అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తి వేయాలి

ABN , First Publish Date - 2022-05-27T07:27:57+05:30 IST

సంస్థాన్‌ నారాయణపురంలో భూవివాదానికి సంబంధించి తమపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సర్పంచ్‌, పాలకవర్గ సభ్యులు, అఖిలపక్ష పార్టీల నాయకులు కోరారు

అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తి వేయాలి
సంస్థాన్‌ నారాయణపురంలో గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహిస్తున్న పాలకవర్గ సభ్యులు, అఖిలపక్ష నాయకులు

సంస్థాన్‌ నారాయణపురం, మే 26:  సంస్థాన్‌ నారాయణపురంలో భూవివాదానికి సంబంధించి తమపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సర్పంచ్‌, పాలకవర్గ సభ్యులు, అఖిలపక్ష పార్టీల నాయకులు కోరారు. అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం సంస్థాన్‌ నారాయణపురంలో నిర్వహించిన బంద్‌ విజయ వంతమైంది. మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయించడంతో పాటు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఆక్రమ కేసులు ఎత్తివేయాలని, ప్రభుత్వ భూములు కాపాడాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్‌, పాలకవర్గ సభ్యులు,  గ్రామ పంచాయతీ సిబ్బంది ధర్నా చేశారు. ప్రజాప్రతినిధులపై నమోదు  చేసిన అక్రమ కేసులను  ఎత్తివేయాలని ధర్నా చేశారు. ధర్నాకు అఖిల పక్షం నాయకులు మద్దతు తెలిపి సంఘీభావంగా ధర్నాలో పాల్గొన్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి యత్నించిన సర్పంచ్‌, పాలకవర్గ సభ్యులు, అఖిలపక్ష నాయకులపై కేసులు నమోదు చేయించడం దారుణమన్నారు.  గ్రామ పంచాయతి, ఆర్టీసీకి  చెందిన విలువైన స్థలాన్ని అధికారం అడ్డం పెటుకుని గుత్త ప్రేమ్‌చందర్‌ రెడ్డి అక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అధి కారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి వాస్తవాలను వెలికితీసి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూమిని పరి రక్షించే వరకు అందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష  నాయకులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-05-27T07:27:57+05:30 IST