. హుజూర్‌నగర్‌ కేంద్రంగా ప్రతినెలా సుమారు రూ.2కోట్ల ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. హుజూర్‌నగర్‌లోని ఎన్నెస్పీ క్యాంపు, ఎన్జీవో కాలనీ, లింగగిరి రోడ్డు ప్రాంతాల్లోని కొంతమంది వ్యాపారులు ఈ వ్యాపారం పెద్దఎత్తున కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే,గత కొన్నిరోజులుగా హుజూర్‌నగర్‌లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు, రెండు ఇసుక లారీలను పోలీసులు పట్టుకొని కేసు నమోదుచేశారు. కోదాడలో దిగుమతి చేయాల్సిన లారీ ఇసుకను హుజూర్‌నగర్‌లో దిగుమతి చేశారు. అదేవిధంగా లింగగిరి, శ్రీనివాసపురం, యాతవాకిళ్ల ప్రాంతాల్లోని వేములూరి ప్రాజెక్ట్‌ వాగునుంచి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను కూడా సీజ్‌చేశారు. కాగా భద్రాచలం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలనుంచి ఆన్‌లైన్‌లో హైదరాబాద్‌కు పర్మిషన్‌ తీసుకున్న వ్యాపారులు వాటిని హుజూర్‌నగర్‌ ప్రాంతంలో అక్రమ రవాణా చేయడం గమనార్హం.


టన్ను ఇసుక రూ.1500 పలుకుతుండగా, రవాణాచార్జీలు మిగుల్చుకోవడం కోసం కొంతమంది వ్యాపారులు హుజూర్‌నగర్‌ను అడ్డాగా చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. హుజూర్‌నగర్‌కు చెందిన ముగ్గురు ఇసుక వ్యాపారులు నిత్యం అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించు కోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.కృష్ణా, గోదా వరి నదుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక వ్యాపారాన్ని అడ్డుకోవాలని పరిశీలకులు కోరుతున్నారు. 


ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు 

ఇసుక అక్రమ రవాణాచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఒకలారీ, మూడు ట్రాక్టర్లను ఇటీవల సీజ్‌చేశాం. కోదాడలో దిగుమతి కావాల్సిన ఇసుకను హుజూర్‌నగర్‌లో డంపింగ్‌ చేస్తున్నారు. అక్రమ రవాణాపై నిఘా వేశాం. 

అనిల్‌ రెడ్డి, ఎస్‌ఐ 


Updated Date - 2020-05-23T09:28:10+05:30 IST