ఆగని ఇసుక దందా

ABN , First Publish Date - 2020-08-10T10:13:32+05:30 IST

జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఫలితంగా వాగులు, వంకలన్నీ వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటి

ఆగని ఇసుక దందా

వాగులు, వంకలను తోడేస్తున్న అక్రమార్కులు

రాత్రి వేళల్లో దూర ప్రాంతాలకు తరలింపు

మామూళ్ల మత్తులో అధికారులు


ఆసిఫాబాద్‌, ఆగస్టు9: జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఫలితంగా వాగులు, వంకలన్నీ వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. జిల్లాలో ఎలాంటి ఇసుక రీచ్‌లు లేక పోయినా  ట్రాక్టర్ల యజమానులు నామమాత్రంగా పర్మిట్‌లు తీసుకుంటూ ఒక్కో పర్మిట్‌పై పదేసి ట్రిప్పుల చొప్పున ఇసుకను తరలిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంలో రెవెన్యూ, పోలీసులు, పలువురు ప్రజాప్రతినిధుల అండదం డలు ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లా కేంద్రంతో సహా 15 మండలాల్లోనూ అక్రమా ర్కులు మాఫియాగా ఏర్పడి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు.  ఆసిఫాబాద్‌ పట్టణ శివారులోని పెద్దవాగు మొదలుకుని దహెగాం మండలంలోని ఎర్రవాగు వరకు నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్న ఇసుకదొంగలు ప్రొక్లెయిన్లు ఉపయోగించి మరీ తవ్వుతున్నారు.  


ట్రాక్టర్లతో రహస్య ప్రాంతాల్లో డంపింగ్‌

జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న వాగులు, వంకల  నుంచి ఇసుకను వ్యాపారులు తరలిస్తున్నప్పటికీ రెవెన్యూ, భూగర్భ జల వనరుల శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. మార్కెట్‌లో ప్రస్తుతం టన్ను ఇసుకకు రూ.2000 నుంచి రూ.2500 వరకు ధర పలుకుతోంది. నిబంధనల ప్రకారం లారీలలో ఇసుక తరలించరాదన్న ఆదేశాల దృష్ట్యా అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రహస్య ప్రాంతాల్లో డంప్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి లారీల్లో ఇసుకను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. 


భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం 

 జిల్లా భౌగోళికంగా అనేక వైరుద్యాలతో కూడుకొని ఉన్న ప్రాంతం కావడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల స్థితి అసమతుల్యంగా ఉంటుంది. భూగర్భ జలాలు ఎండాకాలంలో పాతాళానికి చేరి మనుషులకే కాకుండా పశు పక్షాదులు, జంతువులకు తాగునీటి సమస్యలు ఉత్పన్నం కావడం ఇక్కడ సర్వ సాధారణం. వాగులు, వంకల్లో అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాల మూలంగా  భూగర్భ జలాల మట్టం కూడా దారుణంగా పడి పోతున్నట్లు  భూగర్భ జల వనరుల శాఖ సేకరించిన సర్వేల్లో వెల్లడైంది.  దాంతో ఆయా ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలు, గూడాల్లో తీవ్ర తాగునీటి సంక్షోభం తలెత్తుతున్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం నదులు, ఉప నదుల్లోనే మీటర్‌ లోతుకు మించి ఇసుక తవ్వకాలు జరపడం నిషేధం. వాల్టా చట్టాన్ని అనుసరించి వాగులు, వంకల్లో అసలు ఇసుకు తీయరాదు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల వల్ల నీటి వనరులన్నీ ఆవిరై పోయి వన్యప్రాణులకు తాగునీటి లభించని పరిస్థితి ఉత్పన్నమవుతోంది. దీంతో నీటి కోసం అటవీ జంతువులు గ్రామాల్లోకి రావడంతో రైతుల ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. 


మండలాల వారీగా..

ఆసిఫాబాద్‌ పట్టణ సమీపంలోని పెద్దవాగులో ఇసుకను అక్రమార్కులు తోడేస్తున్నారు. నిత్యం ఇక్కడి నుంచి వందల ట్రాక్టర్లలో ఇసుకను ఆదిలాబాద్‌, వాంకిడి, తిర్యాణి, కెరమెరి మండలాలతో పాటు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మండలంలోని గుండి, రహపల్లి, మొరంవాగుల నుంచి రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుక డంప్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇసుకను లారీలలో లోడ్‌ చేసి మహారాష్ట్ర, ఆదిలాబాద్‌, మంచిర్యాల ప్రాంతాలకు రవాణా చేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. రెబ్బెన మండలంలోని పులికుంట, గంగాపూర్‌, కొండపల్లి, నవేగాం వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి మండలంలోని పలు గ్రామాలతో పాటు వాంకిడి, కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యు), మంచిర్యాల జిల్లాలోని తాండూర్‌ మండలానికి సైతం ఇసుక రవాణా జరుగుతోంది. 


దహెగాం మండల కేంద్రంలోని పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. కల్వాడ గ్రామం వద్ద గల ఎర్రవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. కౌటాల మండలంలో ముత్తంపేట, తాట్‌పల్లితో పాటు పలు నదులు, వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. చింతలమానేపల్లి మండలంలోని చింతలమానేపల్లి వాగుతో పాటు రుద్రాపూర్‌ వాగులోని ఇసుకను కొందరు అక్రమంగా తరలిస్తున్నారు.


కాగజ్‌నగర్‌ మండలంలోని రాస్పెల్లి, పెద్దవాగుల నుంచి ఇసుక అక్రమంగా తరలుతోంది. కెరమెరి మండలంలోని సాంగ్వీ, కైరితో పాటు పలు గ్రామాల్లోని ఒర్రెలు, వంకల నుంచి ప్రతి నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు.  అయితే ఈ వ్యవహారమంతా అధికారులకు తెలిసినప్పటికీ  మామూళ్ల మత్తులో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-08-10T10:13:32+05:30 IST