తవ్వేయ్‌.. తోలేయ్‌..!

ABN , First Publish Date - 2022-09-18T05:33:49+05:30 IST

నూజివీడు నియోజకవర్గంలోని పలు క్వారీల్లో గ్రావెల్‌ తవ్వకాలు అక్రమంగా సాగుతున్నాయి.

తవ్వేయ్‌.. తోలేయ్‌..!
ఎక్స్‌కవేటర్‌తో తవ్వి ..

క్వారీల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు

నూజివీడు, సెప్టెంబరు 17 : నూజివీడు నియోజకవర్గంలోని పలు క్వారీల్లో గ్రావెల్‌  తవ్వకాలు అక్రమంగా సాగుతున్నాయి. ఆగిరిపల్లి మండలం తోటపల్లి క్వారీపై హైకోర్టు తీవ్రంగా స్పందించినా ఇతర క్వారీల్లో అనుమతులు లేకుండా నిర్భయంగా అధికార పార్టీ అండదండలతో తవ్వేస్తున్నారు. నూజివీడు మండలం రావిచర్ల గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 21లో బొందన గట్టును యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ఈ సర్వే నంబర్‌లో 12.35 ఎకరాల్లో తవ్వకాలకు మూడేళ్ళ కాల పరిమితిని విధిస్తూ గతంలో మైనింగ్‌ శాఖ అనుమతి ఇచ్చింది. కాల పరిమితి 2021 ఆగస్ట్‌ 31వ తేదీకి ముగిసినప్పటికి తిరిగి ఎలాంటి అనుమతులు పొందకుండా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ గట్టు నుంచి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా గ్రావెల్‌ తరలి వెళుతోంది. ఈ క్వారీని సందర్శించి ఆంధ్రజ్యోతి ఫొటోలు తీస్తుండగా ప్రొక్లెయిన్‌, ట్రాక్టర్‌ డ్రైవర్లు అక్కడి నుంచి తప్పుకున్నారు. ఈ క్వారీ వ్యవహారంపై రావిచర్లకు చెందిన ఎన్‌.జోజిబాబు, అధికారులకు స్పందన ద్వారా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. క్వారీల గడువు ముగిసినా మైనింగ్‌ శాఖ అధికారులు సదరు క్వారీలను పరిశీలించకపోవడం, తనిఖీలు చేపట్టకపోవడంతో పాత అనుమతులతోనే తవ్వకాలు సాగుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది.


Updated Date - 2022-09-18T05:33:49+05:30 IST