పరువే పెట్టుబడిగా !

ABN , First Publish Date - 2022-09-24T05:11:49+05:30 IST

స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్నట్లే.. సులభంగా అనేక మార్గాల ద్వారా పనులు పూర్తి చేసుకునే వీలు కలుగుతుంది..

పరువే పెట్టుబడిగా !

రుణయాప్‌ నిర్వాహకుల ఆగడాలు 

యమపాశాలుగా మారుతున్న లోన్‌యాప్‌లు 

వడ్డీతో సహా రుణం మొత్తం చెల్లించినా ఆగని బెదిరింపులు  

బంధువులు, స్నేహితులకూ తప్పని వేఽధింపులు

 

పాలకొల్లు మండలంలోని ఆగర్రుకు చెందిన ఒక యువకుడు లోన్‌ యాప్‌ ద్వారా రూ.5వేలు రుణం పొందాడు. మొదటి వాయిదా సక్రమంగా చెల్లించినా రెండ వ వాయిదా తేదీకి లోన్‌ యాప్‌ పనిచేయకపోవడంతో రుణం తీర్చలేకపోయాడు. మరునాడే ‘సన్‌ ఆఫ్‌ లోన్‌ ఫ్రాడ్‌’ అంటూ అతని కుమారుడి ఫొటోపై  రాసి వాట్సాప్‌ ద్వారా పంపి బెదిరింపులకు పాల్పడ్డారు. 


యలమంచిలికి చెందిన ఒక వ్యక్తి లోన్‌ యాప్‌ ద్వారా రూ.7,500 రుణం తీసుకుని వడ్డీతో కలిపి రూ.18 వేలు చెల్లించినా ఇంకా చెల్లించాలంటూ అతని మిత్రులకు ఆ వ్యక్తి ఐదేళ్ల వయసు కలిగిన బాలికపై అత్యాచారం చేశాడంటూ వాట్సప్‌ మెస్సేజ్‌లు పంపించడంతో ఆవ్యక్తి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.


పాలకొల్లు రూరల్‌, సెప్టెంబరు 23: స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్నట్లే.. సులభంగా అనేక మార్గాల ద్వారా పనులు పూర్తి చేసుకునే వీలు కలుగుతుంది.. వీటిలో ఆదాయం పొందే మార్గం ఒకటి. అక్రమ మార్గంలో ఆదాయాలు పొందేందుకు రుణయాప్‌ల నిర్వాహకులు ప్రజలను సులువుగా మోసగిస్తూ అధిక ఆదాయం పొందేందుకు ప్రయత్నించడం చూస్తూనే ఉన్నాం.. లోన్‌ యాప్‌ ద్వారా రుణం పొంది వడ్డీతో సహా మొత్తం అప్పు తీర్చినా ఇంకా చెల్లించాల్సి ఉందంటూ యాప్‌ల నిర్వాహకులు బెదిరిస్తున్నారు. తమకు అందుబాటులోని రుణం పొందిన వ్యక్తికి చెందిన ఫొటో, వారి బంధువుల ఫొటోలతో అతని బంధువులకు, స్నేహితులకు మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు, అసభ్య పదజాలంతో ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు. లోన్‌ యాప్‌ ద్వారా రుణం పొందిన వ్యక్తులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

ఒక్కసారి సామాజిక మాధ్యమం ద్వారా లోన్‌యాప్‌ ఓపెన్‌ చేస్తే వచ్చే ప్రొఫైల్‌ను పూర్తి చేసి యాప్‌ల నిర్వాహకులు అడిగిన సమాచారం పంపాల్సి ఉంటుంది. అలా పంపిన సమాచారం ప్రకారం ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం వారి అధీనంలోకి వెళుతుంది. దీంతో రుణగ్రస్థుడు ఎవరెవరికి ఫోన్‌ చేస్తున్నాడు. ఫోన్‌ ద్వారా చెల్లింపులు, కొనుగోళ్లు తదితర వివరాలన్నీ యాప్‌ల నిర్వాహకులు గమనిస్తూనే ఉంటారు. తద్వారా రుణగ్రస్థుడి బంధు మిత్రుల ఫోన్‌ నెంబర్లు ఉండడంతో యాప్‌ల నిర్వాహకుల బెదిరింపులకు లొంగి ఉండాల్సిన పరిస్థితి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా లోన్‌యాప్‌ నిర్వాహకుల ఆగడాలకు అనేక మంది బాధితులుగా మారుతున్నారు. ఇటీవలే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు ఆన్‌లైన్‌ రుణయాప్‌లను నిషేధించింది. తాము నిషేదించిన యాప్‌లను ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్లేస్టోర్‌, క్రోమ్‌ వంటి సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని సూచించింది. లోన్‌యాప్‌ల వల్ల వ్యక్తిగత డేటా చౌర్యం జరుగుతున్నందున యాప్‌ల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ నిపుణులు సూచిస్తున్నారు. 


లోన్‌ యాప్‌లకు బలికావొద్దు : డీఎస్పీ 

నరసాపురం టౌన్‌ : లోన్‌ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరం కోసం వీటిని ఆశ్రయించి లోన్‌ తీసుకుంటే బలైనట్టేనని డీఎస్పీ వీరాంజనేయరెడ్డి అన్నారు. స్థానిక కల్యాణ మండపంలో లోన్‌ యాప్‌లు, ఆన్‌లైన్‌ మోసాలపై శుక్రవారం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో చాలామంది ఆన్‌లైన్‌లో జూదం, లాటరీ టిక్కెట్లకు బానిసలుగా మారుతున్నారని, ఇవన్నీ మోసాలేనన్నారు.  ఎక్కడైనా లోన్‌ యాప్‌ల నుంచి బెదిరింపులు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో సీఐలు శ్రీనివాస యాదవ్‌, సురేష్‌కుమార్‌, ఎస్‌ఐలు సుధాకర్‌రెడ్డి, ప్రియకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.  


యాప్‌ పని చేయకుండా చేసి ఆపై బెదిరింపులు

రుణం తీసుకుని వాయిదా చెల్లించే సమయానికి నిర్వాహకులు యాప్‌ పనిచేయకుండా చేసి రుణం  తిరిగి చెల్లించలేదంటూ నా కుమారుడి ఫొటోపై అడ్డం గా డిఫాల్టర్‌గా రాసి నాకే వాట్సప్‌లో పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరతాను 

– విజమూరి సుమంత్‌కుమార్‌, ఆగర్రు, పాలకొల్లు మండలం 


లోన్‌ యాప్‌లపై ధైర్యంగా ఫిర్యాదు చేయండి.

లోన్‌ యాప్‌ బాధితులు ధైర్యంగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.  బాధితులు పెరుగుతున్న దృష్ట్యా ఎస్పీ రవిప్రకాశ్‌ బాధితుల ఫిర్యాదులు స్వీకరించి, రుణ యాప్‌ల నిర్వాహకులపై ఐటీ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేసి బాధితులకు మానసిక స్థైర్యాన్ని అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రుణ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 

–జేవీఎన్‌ ప్రసాద్‌ ఎస్‌ఐ, యలమంచిలి

Updated Date - 2022-09-24T05:11:49+05:30 IST